జైరాం రమేష్తో డిప్యూటీ సీఎం భేటీ
న్యూఢిల్లీ : ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ఉదయం జీవోఎం సభ్యుడు జైరాం రమేష్తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం మరోసారి రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తీసుకు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందిజ. రాష్ట్ర విభజన విధివిధానాల ఖరారుకు ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం) తన పూర్తిస్థాయి సమావేశాల అనంతరం రాయల తెలంగాణకు ఆస్కారం లేదని సంకేతాలు పంపినా, నిన్నటి పరిణామాలు మాత్రం ఆ దిశగా అధిష్టానం ఆలోచనలు ఇంకా ముగియలేదని స్పష్టం చేస్తున్నాయి.
కొన్నాళ్లుగా రాష్ట్ర విభజన అంశంపై నానా రకాలుగా ప్రజలను గందరగోళ పరుస్తున్న జీవోఎం, కాంగ్రెస్ ఢిల్లీ నేతలు తాజాగా రాయలసీమను విభజించే ఆలోచనకు పదును పెట్టారు. శుక్రవారం దామోదర రాజనర్సింహ నేరుగా దిగ్విజయ్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాయల తెలంగాణపై తెలంగాణ ప్రాంత నేతల అభిప్రాయాలను మరోమారు ఆయన ముందుంచారు. భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు, సీడబ్ల్యూసీ తీర్మానానికి రాయల తెలంగాణ పూర్తిగా విరుద్ధం. దీనివల్ల రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూరకపోగా నష్టమే ఉంటుందని ఆయన విలేకర్లకు వివరించారు.