ఎన్నికలకు కార్పొరేట్లూ రెడీ..!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల పోరుకు రాజకీయ పార్టీలన్నీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటుండగా... కార్పొరేట్ కంపెనీలు కూడా తమ ప్రణాళికలకు పదునుపెడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటం... ఖర్చులు కూడా భారీగా ఎగబాకడంతో పార్టీలకు నిధుల అవసరం అంతకంతకూ పెరుగుతోంది. అంతేకాదు దేశ చరిత్రలోనే ఈసారి ఎన్నికల యుద్ధం హోరాహోరీగా జరగనుంది. ప్రపంచమంతా చాలా ఉత్కంఠతో గమనించనుంది కూడా. దీంతో పార్టీల నిధుల అవసరాలను తీర్చేందుకు కార్పొరేట్ సంస్థలు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా ‘ఎలక్టోరల్ ట్రస్టు’లను ఏర్పాటు చేస్తున్నాయి. దేశంలో అయిదు అగ్రగామి కార్పొరేట్ గ్రూప్‌లు ఇప్పటికే ఈ ట్రస్టులను ఏర్పాటు చేయగా.. మరో రెండు డజన్ల వరకూ వ్యాపార సంస్థలు, గ్రూప్‌లు కూడా ఇదే బాటలో ఉన్నాయి.
కొత్త నిబంధనల అమలు...
వ్యాపార సంస్థలు వివిధ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం మామూలే. అయితే, అవి ఇచ్చే నిధులకు పన్ను ప్రయోజనాలు లభించాలంటే మాత్రం ఏర్పాటు చేసే కొత్త ట్రస్టుల రిజిస్ట్రేషన్‌లో ‘ఎలక్టోరల్ ట్రస్టు’ అనే పేరును కచ్చితంగా జోడించాలనేది కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. ఇటీవలే ఆమోదముద్ర పడిన కొత్త కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద, అదేవిధంగా పాత చట్టంలోని సెక్షన్ 25ను అనుసరించి ఈ ట్రస్ట్‌లు ఏర్పాటవుతున్నాయి. గడిచిన అయిదు నెలల్లో ఈ నిబంధనల ప్రకారమే పలు కంపెనీలు ఈ ఎలక్టోరల్ ట్రస్ట్‌లను నాన్-ప్రాఫిట్ కంపెనీలుగా ఏర్పాటు చేసినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త నిబంధనల కింద ‘ఎలక్టొరల్ ట్రస్టు’లను నెలకొల్పిన వాటిలో ఇలాంటి వాటిలో జనహిత్ ఎలక్టోరల్ ట్రస్ట్( అనిల్ అగర్వాల్-వేదాంత గ్రూప్), సత్య ఎలక్టొరల్ ట్రస్ట్(సునీల్ మిట్టల్-భారతీ గ్రూప్), పీపుల్స్ ఎలక్టొరల్ ట్రస్ట్(అనిల్ అంబానీ-రిలయన్స్ గ్రూప్), సమాజ్ ఎలక్టొరల్ ట్రస్ట్ అసోసియేషన్(కేకే బిర్లా గ్రూప్) ఉన్నాయి. మరో 25 వరకూ బడా వ్యాపార సంస్థలు తమ సొంత ఎలక్టోరల్ ట్రస్టులను ఏర్పాటు చేసుకొనే ప్రక్రియలో నిమగ్నమైనట్లు ప్రభుత్వ, కన్సల్టెన్సీ వర్గాల సమాచారం. కాగా, ఇలా కొత్తగా పుట్టుకొస్తున్న ట్రస్టుల్లో ఎక్కువగా తమ అనుబంధ వ్యాపార గ్రూపులకు సంబంధించి ఎలాంటి రిఫరెన్స్‌లూ ఇవ్వకపోవడం గమనార్హం.
వివాదాలకు అడ్డుకట్ట...
గతంలో కూడా అనేక బడా కార్పొరేట్లు తమ ట్రస్టుల ద్వారా పార్టీలకు విరాళాలు ఇచ్చాయి. టాటా గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, భారతీ గ్రూప్‌లతోపాటు అనేక కంపెనీలు తాము ఇచ్చిన నిధుల వివరాలను వెల్లడించాయి కూడా. అయితే, ఈ నిధుల ప్రవాహాన్ని క్రమబద్ధీకరించేందుకు, పారదర్శకతకు వీలుగా ‘ఎలక్టోరల్ ట్రస్టుల స్కీమ్’ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఇటీవల ఇచ్చిన విరాళం వివాదాస్పదం కావడంతో తాజా నిబంధనలపై దృష్టిసారించారు. దీని ప్రకారం ఏదైనా ట్రస్టు తాము అందుకున్న నిధుల్లో 95 శాతం మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఇస్తేనే వాటికి పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదు.. ట్రస్టులకు సొమ్ములు ఇచ్చేవారు నగదురూపంలో ఇవ్వడానికి వీల్లేదు. భారతీయుల నుంచైతే పాన్ నంబర్‌ను, ప్రవాసీయులైతే పాస్‌పోర్ట్ నంబర్‌ను ట్రస్టులు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీయులు లేదా విదేశీ కంపెనీల నుంచి ఎలాంటి నిధులనూ సమీకరించకూడదనేది కూడా కీలక నిబంధనల్లో ఒకటి. కాగా, ఇలాంటి ఎలక్టొరల్ ట్రస్టులను ఏర్పాటు చేయకుండా కూడా కంపెనీలు పార్టీలకు నేరుగా విరాళాలు ఇవ్వొచ్చు. కానీ... ఆ నిధుల ప్రవాహం ఇతరత్రా పక్కా వివరాలన్నీ వెల్లడించాల్సి ఉంటుంది.