అమేథీలో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్
అమేథీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం అమేథీ లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఆయనతో పాటు తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంకా, రాబర్ట్ వాద్రా పాల్గొన్నారు. గౌరీగంజ్ కలెక్టర్ కార్యాలయంలో రాహుల్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాహుల్ మాట్లాడుతూ అమేథీ తన కుటుంబం లాంటిదని అన్నారు. 2004, 2009 ఎన్నికల్లో అమేథీ ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించారని, మరోసారి విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమేథీలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరని రాహుల్ అన్నారు. కాగా నరేంద్ర మోడీ వివాహ అంశంపై విలేకర్లు ప్రశ్నించగా మోడీ వ్యక్తిగత విషయాలపై తాను వ్యాఖ్యలు చేయబోనని తెలిపారు.
కాగా అంతకు ముందు రాహుల్ గాంధీకి ఘనస్వాగతం చెప్పేందుకు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సన్నాహాలు చేశారు. దాదాపు అయిదు వందల టన్నుల పూలతో పాటు, రాహుల్ వచ్చే దారి మొత్తం పూల బాటగా మార్చేశారు. నామినేషన్ దాఖలు చేయటానికి ముందు రాహుల్ అమేథీలో రోడ్ షో నిర్వహించారు.