అవకతవకలు రుజువైతే జెట్-ఎతిహాద్ డీల్ రద్దు!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు కోసం ఎతిహాద్ ఎయిర్‌వేస్ కుదుర్చుకున్న ఒప్పందంలో అవకతవకలు ఉన్నట్లు రుజువైతే.. ఈ డీల్‌ను రద్దు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జెట్-ఎతిహాద్ ఒప్పందం సహజవనరులను దుర్వినియోగం చేయడం(ఎయిర్‌స్పేస్ ఇతరత్రా) కిందికి వస్తుందని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా శుక్రవారం ఈ ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా పౌరవిమానయాన రంగంపై కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియా మాటలకు సంబంధించి ట్యాప్ చేసిన టెలిఫోన్ సంభాషణల రాతప్రతులను ప్రభుత్వం బయటపెట్టేలా ఆదేశాలించాలన్న పిటిషనర్ వాదనపైనా సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్రం, ఆదాయపు పన్ను శాఖలకు నోటీసులు జారీచేసింది.
కాగా, తన పిటిషన్‌పై కేంద్రం తన స్పందనను తెలియజేయకపోవడంపై స్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తమకు నాలుగు వారాల వ్యవధి కావాలని సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరణ్ సుప్రీంను కోరారు. అయితే, ఎయిర్ ఏషియా డీల్‌పైనా ఇలాంటి పిటిషన్ దాఖలు కాగా, సుప్రీం కోర్టు దీన్ని విచారణకు స్వీకరించలేదని, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించిన విషయాన్ని పరాశరణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జెట్-ఎతిహాద్ డీల్‌పై పిటిషన్‌కు కూడా విచారణార్హత లేదని ఆయన వాదించారు. అయితే, ప్రాథమిక అంశాల ఆధారంగా ఈ కేసులో ఇప్పటికే తాము నోటీసులు జారీచేసినట్లు సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది. ఏవైనా అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలితే కచ్చితంగా ఈ ఒప్పందాన్ని పక్కనబెడతామని పిటిషనర్‌కు బెంచ్ హామీఇచ్చింది. జెట్ ఎయిర్‌వేస్‌లో 24 శాతం వాటాను చేజిక్కించుకోవడానికి ఎతిహాద్ కుదుర్చుకున్న ఒప్పంద ప్రక్రియ ఇటీవలే పూర్తయింది. ఈ డీల్ విలువ రూ.2,069 కోట్లు.