క్లైమాక్స్ అదిరింది!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ క్లైమాక్స్ అదిరింది. బిల్లు నెగ్గాలి. కానీ సీమాంధ్రలోనూ తమ ఎంపీలకూ మైలేజ్ రావాలి. నాటకం రసవత్తరంగా సాగాలి. ఇదీ వార్‌రూమ్ వేదికగా కాంగ్రెస్ అధిష్టా నం సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు చేసిన దిశానిర్దేశం.
తెలంగాణ బిల్లు తుది ఘట్టానికి చేరేసరికి కాంగ్రెస్ తనదైన శైలితో రాజకీయానుభవాన్ని ప్రదర్శిస్తోంది. సభలో ఎవరు ఎలా నడుచుకోవాలో పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్, జీఓఎం సభ్యుడు జైరాం రమేశ్‌లు సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులకు మార్గనిర్దేశనం చేశారు. తెలంగాణ బిల్లుపై విపక్షాలు తమవైపే వేలెత్తుతున్న నేపథ్యంలో.. సీమాంధ్రకు చెందిన సొంత పార్టీ నేతలు పార్లమెంట్ వేదికగా ఎలా నడుచుకోవాలో చెప్పేందుకు మంగళవారం రాత్రి ఇరుప్రాంతాల నేతలతో కాంగ్రెస్ అధిష్టానం ఒక భేటీ ఏర్పాటుచేసింది.
ఈ సమావేశంలో సీమాంధ్రలో పార్టీ పరిస్థితి, గెలుపోటములను ఆ ప్రాంత ఎంపీలు, కేంద్ర మంత్రులు ప్రస్తావించారు. బిల్లు ప్రస్తుత రూపంలో వద్దని, సవరణలు కావాలని పట్టుబట్టారు. ఆర్థిక ప్యాకేజీ, పోలవరం ముంపు ప్రాంతాలు సీమాంధ్రలోనే ఉండేలా చూడడం వంటి సవరణలన్నీ కేంద్ర మంత్రులు ప్రతిపాదిస్తారని, వీటిని కేంద్రమంత్రి జేడీశీలం చూడాలని అధిష్ఠానం పెద్దలు సూచించారు. ఇక సీమాంధ్రలో తదుపరి ఎన్నికల పర్వంలో గట్టెక్కాలంటే ఎంపీలు సభలో ప్రతిఘటించాలని.. అయితే ఇది సభావ్యవహారాలను నిలువరించే రీతిలో ఉండకూడదని ఆదేశించారు. ప్రభుత్వ, పార్టీ గౌరవాన్ని నిలబెట్టేందుకు అందరూ సహకరించాలని అధిష్ఠానం పెద్దలు ఎంపీలను కోరారు.
ఈ సందర్భంగా సీమాంధ్ర నేతలు దాదాపు 10 సవరణలు ప్రతిపాదించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరారు. పదేళ్ల పాటు ఉమ్మడిగా ఉంటే ఏంటి?, యూటీగా ఉంటే ఏంటి? అని వాదించినట్టు సమాచారం. కర్నూలు, అనంతరపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని కొందరు కోరారు. ఇక రెవెన్యూ విషయంలో సీమాంధ్ర వాటా ఎంత? ఆర్థిక ప్యాకేజీ ఎంతిస్తారు? నీటి పంపకాలపై స్పష్టత ఏదీ? ఇక్కడి ఉన్న కేంద్ర సంస్థలు అక్కడ నెలకొల్పుతారా? లేదా?వంటి అంశాలను ఎంపీలు ప్రస్తావించారు.
విభజన చేసే పరిస్థితులలో హైదరాబాద్‌ను ఢిల్లీ తరహాలో రాష్ట్ర ప్రతిపత్తితో కూడిన కేంద్ర పాలితంగా ప్రకటించాలని, హైదరాబాద్‌లో ఉద్యోగులు, విద్యార్ధుల భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం సహా 10 సూచనలను కేంద్రమంత్రి చిరంజీవి పార్టీ పెద్దల ముందుంచారు. వాటిలో కొన్నింటి పైనైనా బిల్లులో మార్పులు తీసుకువస్తే సీమాంధ్ర ప్రజలను తాము ఒప్పించే ప్రయత్నం చేస్తామని చిరంజీవి చెప్పారు. ఈ సమయంలోనే పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తీవ్ర స్వరంతో అగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేయగా.. దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేష్‌లు జోక్యం చేసుకుని ‘ఎవరి అభిప్రాయాలను వారు చెప్పనీయండి’ అనడంతో పాల్వాయి మిన్నకుండిపోయారు. భేటీ అనంతరం ఆయా నేతలు మీడియాతో మాట్లాడారు.
‘తిరస్కరించిన బిల్లును తెస్తే వ్యతిరేకంగా ఓటేస్తాం’
‘ప్రస్తుత విభజన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించింది. తిరస్కరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టరాదని కోరాం. అలాకాకుండా బిల్లు తెస్తే పార్లమెంట్‌లో వ్యతిరేకంగా ఓటేస్తామని కచ్చితంగా చెప్పాం. బిల్లులో సీమాంధ్రకు న్యాయం చేస్తామని, అవసరమైన సవరణలు తెస్తామని జైరాం రమేశ్ చెప్పారు. అయితే మా ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లును ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం. బుధవారం రాష్ట్రపతిని కూడా కలుస్తాం’
- సీమాంధ్ర ఎంపీలు అనంత, మాగుంట శ్రీనివాసులురెడ్డి
‘సీమాంధ్రులకు న్యాయం జరగాలని మేమే కోరుతున్నాం’
‘రాష్ట్ర విభజన బిల్లు కచ్చితంగా ఆమోదిస్తామని, కీలకమైన ఐదారు బిల్లుల తర్వాత దీన్ని ప్రవేశపెడతామని అధిష్టాన పెద్దలు హామీ ఇచ్చారు. ఇది శుభపరిణామం. సీమాంధ్రులకు న్యాయం చేసేందుకు సిధ్దమని జైరాం, దిగ్విజయ్ తెలిపారు. రాయలసీమకు ప్యాకేజీ, హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామని అన్నారు. మేము సైతం సీమాంధ్రకు న్యాయం చేయాలనే కోరుకుంటున్నాం. అయితే బిల్లును అడ్డుకుంటామనడం మాత్రం సరైంది కాదు. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించాలి’- తెలంగాణ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
చర్చలు ఫలప్రదమే
‘సమస్య పరిష్కారం కోసం ఇలాంటి సమావేశాలు జరపాలని ఎప్పుడో కోరాం. ఇరుప్రాంతాల నేతలను కూర్చోబెడితేనే పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటివరకైతే చర్చలు ఫలప్రదమేనని భావిస్తున్నాం’
- కేంద్ర మంత్రి జేడీ శీలం
మంచి సమావేశం: దిగ్విజయ్
‘మంచి సమావేశం జరిగింది. అభిప్రాయాలు తెలుసుకున్నాం. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు చెప్పిన అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధం. రెండు ప్రాంతాల ప్రజలు తాము గెలిచామని భావించే పరిస్థితి ఉంటుంది’.