భారీగా పెరగనున్న వైద్య విద్య ఫీజులు!
{పైవేటు కళాశాలలత
ఏఎఫ్‌ఆర్సీ సమావేశాలు
యాజమాన్య కోటా ఫీజు భారీగా
పెంచాలన్న కళాశాలలు
హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి వైద్య విద్య ఫీజులు భారీగా పెరగనున్నాయి. 2013-14 విద్యా సంవత్సరం నుంచే ఫీజులు పెంచాలని ప్రభుత్వం యోచించినా ఎన్నికలు సమీపించడంతో వ్యతిరేకత వస్తుందని పాత ఫీజు లే అమలు చేశారు. 2010లో మెడిసిన్ ఫీజులు పెంచారు. ప్రతి రెండేళ్ల కోసారి ఫీజుల సవరణ చేయాల్సి ఉంటుంది. దీన్నిబట్టి ఈ ఏడాది ఫీజులు పెంచక తప్పనిపరిస్థితి. ఫీజుల సవరణకు కొన్ని రోజులుగా ఏఎఫ్‌ఆర్సీ (అడ్మిషన్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) సమావేశాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగం గా రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాల అభిప్రాయాలను తీసుకుంటోంది. వాటిని పరిగణనలోకి తీసుకుని త్వరలో ఫీజులను నిర్ణయిస్తారు. పెంచిన ఫీజులు 2014-15 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెస్తారు.
ఫీజులు భారీగా పెంచండి: ప్రస్తుతం మెడిసిన్ విద్యార్థులకు చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయని, ఫీజులు పెంచితే తప్ప తాము కళాశాలలు నిర్వహించే పరిస్థితిలో లేమని పలు ప్రైవేటు మెడికల్ కళాశాలల యాజమాన్యాలు ఏఎఫ్‌ఆర్‌సీకి స్పష్టం చేశాయి. ప్రస్తుతం యాజమాన్య కోటా కింద అభ్యర్థులు రూ.5.50 లక్షలు చెల్లిస్తున్నారని, ఇది తమకు ఏమాత్రం సరిపోదని తెలిపాయి. యాజమాన్య కోటాలోని సీట్లను మెరిట్ ప్రాతిపదికన నింపేందుకు, ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు తమకు అభ్యంతరం లేదని, అయితే ప్రస్తుత ఫీజులు మాత్రం పెంచాలని పేర్కొన్నాయి. దీని కోసం కొన్ని కళాశాలలు ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.19 లక్షల వరకూ డిమాండ్ చేశాయి. వారి డిమాండ్లను విన్న ఏఎఫ్‌ఆర్‌సీ తిరిగి ఈనెల 24 లేదా 25 తేదీల్లో సమావేశమై ఫీజులను నిర్ణయించవచ్చునని తెలిసింది. కాగా, వచ్చే ఏడాది నుంచి యాజమాన్య కోటా సీట్లకు ఏడాదికి రూ.9 లక్షలు నిర్ణయించే అవకాశముందని సమాచారం.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులు..
ఎంబీబీఎస్:
ఎ కేటగిరీ రూ.60 వేలు
బి కేటగిరీ రూ.2.40 లక్షలు
సి కేటగిరీ రూ.5.50 లక్షలు.
డెంటల్:
ఎ కేటగిరీ రూ.45 వేలు
బి కేటగిరీ రూ.1.30 లక్షలు
సి కేటగిరీ రూ.2.50 లక్షలు