విద్యార్థులకు టీచర్ 'మందు' పాఠాలు
రాయపూర్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు 'మందు' పాఠాలు బోధిస్తున్నాడు. విద్యార్థులకు మార్గదర్శిగా నిలవాల్సిన ఉపాధ్యాయుడు తాగుడు పాఠాలు నేర్పుతూ దొరికిపోయాడు. ఛత్తీస్ గఢ్ కొరియా జిల్లా ప్రభుత్వ పాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న శివబరన్ మద్యం పాఠాలు చెబుతూ వీడియోలో చిక్కారు. డీ ఫర్ దారు(మద్యం), పీ ఫర్ పియో(తాగు) అంటూ కొత్త భాష్యాలు చెప్పారు. వీటిని బ్లాక్ బోర్డుపై రాసి పదేపదే విద్యార్థులతో వల్లించారు.
జర్నలిస్ట్ ఒకరు వీడియో తీయడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. మందు పాఠాలు బోధించే సమయంలో గురువుగారు మద్యం మత్తులో ఉండడం గమనార్హం. అయితే సిలబస్ ప్రకారమే పాఠాలు చెబుతున్నానని సమర్థించుకున్నాడు శివబరన్. అయితే మందు పుచ్చుకుని పాఠశాలకు రావడం తప్పేనని ఒప్పుకున్నాడు. మద్యం తాగొచ్చి ఇంకేప్పుడు పాఠాలు చెప్పబోనని చెంపలు వాయించుకున్నాడు. శివబరన్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సంజీవ్ ఝా విచారణకు ఆదేశించారు.