అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య
* భార్యాపిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న బాలరాజ్
* హైదరాబాద్ సీతారాంబాగ్‌లో విషాదం
హైదరాబాద్: అప్పుల బాధకు ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు కవల పిల్లలు మృతిచెందారు. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి... సీతారాంబాగ్ అఫ్జల్‌సాగర్ పాలమూరు బస్తీ వాసి, పాత సామాన్ల వ్యాపారస్తుడైన బాలరాజ్(30), సురేఖ(24) భార్యాభర్తలు. వీరికి 13 నెలల కవలలు మేథ, మేఘన. బాలరాజ్ తల్లి మణెమ్మ, సోదరుడు ప్రేమ్‌తో కలసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు.
బాలరాజ్ వ్యాపారం దివాలా తీయడంతో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకొస్తున్నాడు. రెండు నెలలుగా ఖాళీగా ఉండటంతో అప్పులు అధికమై, వడ్డీలు పేరుకుపోయాయి. బాకీల కోసం అప్పులవాళ్ల ఒత్తిడి పెరిగింది. వాటిని తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురైన బాలరాజ్ ఆదివారం రాత్రి భోజనం చేసిన తరువాత తన కుటుంబంతో ఓ గదిలోకి వెళ్లారు. తొలుత భార్యకు కూల్‌డ్రింక్‌లో, పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి... అనంతరం అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారం ఉదయం 9 గంటలైనా గదిలో నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో అనుమానం వచ్చిన సోదరుడు.. తలుపులు పగులగొట్టాడు. పరుపు మీద సురేఖ, పిల్లలు.. ఫ్యాన్‌కు వేలాడుతూ బాలరాజ్ కనిపించారు. వారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఆర్థిక కారణాలే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గోషామహాల్ ఏసీపీ రాంభూపాల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హృదయ విదారక దృశ్యం చూసి బస్తీవాసులు కన్నీటి పర్యంతమయ్యారు.