ఛోటారాజన్‌కు ప్రాణభయం.. వీడియో కాన్ఫరెన్సుతో విచారణ!
ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న మాఫియాడాన్ ఛోటా రాజన్‌కు ప్రాణభయం విపరీతంగా పట్టుకుంది. అతడిని తాము చంపేయడం ఖాయమని డి-గ్యాంగులోని నెం.2 ఛోటా షకీల్ బహిరంగంగా హెచ్చరించాడు. దాంతో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నా కూడా.. తన ప్రాణాలకు గ్యారంటీ లేదని ఛోటా రాజన్‌కు అర్థమైపోయింది. కోర్టుకు వెళ్లే సమయంలోను, కోర్టు హాల్లో కూడా చంపడం ముంబై మాఫియా గ్యాంగులకు వెన్నతో పెట్టిన విద్య. అలాగే తనను కూడా హతమారుస్తారన్న భయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని కోరాడు. దాన్ని జడ్జి కూడా ఆమోదించారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక జడ్జి వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మోకా కోర్టులో విచారణ సాగుతుండటంతో రాజన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు అనుమతించాలని సీబీఐ కోరింది. తీహర్ జైలు సూపరింటెండెంట్ కూడా ఈ మేరకు ఇంతకుముందే సీబీఐకి ఓ లేఖ రాశారు. ఆర్థర్ రోడ్డు జైలు ప్రాంగణంలో ఉన్న మోకా కోర్టుకు రాజన్ హాజరు కావాల్సి ఉంది. అయితే అతడిని నేరుగా ప్రవేశపెట్టాలంటే ప్రాణాలకు ముప్పు కాబట్టి, వీడియో కాన్ఫరెన్సు ద్వారానే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం నకిలీ పాస్‌పోర్టు కేసులో మాత్రమే ఛోటా రాజన్ అరెస్టయ్యాడు. ముంబైకి చెందిన ప్రముఖ జర్నలిస్టు జె డే హత్యకేసులో కూడా రాజన్‌పై ప్రొడక్షన్ వారంటు ఉంది.
ఛోటా రాజన్ ఇప్పుడు చచ్చిన పాముతో సమానమని, అతడిని తాము ప్రత్యర్థిగా భావించడంలేదని ఇంతకుముందు దావూద్ ఇబ్రహీం పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఛోటా షకీల్ చెప్పాడు. అయితే అతడిని తీహార్ జైల్లోనే తాము లేపేయడం ఖాయమని స్పష్టం చేశాడు. ఇంతకుముందు కూడా రాజన్‌ను హతమార్చేందుకు ప్రయత్నించామని, అయితే అతడు తృటిలో తప్పించుకున్నాడని చెప్పాడు.