వైద్య విద్యకు ప్రైవేటు వ్రణం | Merit students not to study Medical education by impact of NRI quota | Sakshi
Sakshi News home page

వైద్య విద్యకు ప్రైవేటు వ్రణం

Published Wed, Jun 18 2014 1:34 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM

వైద్య విద్యకు ప్రైవేటు వ్రణం - Sakshi

వైద్య విద్యకు ప్రైవేటు వ్రణం

ఏటా కనీసం 5-6 వందల మంది మెరిట్ విద్యార్థులు ఎన్.ఆర్.ఐ. కోటా పుణ్యాన లక్షల్లో ఫీజులు చెల్లించలేక వైద్య విద్యకు దూరమవుతున్నారు.  కార్పొరేట్ల కొమ్ముకాసే ఈ విధానంతో ప్రతిభతో సంబంధం లేని, సంపన్న కుటుంబ నేపథ్యం గలవారు 1,500 మంది లక్షలు పోసి వైద్య విద్యలో ప్రవేశం పొందుతున్నారు.
 
 మన వైద్యరంగంలో, వైద్య విద్యలో వ్యాపార ధోరణి ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. తెలుగు ప్రాంతంలో వైద్య విద్యలో 1998 వరకు ప్రైవేటు ప్రమేయం లేదు. ఆ స్థితి నుంచి 27 ప్రైవేటు వైద్య కళాశాలలను అనుమతించే వరకు ప్రయాణం సాగింది. 1995 తరువాత ప్రైవేటు వైద్య విద్యను ప్రోత్సహించి, ప్రతిభను నిరుత్సాహ పరిచే ప్రక్రియ ఊపందుకుని, ఆ విద్యను సంపన్నుల సొత్తుగా మార్చేసే ప్రయత్నాలు ముమ్మరమైనాయి.
 
 ప్రభుత్వం కూడా ప్రైవేటు వైద్య కళాశాలల దోపిడీని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, వైద్య విద్యార్థుల ప్రయోజనాలను పణంగా పెడుతోంది. ఆ కాలేజీలలో 50 శాతం సీట్లకు ఇప్పుడు రూ. 60 వేలు ఫీజు చెల్లిస్తున్నారు. దీనిని రూ. 3.10 లక్షల నుంచి రూ. 3.75 లక్షలకు పెంచడానికి ప్రతిపాదనలను ప్రభుత్వమే అనుమతిస్తున్నది. ఎంసెట్ నిర్వహించి, ర్యాంకుల ఆధారంగా అన్ని కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వమే నిష్పక్షపాతంగా ప్రవేశాలు కల్పించే విధానానికి కూడా స్వస్తి చెప్పి, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ప్రత్యేక అర్హత పరీక్షను నిర్వహించుకోవడానికి కూడా రంగం సిద్ధమవుతున్నది. ఇది అందరికీ విద్య అన్న సూత్రాన్ని భగ్నం చేస్తుంది. ఇప్పటి వరకు ఫ్రీ సీట్లుగా పేర్కొంటూ (ఎ కేటగిరీ), రూ. 60 వేలు ఫీజుతో ఉన్న 50 శాతం సీట్లు కూడా పేద, మధ్యతరగతి విద్యార్థులకు దూరమౌతాయి. ఇక ప్రభుత్వ ప్రమేయం లేకుండా ప్రైవేటు కళాశాలలు అందించే వైద్య విద్య ప్రజలకు శాపంలా మారుతుంది.
 
 ప్రతిభకు పాతర
 రాష్ట్రంలో 14 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 27 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి. 2003 వరకు ప్రైవేటు కళాశాలల్లో 85 శాతం ప్రతిభ ఆధారిత సీట్లు ఉండేవి. వీటికి రూ. 45 వేలు ఫీజు వసూలు చేసేవారు. మిగిలిన 15 శాతం యాజమాన్య కోటా సీట్లు. కానీ 2004 ప్రవేశాల కోసం అప్పటి ప్రభుత్వం 85 శాతం ఉన్న ఫ్రీ సీట్లు లేదా ప్రతిభ ఆధారంగా ఇచ్చే సీట్లను 50 శాతానికి కుదించింది. మిగిలిన సీట్లలో 25 శాతం సీట్లను రూ. 2 లక్షల ఫీజుతో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పించడానికీ, మరో 25 శాతం యాజమాన్య కోటాగాను ఖరారు చేస్తూ విధానం రూపొందించింది. దీనితో ప్రతిభకు అవకాశం తగ్గి, యాజమాన్యాలకు కాసుల వర్షం కురిసే వాతావరణం ఏర్పడింది. అయితే, తరువాత రూ. 2 లక్షల ఫీజుతో ఉన్న 25 శాతం బి-కేటగిరీ సీట్లలో 15 శాతానికి  కోత పెట్టారు. ఈ 15 శాతం సీట్లకు ఎన్‌ఆర్‌ఐ కోటా అని పేరు పెట్టి, దొడ్డిదారిన సీట్లను అమ్ముకునే అవకాశం కల్పించింది. అంటే ఏటా కనీసం 5-6 వందల మంది మెరిట్ విద్యార్థులు ఎన్.ఆర్.ఐ కోటా పుణ్యాన లక్షల్లో ఫీజులు చెల్లించలేక వైద్య విద్యకు దూరమవుతున్నారు. కార్పొరేట్ల కొమ్ముకాసే ఈ విధానంతో ప్రతిభతో సంబంధం లేని, సంపన్న కుటుంబ నేపథ్యం గలవారు 1,500 మంది లక్షలు పోసి వైద్య విద్యలో ప్రవేశం పొందుతున్నారు. అంటే ప్రతిభ గల 1,500 మంది వైద్య నిపుణులను ఏటా వైద్యరంగానికి దూరం చేసుకుంటున్నాం.
 
 మరో వైపు రాష్ట్రంలో 3.20 లక్షల సీట్లతో, 700కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో లక్షకు పైగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఇతర విమర్శలు కూడా ఉన్నా ఇంజనీరింగ్ కోర్సును నాలుగు సంవత్సరాలకే పూర్తి చేసి వారు లక్షల్లో వేతనాలను పొందుతున్నారు. వైద్య విద్య ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. 15 ప్రభుత్వ కళాశాలల్లో 2,400 సీట్లు, 27 ప్రైవేటు కళాశాలల్లో 3,800 సీట్లు - 6,200 సీట్లు మాత్రమే ఉండగా, లక్షా పది వేల మంది పోటీపడుతున్నారు. దాదాపు లక్షా నాలుగు వేల మంది వైద్య విద్యలో ప్రవేశం పొందలేక, ఇష్టం లేని కోర్సుల్లో చేరుతున్నారు. ఏటా మేనేజ్‌మెంట్ కోటాలోని 25 శాతం సీట్లను, ఎన్.ఆర్.ఐ. కోటాలోని 15 శాతం సీట్లను వేలం వేస్తున్నారు. క్యాపిటేషన్ ఫీజు ఉండకూడదని, మేనేజ్‌మెంట్ కోటా సీట్లను మెరిట్ పద్ధతిలో భర్తీ చేయాలని, ప్రభుత్వం, కోర్టులు ఎంతచెప్పినా పట్టించుకోకుండా యాజమాన్య కోటాలో సీటు పొందాలనుకునే మెరిట్ విద్యార్థులకు కనీసం దరఖాస్తులు కూడా అందనివ్వకుండా బెదిరిస్తూ, వేధిస్తున్నారు.
 
 ఎందుకీ నిర్లక్ష్యం?
 ప్రతి మనిషికి అవసరమైన వైద్యవిద్యను పాలకులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రతి జిల్లాలో 1,000 పడకలతో నిత్యం రద్దీగా ఉండే జిల్లా ఆసుపత్రులకు అనుబంధంగా వైద్య కళాశాలను స్థాపించటం చాలా సులభం. కానీ ప్రైవేట్ వైద్య కళాశాల ఆసుపత్రులను కూడా నిర్మించి, నిర్వహించాల్సి రావడంతో తగిన సంఖ్యలో పేషెంట్లు రావడం లేదు. కానీ ఎం.సి.ఐ.(భారత వైద్య మండలి) తనిఖీలు చేసినప్పుడు పేషెంట్లు సహా డాక్టర్లు, సిబ్బంది - అందరూ నకిలీలను చూపించి అనుమతులను సంపాదిస్తున్నారు.
 ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ఎందుకు ప్రారంభించడం లేదు? ఎన్.ఆర్.ఐ. కోటా ఎందుకు? ఎవరి ప్రయోజనాల కోసం? వారి పిల్లలకు మన రాష్ట్ర వైద్య కళాశాలల్లో  కోటాలెందుకు? రాష్ట్రంలో 2003 వరకు 85 శాతంగా ఉన్న మెరిట్ సీట్లను 60 శాతానికి  ఎందుకు కుదించారు? మెరిట్ సీట్లలో 15 శాతం ఎవరి ప్రయోజనాల కోసం సృష్టించారు? ప్రైవేటు యాజమాన్యాలకు కోట్లు పోగేసి పెట్టేందుకు కాదా?
 
 ప్రైవేటు యాజమాన్యాలకు కోట్లు
 ఇదంతా చాలదన్నట్లు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఇప్పటి వరకు రూ. 60 వేల ఫీజుతో ఉన్న 50 శాతం సీట్లను  కామన్ ఫీజు పద్ధతిలోకి మార్చి, 3.1 లక్షల నుండి 3.75 లక్షల ఫీజుకు మార్చనున్నారు. దీనితో ఇకపై 3 లక్షల 10 వేల నుండి 3లక్షల 75 వేల వరకు వార్షిక ఫీజు చెల్లించవలసి వస్తుంది. అంటే కోర్స్ పూర్తి కావాలంటే 15.5 లక్షల నుండి 19.25 లక్షల వరకు చెల్లించవలసి వస్తుంది. ఈ విధానం అమలు జరిగితే ఫీజు రీయింబర్స్‌మెంట్ క్రింద ప్రభుత్వం ఒక్క వైద్య విద్యార్థికి 3 లక్షలకు బదులు, 15 నుండి 19 లక్షలు చెల్లించవలసి వస్తుంది. ఈ రూపంలో కూడా ప్రజాధనాన్ని కోట్లలో ప్రైవేటు యాజమాన్యాలకు చెల్లించాలన్నమాట. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కార్పొరేట్ విద్యా, వైద్య రంగాల వ్యాపారులకు చోటు కల్పించారు. ఇలాంటి వారి వలన వ్యాపార వర్గాలకే మేలు జరుగుతుంది.
 
 నిపుణులు నేటి అవసరం
 ఇకనైన ప్రభుత్వం ఎ.ఎఫ్.ఆర్.సి. (అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ) ప్రజా వ్యతిరేక, వైద్యరంగ వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి, కామన్ ఫీజు విధానానికి స్వస్తి చెప్పాలి. 15 శాతం ఎన్.ఆర్.ఐ. ‘కోటా’రద్దు చేసి, వాటిని మెరిట్ కోటాకు ఇచ్చి ప్రతిభను గుర్తించాలి. 2.4 లక్షల ఫీజు వసూలు చేస్తున్న 10 శాతం (బి కేటగిరీ సీట్లను) సీట్లను 60 వేల ఫీజుతో ఎ కేటగిరీకి మార్చాలి. ఇప్పటి వరకు మెనేజ్‌మెంట్ కోటాగా ఉన్న 25 శాతం సీట్ల విషయంలో వారికి స్వేచ్ఛను ఇవ్వవచ్చు. వైద్యుల కొరతను తీర్చడంతో పాటు, నిపుణులైన వైద్యులను అందించడం కూడా ప్రభుత్వం బాధ్యత. అప్పుడే రాష్ట్రంలో వైద్య రంగం, ప్రజారోగ్యం మెరుగుపడగలవు.    
- వి. దిలీప్‌కుమార్, ఎం. రోజాలక్ష్మి
 (సోషల్ ఎవేర్‌నేస్ కాంపెయిన్)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement