ఆ సీట్లకు కోట్లలో బేరం! | Crors of deal for B category seats | Sakshi
Sakshi News home page

ఆ సీట్లకు కోట్లలో బేరం!

Published Mon, Sep 28 2015 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

ఆ సీట్లకు కోట్లలో బేరం!

ఆ సీట్లకు కోట్లలో బేరం!

* ‘బి’ కేటగిరీలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు మిగుల్చుకున్న ప్రైవేటు వైద్య కాలేజీలు
* ఎన్నారై కోటాలోకి మార్చుకుని అమ్ముతున్న వైనం
* ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు రూ. కోటిన్నరపైనే.. బీడీఎస్ సీటుకు రూ.30 లక్షలు వసూలు
* అక్రమాలపై కిమ్మనని ఉన్నతాధికారులు!
* ఆ సీట్లకు మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్

 
సాక్షి, హైదరాబాద్: సవాలక్ష ఆంక్షలు, అడ్డగోలు నిబంధనలను అడ్డుపెట్టి మిగుల్చుకున్న ఎంబీబీఎస్ ‘బి’ కేటగిరీ సీట్లను... ప్రైవేటు వైద్య, దంత కళాశాలలు రూ.కోట్లకు అమ్ముకుంటున్నాయి. ఆ సీట్లను ఎన్నారై కోటా కిందకు మార్చి మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి ఎంబీబీఎస్ సీటుకు రూ.1.10 కోట్ల నుంచి రూ.1.70 కోట్ల వరకు.. డెంటల్ సీటును రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలకు కట్టబెడుతున్నాయి.
 
 ప్రైవేటు వైద్య కళాశాలలు యాజమాన్య కోటాలోని ‘బి’ కేటగిరీ సీట్లకు ప్రత్యేకంగా ఎం-సెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సీట్లను ముందే ఒక్కోటీ రూ.కోటికిపైగా సొమ్ము తీసుకుని అమ్మేసుకున్న ప్రైవేటు వైద్య కాలేజీలు... వాటిని కొన్నవారికే సీట్లు వచ్చేలా ఎం-సెట్ నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డాయి. అయినా పలువురు పేద విద్యార్థులు ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించారు. అలాంటి వారికి సీట్లు దక్కకుండా ఉండేందుకు ప్రైవేటు వైద్య కాలేజీలు అడ్డగోలు నిబంధనలను తెరపైకి తెచ్చాయి. ఎంబీబీఎస్ సీటు కోసం ఏకంగా నాలుగేళ్ల ఫీజు (రూ.36 లక్షలు)కు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని నిబంధన పెట్టాయి. దీంతో పలువురు పేద అభ్యర్థులు సీట్లు పొందలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా.. పెద్దగా పట్టించుకోలేదు.
 
 విద్యార్థుల నుంచి ఫిర్యాదులు రావడం లేదు కదా అంటూ ఉన్నతాధికారులు ప్రైవేట్ కొమ్ముకాస్తున్నారు. ఇక ఇలా మిగిలిపోయిన ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల వివరాలను బయటకు తెలియనీయకుండా ప్రైవేటు కాలేజీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఈ సీట్లన్నింటినీ ఎన్నారై కోటాలోకి మార్చుకొని... భారీ మొత్తానికి అమ్ముకుంటున్నాయి. ‘‘యాజమాన్యాలు ప్రతీ విషయంలోనూ ప్రభుత్వంతోనే (ఉన్నతస్థాయిలో) సంప్రదింపులు జరుపుతున్నాయి. మేమెవరైనా ఫలానా తప్పు జరుగుతోందని అడిగితే ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయంతోనే చేస్తున్నామని అంటున్నారు. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రారంభం నుంచి వారిది ఇష్టారాజ్యమే. నాకు తెలిసి ఒక్కో కాలేజీ కోట్ల రూపాయల్లో లావాదేవీలు చేస్తున్నాయి. ఫ్యాకల్టీ లేకపోయినా ఎంబీబీఎస్‌పై మోజుతో తల్లిదండ్రులు ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు..’’ అని సీనియర్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం అన్ని మెడికల్ కాలేజీల్లో భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తిచేయాలి. అంటే మరో నాలుగు రోజుల్లోగా సీట్లను విక్రయించుకునే పనిలో ప్రైవేటు కాలేజీలు బిజీగా ఉన్నాయి.
 
 ఒక్కో సీటు రూ. 1.70 కోట్లు: హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో సీటు కోసం ఓ విద్యార్థి ఏకంగా రూ.1.70 కోట్లు చెల్లించాడు. ‘బి’ కేటగిరీలోని సీటు రద్దు చేసి ఎన్నారై కోటాలో ఇస్తున్నందుకు ఈ మొత్తం చెల్లించాల్సిందేనని యాజమాన్యం స్పష్టం చేసిందని ఆ విద్యార్థి తండ్రి ‘సాక్షి ప్రతినిధి’కి చెప్పారు. ‘‘నాకు ఒక్కరే సంతానం. డాక్టర్ చదివించాలని నా కల. అందుకే పైసా పైసా కూడబెట్టిన సొమ్మును ఇప్పుడు ఆ డాక్టర్ సీటు కోసం త్యాగం చేశాను’’ అని పేరు ప్రకటించడానికి ఇష్టపడని ఆ తండ్రి చెప్పారు. మొదట్లో రూ.1.3 కోట్లకు ఇస్తామన్నారని, తీరా విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందనగా టెన్షన్‌కు గురిచేసి రూ.40 లక్షలు ఎక్కువగా తీసుకున్నారని చెప్పారు. ఇక మాదాపూర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి తన కుమారుడికి వైద్య సీటు కోసం రూ.1.55 కోట్లు చెల్లించాడు.
 
 పెద్ద కుంభకోణం: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో 35 శాతం ‘బి’ కేటగిరీలో 505 ఎంబీబీఎస్, 350 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. వీటి భర్తీ కోసం నిర్వహించిన ఎం-సెట్ పరీక్ష అనంతరం అడ్డగోలు నిబంధనలు పెట్టి దాదాపు 50 ఎంబీబీఎస్ సీట్లు మిగిల్చి అమ్ముకుని రూ.75 కోట్లు.. 200 బీడీఎస్ సీట్లను మిగుల్చుకుని రూ.50 కోట్లు వెనకేసుకుంటున్నాయి. ‘ఇదో పెద్ద కుంభకోణం. ప్రభుత్వం మొదటి నుంచి ప్రైవేట్ వారికి దాసోహమైంది. గతేడాదిదాకా బి-1 కేటగిరీలో దాదాపు 200 సీట్లను ఎంసెట్ మెరిట్ ప్రాతిపదికన కేటాయించేవారు.
 
 ఈసారి వాటిని యాజమాన్య కోటాలో కలిపేశారు. ఫలితంగా మెరిట్ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది..’’ అని ప్రభుత్వ వైద్యకళాశాల ప్రొఫెసర్ ఒకరు పేర్కొన్నారు. ఇక ప్రైవేటు కాలేజీలు ‘బి’ కేటగిరీలో సీట్లు మిగుల్చుకుని, ప్రభుత్వానికి చెప్పకుండానే అమ్మేసుకుంటున్నాయని అధికార వర్గాలు చెబుతున్న మాటలు ఏ మాత్రం నమ్మశక్యంగా లేవని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ‘బి’ కేటగిరీలో మిగిలిపోయిన ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలంగాణ విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు కె.విజయ్‌కుమార్, కౌషిక్ యాదవ్, శ్రీధర్‌గౌడ్, రమేష్ ముదిరాజ్‌లు మంత్రి లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement