ముజఫర్‌నగర్, చుట్టుపక్కల పట్టణాల్లో చెలరేగిన మతఘర్షణల్లో మరణించినవారి సంఖ్య 40కి చేరింది. ఒక్క ముజఫర్‌నగర్‌లోనే 34 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి కమల్‌సక్సేనా లక్నోలో చెప్పారు. మీరట్‌లో ఇద్దరు, హాపూర్, బాఘ్‌పట్, సహరాన్‌పూర్, షామ్లీల్లో ఒక్కొక్కరు మరణించినట్లు తెలిపారు. మొత్తం 81 మంది గాయపడగా.. ఈ ఘటనలకు సంబంధించి 366 మందిని అరె స్టు చేసినట్లు వెల్లడించారు. పరిస్థితి కొంత అదుపులోకి రావడంతో ముజఫర్‌నగర్ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో మంగళవారం కర్ఫ్యూ సడలించారు.
తాజా హింసాకాండ గురించిన ఎలాంటి సమాచారం అందకపోవడంతో కొత్వాలి, సివిల్ లైన్స్, నై నంది ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రెండుగంటల పాటు కర్ఫ్యూ సడలించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ కుశాల్‌రాజ్ తెలిపారు. మరోవైపు అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. ఇందుకోసం రిటైర్డ్ జడ్జి విష్ణుసహాయ్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుచేసింది. రెండునెలల్లోగా నివేదిక సమర్పించాలని కోరింది.
రాష్ట్రంలో మతఘర్షణలు సృష్టించి వాతావరణాన్ని కలుషితం చేయాలని ప్రయత్నించినవారిపై కఠినచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హెచ్చరించారు. సరైన సమయంలో చర్యలు చేపట్టి హింసాకాండను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష బీజేపీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీ ధ్వజమెత్తాయి. కఠిన చర్యల ద్వారా పరిస్థితిని అదుపులోకి తేకపోతే ఘర్షణలు ఇతర రాష్ట్రాలకు పాకే ప్రమాదం ఉందని ఆర్‌ఎల్‌డీ నేత, కేంద్రమంత్రి అజిత్‌సింగ్ పేర్కొన్నారు.
మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని అధికార సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. ముజఫర్‌నగర్ హింసాకాండలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదని ఆ పార్టీ నేత వెంకయ్యనాయుడు తమిళనాడులోని తిరుచిరాపల్లిలో వ్యాఖ్యానించారు. కాగా, ముజఫర్‌నగర్ హింసాకాండలో మరణించినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ మంగళవారం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ముజఫర్‌నగర్ మృతులు 40
Published Wed, Sep 11 2013 12:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM
Advertisement
Advertisement