సాక్షి, హైదరాబాద్: ఎన్నారై కోటా ఎంబీబీఎస్ సీట్లపై విద్యార్థుల్లో రానురాను ఆసక్తి తగ్గుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ఎన్నారై కోటా ఎంబీబీఎస్ ఫీజులు అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై విద్యార్థుల అన్వేషణ కొనసాగుతోంది. సాధారణ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అంతంత ఫీజులు చెల్లించి ఎంబీబీఎస్ చదవడం కంటే, ఇతర రాష్ట్రాల్లో అంతకంటే నాణ్యమైన కాలేజీల్లో తక్కువ ఫీజుతో చదవడమే మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వివిధ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎన్నారై కోటా సీట్లు గణనీయంగా మిగిలిపోయాయి. ఆయా కాలేజీల్లో బీ, సీ (ఎన్‌ఆర్‌ఐ) కోటా సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. బీ–కేటగిరీ ఎంబీబీఎస్ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలుంది. దీంతో కౌన్సెలింగ్ నిర్వహించిన 1,005 బీ–కేటగిరీ సీట్లన్నీ నిండిపోయాయి. కానీ ఎన్నారై కోటా సీట్ల ఫీజు ఏడాదికి రూ.23.10లక్షలు ఉండటంతో వాటిలో చాలా సీట్లు మిగిలిపోయాయి. ఎన్నారై కోటాలో 469 ఎంబీబీఎస్ సీట్లుండగా, 328 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 141 సీట్లు మిగిలిపోయాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఏం చేయాలో అర్థంగాక లబోదిబోమంటున్నాయి.
దేశవ్యాప్తంగా పెరిగిన అవకాశాలు
తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా 2018–19 వైద్య విద్యా సంవత్సరం నుంచి నేషనల్ పూల్‌లో చేరింది. దీంతో ఒక్కసారిగా అవకాశాలు పెరిగాయి. నీట్ ర్యాంకుల ఆధారంగానే వీటన్నింటినీ భర్తీ చేస్తుండటంతో అఖిల భారత కోటా సీట్లకు, డీమ్డ్ వర్సిటీల్లోని వైద్య సీట్లకు ఒకే దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఏ కాలేజీకి ఆ కాలేజీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అంటే 40 డీమ్డ్ కాలేజీలుంటే అన్నింటికీ దరఖాస్తు చేసుకోవడం కష్టమయ్యేది. ‘నీట్’పుణ్యమా అని అన్నింటికీ ఒకే దర ఖాస్తు, ఒకే కౌన్సెలింగ్ వచ్చింది. పైగా డీమ్డ్ వర్సిటీ హోదా కలిగిన మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల తో సమానమైనవని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. డీమ్డ్ వైద్య కాలేజీలకు కూడా దేశంలో మంచి రేటింగ్స్ ఉన్నాయి. మన ప్రైవేటు మెడికల్ కాలేజీలు.. ఆ డీమ్డ్ వర్సిటీ కాలేజీలకు ఏమాత్రం నాణ్యతలో సరితూగ వని అంటున్నారు. డీమ్డ్ మెడికల్ కాలేజీలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లోనే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడకు వెళ్లడానికి తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
డీమ్డ్ ఫీజు కూడా సగమే
డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సీట్లను ఎలాంటి కేటగిరీలుగా విభజించలేదు. అన్నింటికీ ఒకే ఫీజు. అంటే మన ప్రైవేటు కాలేజీల్లో ఉన్న బీ–కేటగిరీ సీట్ల ఫీజుకు అటుఇటుగా డీమ్డ్ వర్సిటీ మెడికల్ ఫీజులుంటాయి. కొన్ని కాలేజీల్లోనైతే ఇక్కడి బీ–కేటగిరీ ఫీజు కంటే కూడా తక్కువగా ఉన్నాయి. కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాల సమాచారం ప్రకారం డీమ్డ్ వర్సిటీలకు చెందిన మెడికల్ కాలేజీల్లో రూ.10లక్షల నుంచి రూ.12లక్షల మధ్యే ఫీజులున్నాయి. ఉదాహరణకు కర్ణాటక రాష్ట్రం మణిపాల్‌లోని డీమ్డ్ వర్సిటీ హోదా కలిగిన కస్తూర్బా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు ఏడాదికి రూ.11.24 లక్షలు, అదే రాష్ట్రం కొలార్‌లోని డీమ్డ్ వర్సిటీ హోదా కలిగిన శ్రీదేవరాజ్ యూఆర్‌ఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు రూ.9లక్షలుగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎన్నారై కోటా ఎంబీబీఎస్ సీటుకు రూ.23.10 లక్షలు చెల్లించడం అవసరమా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్నారై కోటాలో చేరితే ఐదేళ్లకు కలిపి రూ.1.15 కోట్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే డీమ్డ్ వర్సిటీల్లో ఐదేళ్లకు కలిపి రూ.45 లక్షల నుంచి గరిష్టంగా రూ.60 లక్షల మధ్యే ఉంటుంది. దీంతో ఇక్కడి ఎన్‌ఆర్‌ఐ సీట్లపై నీలినీడలు అలుముకున్నాయి. దీంతో రాష్ట్రంలో కొన్ని మెడికల్ కాలేజీలు ఎన్నారై ఫీజును రూ.12 లక్షలకు తగ్గించాలని యోచిస్తున్నట్లు కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే అన్ని చోట్లా సీట్లు అయిపోయినప్పుడు ఇక్కడి ఎన్నారై కోటా సీట్లల్లో చేరే అవకాశముందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment