
సాగరతీరాన మువ్వన్నెల రెపరెపలు
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
సాక్షి, విశాఖపట్నం : విశాఖ సాగరతీరంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. సముద్ర అలలతో పోటీపడుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఎగసిపడింది. వేడుకల్లో పాల్గొన్న వివిధ ప్రభుత్వ శకటాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కళారూపాలు కనువిందు చేశాయి. విద్యార్థుల విన్యాసాలు అబ్బురపరిచాయి. రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలసు బలగాల గౌరవవందనం స్వీకరించారు.
వందేమాతర గీతం ఆలపిస్తుండగా మొదటి బెటాలియన్ కంటింజెంట్ కమాండెంట్ జె.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు బలగాలు గౌరవ వందన కార్యక్రమంలో పాల్గొన్నాయి. వివిధ విభాగాలకు చెందిన పోలీసు బలగాలు కవాతు చేశాయి. పోలీస్ బ్యాండ్‌తోపాటు తొలిసారిగా నేవీ బ్యాండ్ ఈ కవాతులో పాల్గొంది.