లంగ్ క్యాన్సర్‌కు క్యూబా వ్యాక్సిన్ | cuba vaccine for lung cancer | Sakshi
Sakshi News home page

లంగ్ క్యాన్సర్‌కు క్యూబా వ్యాక్సిన్

Published Mon, Aug 8 2016 5:59 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

లంగ్ క్యాన్సర్‌కు క్యూబా వ్యాక్సిన్

లంగ్ క్యాన్సర్‌కు క్యూబా వ్యాక్సిన్

హవానా: క్యూబా రాజధాని హవానాలోని సెంట్రో డీ ఇమ్యునాలోజియా మాలక్యూల్ (సీఐఎం-ఇంగ్లీష్‌లో సెంటర్ ఫర్ మాలెక్యూల్ ఇమ్యునాలోజి ) కేంద్రంపై ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైంది. ప్రపంచాన్ని పీడిస్తున్న లంగ్ క్యాన్సర్‌కు ఇప్పుడు ఈ కేంద్రం వ్యాక్సిన్‌ను కనుగొనడమే అందుకు కారణం. ‘సిమ్‌ఆవాక్స్’గా పిలిచే ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 5 వేల మందిపైనా, ఒక్క క్యూబాలోనే వెయ్యి మందిపైనా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా, మంచి ఫలితాలు లభించాయి. 60 ఏళ్ల లోపు రోగులపైనా ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిర్వహించారు. వ్యాక్సిన్ ఇవ్వని రోగులతో పోలిస్తే వ్యాక్సిన్ ఇచ్చిన రోగులు 11 నెలలు అదనంగా జీవించారు.
 

ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఒరేల్వ్ ఆల్బర్ట్ సాంచెజ్ అనే 77 ఏళ్ల వృద్దుడు మాత్రం ఇంకా బతికే ఉన్నారు. ఆయనకు 2007లోనే లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఎన్ని థెరపీలు ఇచ్చినా ఆయన క్యాన్సర్ తగ్గలేదు. దాంతో ఆయన సిమ్‌ఆవాక్స్ వ్యాక్సిన్ తీసుకోవాడిని స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆశ్చర్యంగా రెండేళ్లలోనే ఆయన ఆరోగ్యం ఎంతో మెరుగుపడింది. ఆయనలో వ్యాక్సిన్ పనిచేయడంతోపాటు ఆయనకున్న మనోధైర్యం కూడా ఆయన ఎక్కువ కాలం బతికేందుకు దోహదపడిందని సీఐఎంలో పనిచేస్తున్న శాస్త్రవేత్త కామిలో రోడ్రిగెజ్ తెలిపారు. ఈ సరికొత్త వ్యాక్సిన్ ఇతర క్యాన్సర్ థెరపీల్లోలాగా క్యాన్సర్ కణాలను చంపేయదని, క్యాన్సర్ కణాలను శరీరంలోని రోగ నిరోధక శక్తే చంపేసీ విధంగా శక్తిని పెంచుతుందని ఆయన చెప్పారు.
 

తన విషయంలో మాత్రం సిమ్‌ఆవాక్స్ వ్యాక్సిన్ బ్రహ్మాండంగా పనిచేసిందని ఒరేల్వ్ ఆల్బర్ట్ మీడియాకు తెలిపారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న మిగతా రోగులు తనలాగా ఎక్కువ కాలం జీవించక పోవడానికి వారికి తగినంత మనోధైర్యం లేకపోవడం కారణమై ఉండవచ్చని, క్యాన్సర్ వచ్చిందని తెలియగానే రోగులు సగం చచ్చిపోతారని ఆయన చెప్పారు. అయినా రోగాన్ని గుర్తించిన వెంటనే వ్యాక్సిన్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని తాను విశ్వసిస్తున్నానని ఆయన చెప్పారు.
 

క్యూబాలోని సీఐఎం ఇంతవరకు 21 ప్రాణాంతక రోగాలకు వ్యాక్సిన్లను కనిపెట్టింది. క్యూబాపై 1960 దశకం నుంచి అమెరికా ఆంక్షలు కొనసాగుతుండడం వల్ల సొంతంగా వైద్య పరిశోధనలపై దృష్టిని కేంద్రీకరించాల్సి వచ్చింది. ఓ వ్యక్తి ఆరోగ్యం కోసం క్యూబా వెచ్చిస్తున్న వైద్య పరిశోధనల ఖర్చుకన్నా అమెరికా ఐదింతలు ఖర్చు పెడుతున్నా సీఐఎం సాధించిన విజయాలను అమెరికా ల్యాబ్‌లు కూడా అందుకోలేక పోయాయి. క్యూబా ప్రజలు జీవిస్తున్న సరాసరి సగటు వయస్సు 80 ఏళ్లుకాగా, అమెరికాలో ఈ వయస్సు 79 ఏళ్లే ఉంది.
 

 ఇటీవలి కాలంలో క్యూబాతో సంబంధాలను మెరగుపర్చుకునేందుకు అమెరికా కృషి చేస్తున్న నేపథ్యంలో న్యూయార్క్‌కు చెందిన రోజ్‌కూల్ పార్క్ క్యాన్సర్ సెంటర్ క్యూబా తయారు చేసిన క్యాన్సర్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. జపాన్, కొన్ని యూరప్ దేశాలు ఇప్పటికీ లంగ్ క్యాన్సర్ వ్యాక్సిన్ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. క్యూబాలో క్యాన్సర్‌తో చనిపోతున్న రోగుల్లో ఎక్కువ మంది లంగ్స్ క్యాన్సర్ రోగులే ఉంటున్నారు. ఎందుకంటే క్యూబా ప్రజల్లో పొగాకు వాడకం ఎక్కువ. ముఖ్యంగా సిగార్ల వల్ల చాలా మంది లంగ్స్ క్యాన్సర్ వ్యాధిన పడుతున్నారు. ఏడాదికి క్యూబాలో 4,500 లంగ్స్ క్యాన్సర్ రోగులు నమోదవుతున్నారు. వారంతా ఏదో దశలో మృత్యువాత పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement