NRI quota
-
12లక్షల ర్యాంకుకు ఎన్నారై కోటా సీటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని మేనేజ్మెంట్ సీట్లకు జరిగిన తొలివిడత కౌన్సెలింగ్‌లో.. ఎన్నారై కోటా (సీ కేటగిరీ)లో గరిష్టంగా 12 లక్షల నీట్ ర్యాంకర్ వరకు సీట్లు లభించాయి. అదే బీ కేటగిరీలో 5.39 లక్షల ర్యాంకర్ వరకు సీట్లు వచ్చాయి. తదుపరి జరగనున్న రెండో, మూడో విడత కౌన్సెలింగ్‌లలో ఈ ర్యాంకులు మరింత పెరిగే అవకాశం ఉందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెప్తున్నాయి. ఎంబీబీఎస్ బీ, సీ కేటగిరీల తొలివిడత కౌన్సిలింగ్లో సీట్ల కేటాయింపు జాబితాను వర్సిటీ గురువారం ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కన్వీనర్ కోటా కింద నీట్లో 2.38 లక్షల ర్యాంకు వచ్చిన ఓ విద్యార్థికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వినర్ కోటా సీటు లభించిన సంగతి తెలిసిందే. కన్వీనర్ కోటాకు సంబంధించిన రెండో విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. అందులో రిజర్వేషన్ కేటగిరీల్లో ఇంకా పెద్ద ర్యాంకుకు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్నారై సీట్లపై అనాసక్తి.. రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. 2023–24లో 56 మెడికల్ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్ సీట్లు, 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50శాతం సీట్లను కన్వినర్ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రైవేటులో మిగిలినవాటిలో బీ కేటగిరీ కింద 1,640 సీట్లను, ఎన్నారై కోటాలో 700 సీట్లను భర్తీ చేస్తారు. బీ కేటగిరీలో 85శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే కేటాయిస్తుండటంతో మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. ఇక ఎన్నారై కోటాలో సీట్లు ఎక్కువగానే ఉన్నా.. వాటికి ఫీజులు బీ కేటగిరీ ఫీజుల కంటే రెట్టింపుగా ఉంటాయి. అంటే ఎన్నారై కోటా సీటు ఫీజు ఏడాదికి రూ.23 లక్షలు, అంతకుమించి ఉంటుంది. కాలేజీలను బట్టి ఇది మారుతుంది. ఇలా అడ్డగోలు ఫీజులు ఉండటంతో.. 700 సీట్లు అందుబాటులో ఉన్నా.. 330 మంది మాత్రమే వాటికి ఆప్షన్ పెట్టుకున్నారు. చివరివరకు కన్వినర్, బీ కేటగిరీ సీట్ల కోసం ప్రయత్నించి.. వాటిలో రానివారు మున్ముందు ఎన్నారై కోటా కింద చేరే అవకాశాలు ఉంటాయని వైద్యవిద్య వర్గాలు చెప్తున్నాయి. ఎక్కువ ఖర్చు చేసి ఇక్కడ ఎన్నారై కోటాలో ఎంబీబీఎస్ చేసే బదులు.. ఇతర రాష్ట్రాల్లో డీమ్డ్ వర్సిటీల్లో తక్కువ ఫీజుతో చదువుకోవచ్చన్న భావన కూడా ఉందని అంటున్నాయి. నేటి నుంచి ఎంబీబీఎస్ తరగతులు షురూ 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతులు శుక్రవారం (సెపె్టంబర్ 1) నుంచి ప్రారంభం అవుతాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. పీజీ మెడికల్ తరగతులు ఈ నెల ఐదో తేదీ నుంచి మొదలవుతాయని తెలిపింది. ఇప్పటికే ఎంబీబీఎస్, పీజీలలో కన్వినర్ కోటా, మేనేజ్మెంట్ కోటాలకు తొలి విడత కౌన్సెలింగ్‌లు పూర్తిచేసి విద్యార్థులకు సీట్లు కేటాయించారు. దీంతో తరగతులు ప్రారంభించాలని ఎన్ఎంసీ ఆదేశించిన నేపథ్యంలో అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్టు కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. కాగా.. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రభుత్వ ఆధ్వర్యంలో తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభం అవుతున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జనగాం, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్లలోని ఈ కాలేజీల్లోనూ శుక్రవారం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. -
ఉద్యాన వర్సిటీలో ఎన్ఆర్ఐ కోటా.. తొలిసారిగా అమలు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో తొలిసారి ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాలో బీఎస్సీ హార్టికల్చర్ హానర్స్ కోర్సులో అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులిచ్చారు. సీట్ల భర్తీ కోసం మార్గదర్శకాలు విడుదల చేశారు. మార్గదర్శకాలివే.. ► యూనివర్సిటీ కాలేజీల్లో 15% సీట్లను ఈ కోటా కింద మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ► ఈ కోటాలో సీట్లు పొందే వారికి రిజర్వేషన్లు వర్తించవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర రాయితీలు వర్తించవు. ► ఇంటర్లో 50 శాతం మార్కులు లేదా బైపీసీ, ఎంబైపీసీతో సమానమైన పరీక్షలో అర్హత పొంది ఉండాలి. ►విద్యార్థులు తప్పనిసరిగా పదో తరగతి, ఇంటర్మీడియట్ స్థాయిల్లో ఇంగ్లిష్ మీడియంలో చదివి ఉండాలి. ►అడ్మిషన్ సమయంలో ఇంగ్లిష్‌లో ప్రావీణాన్ని తెలిపే ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐఈఎల్టీఎస్), టెస్ట్ ఆఫ్ ఫారిన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ (టీవోఎఫ్‌ఈఎల్) సర్టిఫికెట్లను సమర్పించాలి. అలాగే.. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్, జనన ధ్రువీకరణ పత్రం, టీసీ, ఎన్ఆర్ఐ సర్టిఫికెట్తో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ►సీటు పొందిన వారు ప్రతీ ఏటా 3500 యూఎస్ డాలర్లు ఇన్స్టిట్యూషనల్ ఫీజు కింద చెల్లించాలి. హాస్టల్, ఇతర ఫీజులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ►సీటు పొందిన ప్రతి విద్యార్థి గ్రూప్ హెల్త్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్ (యువరక్ష) ప్రీమియం చెల్లించాలి. ►ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పొందిన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధీనంలో ఉన్నట్టుగా ధ్రువీకరణ పత్రం, స్పాన్సర్ కోటాలో సీటు పొందే వారికి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారి పాస్‌పోర్ట్, వీసా నకలు సమర్పించాలి. -
ఎన్నారై నై... డీమ్డ్‌కే సై!
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై కోటా ఎంబీబీఎస్ సీట్లపై విద్యార్థుల్లో రానురాను ఆసక్తి తగ్గుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ఎన్నారై కోటా ఎంబీబీఎస్ ఫీజులు అధికంగా ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాలపై విద్యార్థుల అన్వేషణ కొనసాగుతోంది. సాధారణ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అంతంత ఫీజులు చెల్లించి ఎంబీబీఎస్ చదవడం కంటే, ఇతర రాష్ట్రాల్లో అంతకంటే నాణ్యమైన కాలేజీల్లో తక్కువ ఫీజుతో చదవడమే మంచిదన్న అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వివిధ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎన్నారై కోటా సీట్లు గణనీయంగా మిగిలిపోయాయి. ఆయా కాలేజీల్లో బీ, సీ (ఎన్ఆర్ఐ) కోటా సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. బీ–కేటగిరీ ఎంబీబీఎస్ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలుంది. దీంతో కౌన్సెలింగ్ నిర్వహించిన 1,005 బీ–కేటగిరీ సీట్లన్నీ నిండిపోయాయి. కానీ ఎన్నారై కోటా సీట్ల ఫీజు ఏడాదికి రూ.23.10లక్షలు ఉండటంతో వాటిలో చాలా సీట్లు మిగిలిపోయాయి. ఎన్నారై కోటాలో 469 ఎంబీబీఎస్ సీట్లుండగా, 328 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 141 సీట్లు మిగిలిపోయాయని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఏం చేయాలో అర్థంగాక లబోదిబోమంటున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిన అవకాశాలు తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా 2018–19 వైద్య విద్యా సంవత్సరం నుంచి నేషనల్ పూల్‌లో చేరింది. దీంతో ఒక్కసారిగా అవకాశాలు పెరిగాయి. నీట్ ర్యాంకుల ఆధారంగానే వీటన్నింటినీ భర్తీ చేస్తుండటంతో అఖిల భారత కోటా సీట్లకు, డీమ్డ్ వర్సిటీల్లోని వైద్య సీట్లకు ఒకే దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఏ కాలేజీకి ఆ కాలేజీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అంటే 40 డీమ్డ్ కాలేజీలుంటే అన్నింటికీ దరఖాస్తు చేసుకోవడం కష్టమయ్యేది. ‘నీట్’పుణ్యమా అని అన్నింటికీ ఒకే దర ఖాస్తు, ఒకే కౌన్సెలింగ్ వచ్చింది. పైగా డీమ్డ్ వర్సిటీ హోదా కలిగిన మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల తో సమానమైనవని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. డీమ్డ్ వైద్య కాలేజీలకు కూడా దేశంలో మంచి రేటింగ్స్ ఉన్నాయి. మన ప్రైవేటు మెడికల్ కాలేజీలు.. ఆ డీమ్డ్ వర్సిటీ కాలేజీలకు ఏమాత్రం నాణ్యతలో సరితూగ వని అంటున్నారు. డీమ్డ్ మెడికల్ కాలేజీలు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లోనే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడకు వెళ్లడానికి తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. డీమ్డ్ ఫీజు కూడా సగమే డీమ్డ్ మెడికల్ కాలేజీల్లో సీట్లను ఎలాంటి కేటగిరీలుగా విభజించలేదు. అన్నింటికీ ఒకే ఫీజు. అంటే మన ప్రైవేటు కాలేజీల్లో ఉన్న బీ–కేటగిరీ సీట్ల ఫీజుకు అటుఇటుగా డీమ్డ్ వర్సిటీ మెడికల్ ఫీజులుంటాయి. కొన్ని కాలేజీల్లోనైతే ఇక్కడి బీ–కేటగిరీ ఫీజు కంటే కూడా తక్కువగా ఉన్నాయి. కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వర్గాల సమాచారం ప్రకారం డీమ్డ్ వర్సిటీలకు చెందిన మెడికల్ కాలేజీల్లో రూ.10లక్షల నుంచి రూ.12లక్షల మధ్యే ఫీజులున్నాయి. ఉదాహరణకు కర్ణాటక రాష్ట్రం మణిపాల్‌లోని డీమ్డ్ వర్సిటీ హోదా కలిగిన కస్తూర్బా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు ఏడాదికి రూ.11.24 లక్షలు, అదే రాష్ట్రం కొలార్‌లోని డీమ్డ్ వర్సిటీ హోదా కలిగిన శ్రీదేవరాజ్ యూఆర్ఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫీజు రూ.9లక్షలుగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎన్నారై కోటా ఎంబీబీఎస్ సీటుకు రూ.23.10 లక్షలు చెల్లించడం అవసరమా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్నారై కోటాలో చేరితే ఐదేళ్లకు కలిపి రూ.1.15 కోట్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే డీమ్డ్ వర్సిటీల్లో ఐదేళ్లకు కలిపి రూ.45 లక్షల నుంచి గరిష్టంగా రూ.60 లక్షల మధ్యే ఉంటుంది. దీంతో ఇక్కడి ఎన్ఆర్ఐ సీట్లపై నీలినీడలు అలుముకున్నాయి. దీంతో రాష్ట్రంలో కొన్ని మెడికల్ కాలేజీలు ఎన్నారై ఫీజును రూ.12 లక్షలకు తగ్గించాలని యోచిస్తున్నట్లు కాళోజీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే అన్ని చోట్లా సీట్లు అయిపోయినప్పుడు ఇక్కడి ఎన్నారై కోటా సీట్లల్లో చేరే అవకాశముందని భావిస్తున్నారు. -
ఏపీ తరహాలో ‘వైద్య’ ఫీజుల పెంపు!
- నేడు, రేపు ఏఎఫ్ఆర్సీ భేటీ సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల ఫీజు పెంపునకు రంగం సిద్ధమైంది. ఏపీలో ఉన్నట్లుగానే తెలంగాణలోనూ ఫీజులు పెరిగే అవకాశం ఉందని వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఫీజును నిర్ధరించేందుకు ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) మంగళ, బుధవారాల్లో ప్రత్యేకంగా ప్రైవే టు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో భేటీ కానుంది. అనంతరం ప్రభుత్వం ఫీజుల పెంపును ప్రకటించనుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం బీ కేటగిరీ ఎంబీ బీఎస్ సీటు ఫీజు ఏడాదికి రూ. 9 లక్షలుం డగా... ఆ ఫీజును ఏపీ మాదిరిగా రూ. 11 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అలాగే సీ కేటగిరీ (ఎన్ఆర్ఐ) ఫీజు ప్రస్తుతం రూ. 11 లక్షలు ఉంది. ఏపీలో ఈ కేటగిరీ ఫీజును బీ కేటగిరీ ఫీజుకు 5 రెట్ల వరకు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. తెలంగాణలోనూ ఆ వెసులుబాటు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. -
ఆ సీట్లకు కోట్లలో బేరం!
* ‘బి’ కేటగిరీలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు మిగుల్చుకున్న ప్రైవేటు వైద్య కాలేజీలు * ఎన్నారై కోటాలోకి మార్చుకుని అమ్ముతున్న వైనం * ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు రూ. కోటిన్నరపైనే.. బీడీఎస్ సీటుకు రూ.30 లక్షలు వసూలు * అక్రమాలపై కిమ్మనని ఉన్నతాధికారులు! * ఆ సీట్లకు మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: సవాలక్ష ఆంక్షలు, అడ్డగోలు నిబంధనలను అడ్డుపెట్టి మిగుల్చుకున్న ఎంబీబీఎస్ ‘బి’ కేటగిరీ సీట్లను... ప్రైవేటు వైద్య, దంత కళాశాలలు రూ.కోట్లకు అమ్ముకుంటున్నాయి. ఆ సీట్లను ఎన్నారై కోటా కిందకు మార్చి మార్కెట్లో డిమాండ్‌ను బట్టి ఎంబీబీఎస్ సీటుకు రూ.1.10 కోట్ల నుంచి రూ.1.70 కోట్ల వరకు.. డెంటల్ సీటును రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలకు కట్టబెడుతున్నాయి. ప్రైవేటు వైద్య కళాశాలలు యాజమాన్య కోటాలోని ‘బి’ కేటగిరీ సీట్లకు ప్రత్యేకంగా ఎం-సెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సీట్లను ముందే ఒక్కోటీ రూ.కోటికిపైగా సొమ్ము తీసుకుని అమ్మేసుకున్న ప్రైవేటు వైద్య కాలేజీలు... వాటిని కొన్నవారికే సీట్లు వచ్చేలా ఎం-సెట్ నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డాయి. అయినా పలువురు పేద విద్యార్థులు ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించారు. అలాంటి వారికి సీట్లు దక్కకుండా ఉండేందుకు ప్రైవేటు వైద్య కాలేజీలు అడ్డగోలు నిబంధనలను తెరపైకి తెచ్చాయి. ఎంబీబీఎస్ సీటు కోసం ఏకంగా నాలుగేళ్ల ఫీజు (రూ.36 లక్షలు)కు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని నిబంధన పెట్టాయి. దీంతో పలువురు పేద అభ్యర్థులు సీట్లు పొందలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా.. పెద్దగా పట్టించుకోలేదు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు రావడం లేదు కదా అంటూ ఉన్నతాధికారులు ప్రైవేట్ కొమ్ముకాస్తున్నారు. ఇక ఇలా మిగిలిపోయిన ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల వివరాలను బయటకు తెలియనీయకుండా ప్రైవేటు కాలేజీలు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఈ సీట్లన్నింటినీ ఎన్నారై కోటాలోకి మార్చుకొని... భారీ మొత్తానికి అమ్ముకుంటున్నాయి. ‘‘యాజమాన్యాలు ప్రతీ విషయంలోనూ ప్రభుత్వంతోనే (ఉన్నతస్థాయిలో) సంప్రదింపులు జరుపుతున్నాయి. మేమెవరైనా ఫలానా తప్పు జరుగుతోందని అడిగితే ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయంతోనే చేస్తున్నామని అంటున్నారు. ఈ ఏడాది అడ్మిషన్ల ప్రారంభం నుంచి వారిది ఇష్టారాజ్యమే. నాకు తెలిసి ఒక్కో కాలేజీ కోట్ల రూపాయల్లో లావాదేవీలు చేస్తున్నాయి. ఫ్యాకల్టీ లేకపోయినా ఎంబీబీఎస్‌పై మోజుతో తల్లిదండ్రులు ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు..’’ అని సీనియర్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం అన్ని మెడికల్ కాలేజీల్లో భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తిచేయాలి. అంటే మరో నాలుగు రోజుల్లోగా సీట్లను విక్రయించుకునే పనిలో ప్రైవేటు కాలేజీలు బిజీగా ఉన్నాయి. ఒక్కో సీటు రూ. 1.70 కోట్లు: హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో సీటు కోసం ఓ విద్యార్థి ఏకంగా రూ.1.70 కోట్లు చెల్లించాడు. ‘బి’ కేటగిరీలోని సీటు రద్దు చేసి ఎన్నారై కోటాలో ఇస్తున్నందుకు ఈ మొత్తం చెల్లించాల్సిందేనని యాజమాన్యం స్పష్టం చేసిందని ఆ విద్యార్థి తండ్రి ‘సాక్షి ప్రతినిధి’కి చెప్పారు. ‘‘నాకు ఒక్కరే సంతానం. డాక్టర్ చదివించాలని నా కల. అందుకే పైసా పైసా కూడబెట్టిన సొమ్మును ఇప్పుడు ఆ డాక్టర్ సీటు కోసం త్యాగం చేశాను’’ అని పేరు ప్రకటించడానికి ఇష్టపడని ఆ తండ్రి చెప్పారు. మొదట్లో రూ.1.3 కోట్లకు ఇస్తామన్నారని, తీరా విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందనగా టెన్షన్‌కు గురిచేసి రూ.40 లక్షలు ఎక్కువగా తీసుకున్నారని చెప్పారు. ఇక మాదాపూర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి తన కుమారుడికి వైద్య సీటు కోసం రూ.1.55 కోట్లు చెల్లించాడు. పెద్ద కుంభకోణం: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో 35 శాతం ‘బి’ కేటగిరీలో 505 ఎంబీబీఎస్, 350 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. వీటి భర్తీ కోసం నిర్వహించిన ఎం-సెట్ పరీక్ష అనంతరం అడ్డగోలు నిబంధనలు పెట్టి దాదాపు 50 ఎంబీబీఎస్ సీట్లు మిగిల్చి అమ్ముకుని రూ.75 కోట్లు.. 200 బీడీఎస్ సీట్లను మిగుల్చుకుని రూ.50 కోట్లు వెనకేసుకుంటున్నాయి. ‘ఇదో పెద్ద కుంభకోణం. ప్రభుత్వం మొదటి నుంచి ప్రైవేట్ వారికి దాసోహమైంది. గతేడాదిదాకా బి-1 కేటగిరీలో దాదాపు 200 సీట్లను ఎంసెట్ మెరిట్ ప్రాతిపదికన కేటాయించేవారు. ఈసారి వాటిని యాజమాన్య కోటాలో కలిపేశారు. ఫలితంగా మెరిట్ విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది..’’ అని ప్రభుత్వ వైద్యకళాశాల ప్రొఫెసర్ ఒకరు పేర్కొన్నారు. ఇక ప్రైవేటు కాలేజీలు ‘బి’ కేటగిరీలో సీట్లు మిగుల్చుకుని, ప్రభుత్వానికి చెప్పకుండానే అమ్మేసుకుంటున్నాయని అధికార వర్గాలు చెబుతున్న మాటలు ఏ మాత్రం నమ్మశక్యంగా లేవని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. ‘బి’ కేటగిరీలో మిగిలిపోయిన ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలంగాణ విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు కె.విజయ్‌కుమార్, కౌషిక్ యాదవ్, శ్రీధర్‌గౌడ్, రమేష్ ముదిరాజ్‌లు మంత్రి లక్ష్మారెడ్డికి విజ్ఞప్తి చేశారు. -
ఆ వైద్య సీట్లన్నీ ఎన్నారై కోటాలోకే!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కౌన్సెలింగ్‌లో భర్తీ కాని యాజమాన్య కోటాలోని 202 డెంటల్ సీట్లు ఎన్నారై కోటాలోకి మారనున్నాయి. అలాగే అదే కోటాలోని 505 ఎంబీబీఎస్ సీట్లల్లో అన్నీ భర్తీ అయినా ఈ నెలాఖరుకల్లా వాటికి నాలుగేళ్ల ఫీజు బ్యాంకు గ్యారంటీ చూపించాల్సి ఉంటుంది. గ్యారంటీ చూపని విద్యార్థుల సీట్లు రద్దయి అవి కూడా ఎన్నారై కోటాలోకి చేరతాయి. అప్పుడు ఇష్టానుసారంగా కాలేజీ యాజమాన్యాలు భర్తీ చేసుకోవచ్చు. వాటికి బేరం పెట్టే పనిలో యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. సీటు రద్దు చేసుకునే విద్యార్థులకు ప్రత్యేక నజరానా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నారై కోటాలోకి వచ్చే ఎంబీబీఎస్ సీటును రూ. కోటిన్నర వరకు బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ నెల 21, 22 తేదీల్లో ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లోని బీ కేటగిరీకి చెందిన 505 ఎంబీబీఎస్, 350 బీడీఎస్ సీట్లకు అత్యంత గోప్యంగా ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులు మొదటి ఏడాది రూ. 9 లక్షల ఫీజుతో చెల్లింపుతోపాటు మిగిలిన నాలుగేళ్ల కోర్సు ఫీజు రూ. 36 లక్షలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలన్నారు. అలాగే బీడీఎస్‌లో మొదటి ఏడాది ఫీజు రూ. 4 లక్షల చెల్లింపుతోపాటు మిగిలిన మూడేళ్లకు రూ. 12 లక్షలు గ్యారంటీ అడిగారు. ఈ నెలాఖరు నాటికి బ్యాంకు గ్యారంటీతో వస్తేనే చేరిన సీటు ఉంటుందని... లేకుంటే రద్దవుతుందని యాజమాన్యాలు తేల్చిచెప్పాయి. కౌన్సెలింగ్‌లో అన్ని ఎంబీబీఎస్ సీట్లల్లో విద్యార్థులు చేరినా బ్యాంకు గ్యారంటీ ఇవ్వకుంటే అవి నెలాఖరుకు రద్దు అవుతాయి. ప్రభుత్వ జీవో ప్రకారం ఆ సీట్లన్నీ ఎన్నారై కోటాలోకి మారిపోతాయి. ఇక బీడీఎస్‌లో 350 యాజమాన్య సీట్లల్లో 202 సీట్లు భర్తీ కాలేదు. అయితే బీడీఎస్‌కు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో ప్రభుత్వ అనుమతి తీసుకొని ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేయాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. వాటిని ఎన్నారై ఫీజుకే అంటగట్టాలని యోచిస్తున్నాయి. -
ఎంబీబీఎస్ సీట్లు అమ్మబడును!
15 శాతం ప్రభుత్వ సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో విక్రయం వచ్చే ఏడాది నుంచి అమలుకు బాబు సర్కారు యోచన 15% ఎంబీబీఎస్ సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో విక్రయం వచ్చే ఏడాది నుంచి అమలుకు బాబు సర్కారు యోచన ఈ ఏడాది పద్మావతి మహిళా కళాశాలలో, వచ్చే ఏడాది అన్ని ప్రభుత్వ కాలేజీల్లోనూ అమలు నివేదిక తయారీకి వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు సర్కారీ కళాశాలల్లో ఎన్ఐఆర్ఐ కోటా అమలైతే 225 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోనున్న ప్రతిభావంతులు ఏటా రూ. 27 కోట్ల ఆదాయాన్ని లెక్కేస్తున్న సర్కారు ఎన్ఆర్ఐ కోటా కుదరకపోతే రూ. 60 వేలు ఫీజు వసూలు ఆలోచన 2000-2003 లోనే ప్రభుత్వాస్పత్రుల్లో యూజర్ చార్జీలు, మెడిసిన్ సీట్లలో 5% ఎన్ఆర్ఐ కోటా ప్రవేశపెట్టిన చంద్రబాబు 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాక అవన్నీ రద్దుచేసిన వైనం డాక్టర్ కావాలనేది.. వైద్య వృత్తి చేపట్టాలనేది.. చాలా మంది యువత కల. రాష్ట్రంలో ఏటా లక్ష మంది విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సులో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాస్తుంటారు. కానీ.. ఉన్న సీట్లేమో నాలుగైదు వేలే! అందులోనూ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లు మరీ స్వల్పం!! ప్రతిభావంతులైన పేద విద్యార్థుల్లో అతి కొద్దిమందైనా తమ డాక్టర్ కలను సాకారం చేసుకునేందుకు ఈ ప్రభుత్వ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లే ఆధారం. కానీ.. చంద్రబాబు సర్కారు ఆ కలకు గండి కొట్టే చర్యలు ప్రారంభించింది. సరిగ్గా పదకొండేళ్ల కిందట చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తలపెట్టిన ‘ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా’ను మళ్లీ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. నాడు 5 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాలో అమ్మకానికి పెట్టగా.. ఇప్పుడు ఏకంగా 15 శాతం సీట్లను ఈ పేరుతో అమ్మకానికి పెడుతున్నారు. అంటే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు చెందాల్సిన ఆ 15 శాతం సీట్లు.. దాదాపు 225 సీట్లను.. వారికి చెందకుండా చేసి.. ఎన్ఆర్ఐ కోటా పేరుతో ప్రతిభతో నిమిత్తం లేకుండా ధనవంతులకు కట్టబెట్టబోతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన 5 శాతం ఎన్ఆర్ఐ కోటాను ఆ మరుసటి ఏడాది వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. ఇప్పుడు బాబు సర్కారు అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా కాకముందే సర్కారీ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లను ఆదాయం కోసం అమ్ముకోజూస్తుండటం విద్యార్థులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పాత ఆలోచనలకు మళ్లీ పదునుపెట్టారు. 2000-2003 సంవత్సరాల మధ్య ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేయించారు. అంతేకాదు ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలో 5 శాతం సీట్లు ప్రవాస భారతీయులకు విక్రయించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆ లెక్కను మరింత పెంచి అమలులోకి తేనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం ఎంబీబీఎస్ సీట్లను విక్రయించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే స్విమ్స్ పరిధిలో నడిచే పద్మావతీ ప్రభుత్వ మహిళా వైద్య కళాశాలలో 15 శాతం సీట్లు ప్రవాస భారతీయులకు విక్రయించేందుకు జీవో జారీ చేశారు కూడా. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో 85 శాతం స్థానిక కోటా కింద, 15 శాతం అన్రిజర్వ్డ్ నాన్ లోకల్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. అయితే ఈ స్థానిక కోటా 85 శాతం సీట్లలో 15 శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది పద్మావతి మహిళా కళాశాలలో అమలు చేసి వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద అమ్మేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలొచ్చినట్టు ఆ శాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు. సర్కారు కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా అంటూ సీట్లను విక్రయిస్తే.. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు. మౌలిక వసతుల పేరుతో దగా... ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, రోగులకు మెరుగైన వైద్యసేవలు అనే రెండు కారణాలను బూచిగా చూపి ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో ఎన్ఆర్ఐ సీటును రూ. 60 లక్షలకు విక్రయించాలని యోచిస్తున్నారు. అంటే ఈ సొమ్మును ఐదేళ్లలో ఏటా రూ. 12 లక్షల చొప్పున (20 వేల డాలర్ల్లు) సీటు పొందిన వ్యక్తి చెల్లించాలి. ఇలా ప్రతి కళాశాలకూ ఏటా కనీసం రూ. 2.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ వస్తుందని.. ఈ నిధులతో మౌలిక వసతులు కల్పించవచ్చని సర్కారు వాదనను ముందుకు తెస్తోంది. మొత్తం కళాశాలలు, సీట్ల సంఖ్య, ఎన్ఆర్ఐ కోటా విక్రయంలోకి ఎన్ని సీట్లు వస్తాయి తదితర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలందాయి. విక్రయానికి 225 ఎంబీబీఎస్ సీట్లు? ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన ప్రకారం సర్కారీ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోటాకింద విక్రయిస్తే కనీసం 225 సీట్లు ప్రతిభ కలిగిన విద్యార్థులకు దక్కకుండా పోతాయి. రాష్ట్రంలో మొత్తం 12 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. ఇందులో విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాల రెండు రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ కళాశాలలో ఉన్న 150 సీట్ల విక్రయం కుదరదు. మిగతా 11 కళాశాలల్లో 1,750 సీట్లు ఉన్నాయి. ఇందులో 15 % అన్రిజర్వ్డ్ మినహాయిస్తే 1,498 సీట్లుం టాయి. ఈ సీట్లలో 15 శాతం అంటే 225 సీట్లు విక్రయిస్తారు. ఈ సీట్ల విక్రయం ద్వారా ఏటా రూ. 27 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. ‘ఎన్ఆర్ఐ’ లేదంటే.. రూ. 60 వేలు ఫీజు! ఒకవేళ ఎన్ఆర్ఐ కోటా సీట్లను విక్రయించలేని పక్షంలో ప్రస్తుతం కన్వీనర్ కోటా సీట్లకు రూ. 60,000 వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వ సీట్లకూ అంతే స్థాయిలో తీసుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది. వీటికి కేంద్ర ప్రభుత్వమే స్కాలర్‌షిప్‌ల కింద చెల్లిస్తుంది. మిగతా 50 శాతం సీట్లకు అంటే సుమారు 900 సీట్లకు ఏటా రూ. 60,000 లెక్కన వసూలు చేస్తారు. దీనివల్ల ఏటా రూ. 5.40 కోట్లు వస్తుంది. నాడు 5% ఎన్ఆర్ఐ కోటాపై తీవ్ర వ్యతిరేకత 2000-2003 సంవత్సరాల మధ్య అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేశారు. అంతేకాదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 5 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటాకింద ఇచ్చేయాలని తీర్మానించారు. దీంతో జూనియర్ డాక్టర్లు, సైన్స్ విద్యార్థులతో పాటు వివిధ ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జూడాల ఆధ్వర్యంలో ఆస్పత్రుల్లో సమ్మెలు జరిగాయి. ధర్నాలు జరిగాయి. ఆ తర్వాత 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూజర్ చార్జీలు, 5 శాతం ఎన్ఆర్ఐ కోటాను రద్దు చేశారు. -
వైద్య విద్యకు ప్రైవేటు వ్రణం
ఏటా కనీసం 5-6 వందల మంది మెరిట్ విద్యార్థులు ఎన్.ఆర్.ఐ. కోటా పుణ్యాన లక్షల్లో ఫీజులు చెల్లించలేక వైద్య విద్యకు దూరమవుతున్నారు. కార్పొరేట్ల కొమ్ముకాసే ఈ విధానంతో ప్రతిభతో సంబంధం లేని, సంపన్న కుటుంబ నేపథ్యం గలవారు 1,500 మంది లక్షలు పోసి వైద్య విద్యలో ప్రవేశం పొందుతున్నారు. మన వైద్యరంగంలో, వైద్య విద్యలో వ్యాపార ధోరణి ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. తెలుగు ప్రాంతంలో వైద్య విద్యలో 1998 వరకు ప్రైవేటు ప్రమేయం లేదు. ఆ స్థితి నుంచి 27 ప్రైవేటు వైద్య కళాశాలలను అనుమతించే వరకు ప్రయాణం సాగింది. 1995 తరువాత ప్రైవేటు వైద్య విద్యను ప్రోత్సహించి, ప్రతిభను నిరుత్సాహ పరిచే ప్రక్రియ ఊపందుకుని, ఆ విద్యను సంపన్నుల సొత్తుగా మార్చేసే ప్రయత్నాలు ముమ్మరమైనాయి. ప్రభుత్వం కూడా ప్రైవేటు వైద్య కళాశాలల దోపిడీని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, వైద్య విద్యార్థుల ప్రయోజనాలను పణంగా పెడుతోంది. ఆ కాలేజీలలో 50 శాతం సీట్లకు ఇప్పుడు రూ. 60 వేలు ఫీజు చెల్లిస్తున్నారు. దీనిని రూ. 3.10 లక్షల నుంచి రూ. 3.75 లక్షలకు పెంచడానికి ప్రతిపాదనలను ప్రభుత్వమే అనుమతిస్తున్నది. ఎంసెట్ నిర్వహించి, ర్యాంకుల ఆధారంగా అన్ని కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వమే నిష్పక్షపాతంగా ప్రవేశాలు కల్పించే విధానానికి కూడా స్వస్తి చెప్పి, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ప్రత్యేక అర్హత పరీక్షను నిర్వహించుకోవడానికి కూడా రంగం సిద్ధమవుతున్నది. ఇది అందరికీ విద్య అన్న సూత్రాన్ని భగ్నం చేస్తుంది. ఇప్పటి వరకు ఫ్రీ సీట్లుగా పేర్కొంటూ (ఎ కేటగిరీ), రూ. 60 వేలు ఫీజుతో ఉన్న 50 శాతం సీట్లు కూడా పేద, మధ్యతరగతి విద్యార్థులకు దూరమౌతాయి. ఇక ప్రభుత్వ ప్రమేయం లేకుండా ప్రైవేటు కళాశాలలు అందించే వైద్య విద్య ప్రజలకు శాపంలా మారుతుంది. ప్రతిభకు పాతర రాష్ట్రంలో 14 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 27 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి. 2003 వరకు ప్రైవేటు కళాశాలల్లో 85 శాతం ప్రతిభ ఆధారిత సీట్లు ఉండేవి. వీటికి రూ. 45 వేలు ఫీజు వసూలు చేసేవారు. మిగిలిన 15 శాతం యాజమాన్య కోటా సీట్లు. కానీ 2004 ప్రవేశాల కోసం అప్పటి ప్రభుత్వం 85 శాతం ఉన్న ఫ్రీ సీట్లు లేదా ప్రతిభ ఆధారంగా ఇచ్చే సీట్లను 50 శాతానికి కుదించింది. మిగిలిన సీట్లలో 25 శాతం సీట్లను రూ. 2 లక్షల ఫీజుతో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పించడానికీ, మరో 25 శాతం యాజమాన్య కోటాగాను ఖరారు చేస్తూ విధానం రూపొందించింది. దీనితో ప్రతిభకు అవకాశం తగ్గి, యాజమాన్యాలకు కాసుల వర్షం కురిసే వాతావరణం ఏర్పడింది. అయితే, తరువాత రూ. 2 లక్షల ఫీజుతో ఉన్న 25 శాతం బి-కేటగిరీ సీట్లలో 15 శాతానికి కోత పెట్టారు. ఈ 15 శాతం సీట్లకు ఎన్ఆర్ఐ కోటా అని పేరు పెట్టి, దొడ్డిదారిన సీట్లను అమ్ముకునే అవకాశం కల్పించింది. అంటే ఏటా కనీసం 5-6 వందల మంది మెరిట్ విద్యార్థులు ఎన్.ఆర్.ఐ కోటా పుణ్యాన లక్షల్లో ఫీజులు చెల్లించలేక వైద్య విద్యకు దూరమవుతున్నారు. కార్పొరేట్ల కొమ్ముకాసే ఈ విధానంతో ప్రతిభతో సంబంధం లేని, సంపన్న కుటుంబ నేపథ్యం గలవారు 1,500 మంది లక్షలు పోసి వైద్య విద్యలో ప్రవేశం పొందుతున్నారు. అంటే ప్రతిభ గల 1,500 మంది వైద్య నిపుణులను ఏటా వైద్యరంగానికి దూరం చేసుకుంటున్నాం. మరో వైపు రాష్ట్రంలో 3.20 లక్షల సీట్లతో, 700కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో లక్షకు పైగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఇతర విమర్శలు కూడా ఉన్నా ఇంజనీరింగ్ కోర్సును నాలుగు సంవత్సరాలకే పూర్తి చేసి వారు లక్షల్లో వేతనాలను పొందుతున్నారు. వైద్య విద్య ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. 15 ప్రభుత్వ కళాశాలల్లో 2,400 సీట్లు, 27 ప్రైవేటు కళాశాలల్లో 3,800 సీట్లు - 6,200 సీట్లు మాత్రమే ఉండగా, లక్షా పది వేల మంది పోటీపడుతున్నారు. దాదాపు లక్షా నాలుగు వేల మంది వైద్య విద్యలో ప్రవేశం పొందలేక, ఇష్టం లేని కోర్సుల్లో చేరుతున్నారు. ఏటా మేనేజ్మెంట్ కోటాలోని 25 శాతం సీట్లను, ఎన్.ఆర్.ఐ. కోటాలోని 15 శాతం సీట్లను వేలం వేస్తున్నారు. క్యాపిటేషన్ ఫీజు ఉండకూడదని, మేనేజ్మెంట్ కోటా సీట్లను మెరిట్ పద్ధతిలో భర్తీ చేయాలని, ప్రభుత్వం, కోర్టులు ఎంతచెప్పినా పట్టించుకోకుండా యాజమాన్య కోటాలో సీటు పొందాలనుకునే మెరిట్ విద్యార్థులకు కనీసం దరఖాస్తులు కూడా అందనివ్వకుండా బెదిరిస్తూ, వేధిస్తున్నారు. ఎందుకీ నిర్లక్ష్యం? ప్రతి మనిషికి అవసరమైన వైద్యవిద్యను పాలకులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రతి జిల్లాలో 1,000 పడకలతో నిత్యం రద్దీగా ఉండే జిల్లా ఆసుపత్రులకు అనుబంధంగా వైద్య కళాశాలను స్థాపించటం చాలా సులభం. కానీ ప్రైవేట్ వైద్య కళాశాల ఆసుపత్రులను కూడా నిర్మించి, నిర్వహించాల్సి రావడంతో తగిన సంఖ్యలో పేషెంట్లు రావడం లేదు. కానీ ఎం.సి.ఐ.(భారత వైద్య మండలి) తనిఖీలు చేసినప్పుడు పేషెంట్లు సహా డాక్టర్లు, సిబ్బంది - అందరూ నకిలీలను చూపించి అనుమతులను సంపాదిస్తున్నారు. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ఎందుకు ప్రారంభించడం లేదు? ఎన్.ఆర్.ఐ. కోటా ఎందుకు? ఎవరి ప్రయోజనాల కోసం? వారి పిల్లలకు మన రాష్ట్ర వైద్య కళాశాలల్లో కోటాలెందుకు? రాష్ట్రంలో 2003 వరకు 85 శాతంగా ఉన్న మెరిట్ సీట్లను 60 శాతానికి ఎందుకు కుదించారు? మెరిట్ సీట్లలో 15 శాతం ఎవరి ప్రయోజనాల కోసం సృష్టించారు? ప్రైవేటు యాజమాన్యాలకు కోట్లు పోగేసి పెట్టేందుకు కాదా? ప్రైవేటు యాజమాన్యాలకు కోట్లు ఇదంతా చాలదన్నట్లు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఇప్పటి వరకు రూ. 60 వేల ఫీజుతో ఉన్న 50 శాతం సీట్లను కామన్ ఫీజు పద్ధతిలోకి మార్చి, 3.1 లక్షల నుండి 3.75 లక్షల ఫీజుకు మార్చనున్నారు. దీనితో ఇకపై 3 లక్షల 10 వేల నుండి 3లక్షల 75 వేల వరకు వార్షిక ఫీజు చెల్లించవలసి వస్తుంది. అంటే కోర్స్ పూర్తి కావాలంటే 15.5 లక్షల నుండి 19.25 లక్షల వరకు చెల్లించవలసి వస్తుంది. ఈ విధానం అమలు జరిగితే ఫీజు రీయింబర్స్మెంట్ క్రింద ప్రభుత్వం ఒక్క వైద్య విద్యార్థికి 3 లక్షలకు బదులు, 15 నుండి 19 లక్షలు చెల్లించవలసి వస్తుంది. ఈ రూపంలో కూడా ప్రజాధనాన్ని కోట్లలో ప్రైవేటు యాజమాన్యాలకు చెల్లించాలన్నమాట. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కార్పొరేట్ విద్యా, వైద్య రంగాల వ్యాపారులకు చోటు కల్పించారు. ఇలాంటి వారి వలన వ్యాపార వర్గాలకే మేలు జరుగుతుంది. నిపుణులు నేటి అవసరం ఇకనైన ప్రభుత్వం ఎ.ఎఫ్.ఆర్.సి. (అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ) ప్రజా వ్యతిరేక, వైద్యరంగ వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి, కామన్ ఫీజు విధానానికి స్వస్తి చెప్పాలి. 15 శాతం ఎన్.ఆర్.ఐ. ‘కోటా’రద్దు చేసి, వాటిని మెరిట్ కోటాకు ఇచ్చి ప్రతిభను గుర్తించాలి. 2.4 లక్షల ఫీజు వసూలు చేస్తున్న 10 శాతం (బి కేటగిరీ సీట్లను) సీట్లను 60 వేల ఫీజుతో ఎ కేటగిరీకి మార్చాలి. ఇప్పటి వరకు మెనేజ్మెంట్ కోటాగా ఉన్న 25 శాతం సీట్ల విషయంలో వారికి స్వేచ్ఛను ఇవ్వవచ్చు. వైద్యుల కొరతను తీర్చడంతో పాటు, నిపుణులైన వైద్యులను అందించడం కూడా ప్రభుత్వం బాధ్యత. అప్పుడే రాష్ట్రంలో వైద్య రంగం, ప్రజారోగ్యం మెరుగుపడగలవు. - వి. దిలీప్‌కుమార్, ఎం. రోజాలక్ష్మి (సోషల్ ఎవేర్‌నేస్ కాంపెయిన్)