
ప్రమాదకరంగా బద్రీనాథ్ వాతావరణం
బద్రినాథ్: చార్‌ధామ్ యాత్రకు వెళ్లి బద్రినాథ్‌లో చిక్కుకుపోయిన తెలుగువాళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. యాత్రికుల్లో పది మందికిపైగా తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి తమకెలాంటి సాయం అందడం లేదని వారు వాపోతున్నారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరదలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. గతేడాదిలాగే ఇప్పుడు కూడా వరదలు వణికిస్తున్నాయి.
ఈ యాత్ర కోసం వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు బద్రినాథ్‌లో చిక్కుకుపోయారు. రెండు రోజులుగా వారు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అయితే చినజీయర్ ఆశ్రమంలో తలదాచుకునేందుకు వారికి కొంత చోటు దొరికింది. ఆశ్రమం వారే ప్రస్తుతం వారి ఆలనాపాలన చూస్తున్నారు. చలిగాలుల తీవ్రత పెరగడంతో ఆస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉన్న ఒక వైద్యుడు వారికి చికిత్స చేస్తున్నారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదని వారు చెబుతున్నారు. మరోవైపు ఆ రాష్ట్రంలో వర్షాలు మరింత ఎక్కువయ్యాయి. బద్రినాథ్ నుంచి రుషికేష్ వెళ్లే రోడ్డు వరదల కారణంగా కొట్టుకుపోయింది. 24 గంటల వ్యవధిలో ఏడు సెంటీమీటర్ల వర్షం కురవడంతో అక్కడికి వెళ్లిన యాత్రికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బద్రీనాథ్ వాతావరణం ప్రమాదకరంగా మారిందని వాళ్లంటున్నారు. ప్రతికూల పరిస్థితుల కారణంగా వరసగా నాలుగో రోజు కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్‌ధామ్ యాత్రను రద్దు చేసింది . యాత్ర మార్గంలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారులు ఎప్పుడు మెరుగైతే అప్పుడు తిరిగి యాత్ర ప్రారంభిస్తారు.