వర్క్ మధ్యలోనే భాగస్వామితో ఏకాంతం!
గంటపాటు అనుమతివ్వాలంటూ కౌన్సిలర్ ప్రతిపాదన
ప్రస్తుత ఆధునిక సమాజంలో భార్యాభర్తల మధ్య పెద్దగా సన్నిహిత అనుబంధం ఉండటం లేదు. పని ఒత్తిడి, సెల్ ఫోన్, సోషల్ మీడియా వంటి వాటి వ్యాపకంతోనే సమయమంతా గడిచిపోతోంది. భార్యాభర్తల మధ్య ప్రణయ ఏకాంతానికి తీరికే ఉండటం లేదు. ఈ నేపథ్యంలో స్వీడన్‌కు చెందిన ఓ కౌన్సిలర్ ఒక అరుదైన ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఉద్యోగులకు పనివేళలో ఒక గంటపాటు పెయిడ్ బ్రేక్ (వేతన విరామం) ఇస్తే.. ఆ సమయంలో వారు ఇంటికి వెళ్లి తమ భాగస్వాములతో శృంగారంలో పాల్గొనేందుకు వీలుంటుందని ఆయన ప్రతిపాదించారు.
శృంగారం ఎంతో ఆరోగ్యకరమైనదని అనేక అధ్యయనాలు సూచిస్తున్న నేపథ్యంలో తాను ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చినట్టు 42 ఏళ్ల పెర్ ఎరిక్ మస్కోస్ తెలిపారు. ప్రస్తుతం జంటలు ఒకరితో ఒకరు సన్నిహితంగా ఎక్కువ సమయం గడపడం లేదని, ఈ నేపథ్యంలో వారి మధ్య సన్నిహిత అనుబంధం ఉండటం ఎంతో మంచిదని ఆయన తన ప్రతిపాదన తీర్మానాన్ని కౌన్సిల్‌లో ప్రవేశపెడుతూ పేర్కొన్నారు. ఉద్యోగులు తమకు కేటాయించిన పెయిడ్ బ్రేక్‌ను భాగస్వాములతోనే గడుపుతున్నారా? లేక వేరే పనులకు ఉపయోగిస్తున్నారా? అన్నది గుర్తించడానికి ఎలాంటి మార్గం లేదని, అయినా ఉద్యోగులపై నమ్మకం ఉంచి కంపెనీలు ఈ విరామం ఇస్తే మంచిదని ఆయన సూచించారు. తన తీర్మానం తప్పకుండా కౌన్సిల్ ఆమోదం పొందుతుందని మస్కోస్ ధీమాతో ఉన్నారు