దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాకిస్థాన్ ప్రధానమంత్రికి జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అహ్మద్ చెబుతున్నారు.
చీకటి సామ్రాజ్య అధినేత, భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ అయిన దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లో ఉన్నాడన్నది ఇన్నాళ్లూ అందరూ నమ్ముతున్న విషయం. అయితే, దావూద్ మాత్రం తమ దేశంలో లేడని పాకిస్థాన్ ప్రధానమంత్రికి జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అహ్మద్ చెబుతున్నారు. సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దావూద్ ఎక్కడున్నాడో భారత్ తమకు సమాచారం ఇస్తే, అతడిని పట్టుకోడానికి తామంఉ ప్రయత్నిస్తామని చెప్పారు.
1993 నాటి ముంబై పేలుళ్ల కాలం నుంచి భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్న దావూద్ ఇబ్రహీంకు అల్ ఖైదాతో కూడా సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అమెరికా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాదం అనేది భారత్, పాక్ రెండు దేశాలకూ ఉన్న సమస్య అని.. ఇరుదేశాలూ కలిసి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సర్తాజ్ అహ్మద్ చెబుతున్నారు.