
పోలీస్ ఇంట్లో యువతిపై దారుణం
తిరువనంతపురం: కేరళలో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. శనివారం తిరువనంతపురం సమీపంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో తనపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని 22 ఏళ్ల దళిత యువతి ఆరోపించింది. కాగా బాధితురాలు కాని, ఆమె కుటుంబ సభ్యులు కాని ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పారు. అదే రోజు ఆత్మహత్యాయత్నం చేసిన ఆమెను ఆస్పత్రికి తీసుకురావడంతో ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు.
నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ కానిస్టేబుల్ సహా నిందితులందరినీ అరెస్ట్ చేశారు. నిందితుల్లో బాధితురాలి స్నేహితుడు, సహోద్యోగి ఉన్నారని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. మూడో నిందితుడు పోలీస్ కానిస్టేబుల్‌తో మాట్లాడి ఆమెను అతని ఇంటికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. బాధితురాలు తమను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిందని నిందితులు ఆరోపించారు. అయితే బాధితురాలి వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. కేరళలోనే ఇటీవల విహార యాత్రకు వచ్చిన జపాన్ యువతి లైంగిక దాడికి గురయినట్టు వార్తలు వచ్చాయి.