Mass suicide
-
ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి
జోథ్‌పూర్ : రాజస్తాన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్ధుల కుటుంబంలో 11 మంది ఆదివారం జోద్‌పూర్‌లోని వారి ఇంట్లో మరణించిన ఘటన కలకలం రేపింది. ఘటన జరిగిన ప్రాంతంలో పురుగు మందుల వాసన వస్తుండటంతో విషవాయువులు విడుదలవడంతో వారు మరణించి ఉంటారని భావిస్తున్నారు. జోథ్‌పూర్ జిల్లా కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరంలోని దియోదు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడిఉంటారని స్ధానికులు పేర్కొంటున్నారు. భారత పౌరసత్వం పొందేందుకు బాధిత కుటుంబం 2012లో పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతం నుంచి భారత్‌కు తరలివచ్చింది. చదవండి : మార్చి లో పెళ్లి.. ఆగస్టులో ఆత్మహత్య అప్పటి నుంచి వారు శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా ఎలా మరణించారనే కారణాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఇక ఘటన జరిగిన సమయంలో ఇంటిలో లేకపోవడంతో ఓ కుటుంబ సభ్యుడు ప్రాణాలతో బయటపడ్డారని స్ధానికులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో యూపీలోని శాంతిపూర్ ప్రాంతంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకోగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా పడిఉండటాన్ని గుర్తించారు. గత ఏడాది డిసెంబర్ 14న ఆర్థిక ఇబ్బందులతో తమిళనాడులోని మధురై ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. -
‘నాన్నా.. నువ్విలానా..’
నాన్న మంచివాడు కాదు! మనసు ఎన్ని నరాలను తెంపుకుంటే అనుకోగలిగిన మాట. కొడుకు వేరు. కూతుళ్లు నాన్న గురించి ఒక్క చెడ్డమాటైనా వినేందుకు పుట్టనట్లుగా పెరుగుతారు. నాన్న తప్పా అది, మనుషుల్లోంచి దూరంగా లాగి, నాన్నను ఊహల్లో పెంచుకున్న కూతుళ్ల తప్పా? నాన్న మంచివాడు కాకపోతే కలిగే బాధ కన్నా, నాన్న మంచివాడు కాదు అనుకోవలసి వచ్చిన బాధ ఇంకా ఎక్కువ. అమ్మెప్పుడూ నాన్న మీద పిల్లలకు కంప్లయింట్ చెయ్యదు. ‘పిల్లలు చూస్తున్నారు’ అని జాగ్రత్త పడుతుంది. అమ్మపై చెయ్యేత్తేటప్పుడు పిల్లలున్నారేమోనని నాన్నెప్పుడూ చూసుకోడు. అప్పుడూ అమ్మే జాగ్రత్త పడుతుంది. అప్పుడైనా తప్పించుకుని పిల్లల్లోకి వచ్చేయడం కాదు అమ్మపడే జాగ్రత్త. పిల్లలకు నాన్న కనిపించకుండా తలుపులు దగ్గరగా వేస్తుంది. పిల్లల ముందు నాన్న పలుచన కాకూడదని ఆత్మాభిమానాన్ని గొంతులోనే దిగమింగేస్తుంది. అమ్మ జాగ్రత్తలు తీసుకున్నంత వరకే నాన్న మంచితనం. జీవితాంతం అమ్మ జాగ్రత్తలూ తీసుకుంటూ ఉంటే జీవితాంతం నాన్న మంచివాడే. ఎంత జాగ్రత్తగా ఉండే అమ్మయినా, అమ్మ జాగ్రత్తగా లేకపోయిన రోజొకటొస్తే పిల్లల మనసుల్లోని మంచినాన్న తప్పించుకోలేడు. ‘నాన్నా.. నువ్విలానా..’ అనే నమ్మలేనితనం నుంచి పిల్లలూ తప్పించుకోలేరు. మానసకు పదిహేడేళ్లు. పీయూసీ చదువుతోంది. భూమిక పదిహేనేళ్లమ్మాయి. టెన్త్ స్టూడెంట్. అమ్మ రాజేశ్వరి (43). నాన్న సిద్దయ్య. వీళ్ల కుటుంబం ఉండడం బెంగళూరు దగ్గరి శ్రీనగరలో. పందొమ్మిదేళ్ల క్రితం సిద్ధయ్యను పెళ్లి చేసుకున్నాక చామరాజనగర్ నుంచి భర్తతో పాటు శ్రీనగర వచ్చేసింది రాజేశ్వరి. సిద్ధయ్య ప్రభుత్వోద్యోగి. లైన్‌మ్యాన్. రెండు రోజుల క్యాంప్‌కని చెప్పి శుక్రవారం తమిళనాడు వెళ్లాడు. వెళ్లే ముందు రాజేశ్వరికి, సిద్ధయ్యకు గొడవైంది. నాన్న ఎంత ఆలస్యంగా ఇంటికొచ్చినా గొడవ పడని అమ్మ, నాన్న తాగొచ్చినా గొడవపడని అమ్మ, నాన్న చేయి చేసుకున్నా గొడవపడని అమ్మ.. ఎందుకోసం నాన్నతో గొడవపడుతోందో కొంతకాలంగా మానస, భూమికల గ్రహింపుకు వస్తూనే ఉంది. అమ్మ అడుగుతున్న ప్రశ్నలో తప్పులేదు. అమ్మ అడుగుతున్న ప్రశ్నకు నాన్న దగ్గర సమాధానం లేదు. అమ్మ కన్నీళ్లనైతే వాళ్లు చూడగలుగుతున్నారు గానీ అమ్మ కన్నీళ్లు కడిగేస్తున్న నాన్ననే చూడలేకపోతున్నారు! చివరిసారిగా శుక్రవారం నాడు అమ్మానాన్న మధ్య పెద్ద గొడవ జరిగింది. నిజంగా చివరిసారి. రాజేశ్వరి తమ్ముడు పుట్టస్వామి అక్కడికి దగ్గర్లోనే గాంధీ బజార్ ప్రాంతంలో ఉంటాడు. అక్కంటే అతడికి ప్రాణం. అక్కపిల్లలంటే ముద్దు. బావంటే గౌరవం. అక్కాబావ గొడవపడినప్పుడు అక్కనే సర్దుకుపొమ్మని చెప్పేంత గౌరవం అతడికి బావగారి మీద! బావ క్యాంప్‌కి వెళ్లినట్లు అతడికి తెలీదు. సోమవారం వాట్సాప్‌లో మానస స్టాటస్ చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఒక్క ఉదుటున లేచి అక్క ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులకు లోపల్నుంచి తాళం వేసి ఉంది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. ముగ్గురూ గదిలోని ఫ్యాన్‌కు వేలాడుతున్నారు! కుప్పకూలిపోయాడు పుట్టస్వామి. అక్కడేం సూయిసైడ్ నోట్ కనిపించలేదు. కానీ మానస స్టాటస్‌లో రాసుకున్న రెండే రెండు మాటల్లో అంతకంటే పెద్ద మరణ వాజ్ఞ్మూలమే ఉంది. వాజ్ఞ్మూలం కాదు. మరణధ్వని. అది గుర్తుకొస్తోంది పుట్టస్వామికి. ‘‘ప్రతి ఒక్కరికీ మంచి నాన్న ఉండాలి. ఆ వరాన్ని దేవుడు మాకు ఇవ్వలేదు’’.. మానస స్టేటస్‌లోని మాటలివి. స్టేటస్‌లో ఏదైనా ఇరవై నాలుగు గంటలే ఉంటుంది. మానస రాసుకున్న ఆ మాటలు ఏ తరానికీ చెరిగిపోనివి. సిద్ధయ్య క్యాంప్ నుంచి మధ్యలోనే వచ్చి ఉంటాడు. తను కోల్పోయింది ఏమిటో తెలుసుకుని విలపించే ఉంటాడు. భార్య ఏళ్లుగా ప్రాధేయపడుతూ వచ్చింది. ఏళ్లుగా గొడవపడుతూ వచ్చింది. అయినా అతడు మారలేదు. ఆమె, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్లింది అతడి పరస్త్రీ వ్యామోహం. -
బురారీ ఉదంతం: ఒంటరిని.. పోరాడలేను
న్యూఢిల్లీ : గత ఏడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్యల ఉందతాన్ని అంత సులభంగా మర్చిపోలేం. ముఢవిశ్వాసంతో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కుటుంబానికి సంబంధించి ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు. మరణించిన నారాయణ దేవి పెద్ద కుమారుడు దినేష్ చుందావత్ మాత్రమే ప్రస్తుతం బతికి ఉన్నాడు. జరిగిన దారుణాన్ని నేటికి కూడా అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ విషయం గురించి దినేష్ మాట్లాడుతూ.. ‘వ్యాపార నిమిత్తం నేను మా స్వస్థలం రాజస్తాన్ చిత్తోర్‌గఢ్‌లో ఉంటున్నాను. జరిగిన దారుణం గురించి తెలిసి షాక్‌కు గురయ్యాను. మా కుటుంబ సభ్యులు అందరు చాలా మంచివారు. బయటి వ్యక్తులను ఎప్పుడు కనీసం ‘థూ’ అని కూడా ఎరగరు. పైగా మాది విద్యావంతుల కుటుంబం. అలాంటిది కేవలం మూఢనమ్మకంతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే నమ్మశక్యంగా లేదు. పోలీసుల విచరణ పట్ల నేను సంతృప్తిగా లేను. కానీ ప్రస్తుతం నేను ఒంటరిగా మిగిలాను.. పోరాడే ఓపిక లేదు’ అన్నాడు. (చదవండి : 11 మంది మరణం: అతడే సూత్రధారి) అంతేకాక ‘మా కుటంబంలో జరిగిన విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. తాంత్రిక శక్తులంటూ ఏవేవో పుకార్లు వ్యాపించాయి. ప్రస్తుతం మా ఇంటికి సంబంధించి కూడా ఇలాంటి వార్తలే ప్రచారం చేస్తున్నారు. మా ఇంటిని తక్కువ రేటుకు కొట్టేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నార’ని దినేష్ ఆరోపించాడు. ఇంతమంది మృతికి నారాయణ దేవి(77) చిన్న కుమారుడు లలిత్ భాటియా(45)నే కారణం. అతడు మరణించిన తండ్రి తనకు కనిపిస్తున్నాడని, తనతో మాట్లాడుతున్నాడని.. తనకు సందేశాలు ఇస్తున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పేవాడు. ఈ క్రమంలోనే తండ్రి సందేశాలను రిజిస్టర్లో రాసి మిగతా కుటుంబ సభ్యులకు తెలిపేవాడు. అందులో భాగంగానే రిజిస్టర్లో ఒక చోట ‘త్వరలోనే మీ ఆఖరి కోరికలు నెరవేరతాయి. అప్పుడు ఆకాశం తెరుచుకుంటుంది. భూమి కంపిస్తుంది. కానీ ఎవరూ భయపడకండి. గట్టిగా మంత్రాన్ని జపించండి నేను మిమ్మల్ని కాపాడతాను’ అని తండ్రి తనతో చెప్పినట్లు కాగితంలో రాసి కుటుంబ సభ్యులకు తెలిపాడు. లలిత్ భాటియా చెప్పిన విషయాలను మిగతా కుటుంబ సభ్యులు కూడా నమ్మి అతడు చెప్పినట్లే ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు పోలీసులు. -
బురారీ కేసు.. ప్రమాదం మాత్రమే : ఫోరెన్సిక్ రిపోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ సామూహిక మరణాల మిస్టరీ వీడింది. భాటియా కుటుంబ సభ్యులవి ఆత్మహత్యలు కావని.. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదం మాత్రమేనని సీబీఐ- సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. గత జూన్‌లో ఢిల్లీలోని బురారి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలోని 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. వారిలో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతుండగా, ఇంటి యజమాని నారాయణ దేవి (75) గొంతు కోయడం వల్ల చనిపోయింది. కాగా తాంత్రిక పూజల ప్రభావానికి లోనుకావడం వల్లే వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు భావించారు. భాటియా కుటుంబ సభ్యుల్లో ఒకడైన లలిత్ భాటియా మూఢనమ్మకాల కారణంగానే ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని విచారణలో వెల్లడైంది. అయితే భాటియా కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఈ విషయాన్ని వ్యతిరేకించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో ఉరివేసుకోవడం వల్లే మరణించారని నివేదిక రావడంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. వీరి మరణాలకు గల స్పష్టమైన కారణాలు తెలుసుకునేందుకు.. మృతుల సైకలాజికల్ అటాప్సీ నివేదిక ఇవ్వాల్సిందిగా సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు లేఖ రాశారు. వీరికి ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఏమాత్రం లేదని.. ఇదొక ప్రమాదమని ఫోరెన్సిక్ ల్యాబ్ బుధవారం సాయంత్రం నివేదిక ఇచ్చింది. సైకలాజికల్ అటాప్సీ అంటే... మెడికల్ రిపోర్టుల ఆధారంగా ఒక వ్యక్తి మానసిక స్థితిని అధ్యయనం చేసే ప్రక్రియనే సైకలాజికల్ అటాప్సీ అంటారు. సైకలాజికల్ అటాప్సీలో వ్యక్తి స్నేహితులు, వ్యక్తిగత డైరీలు, కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. బురారీ కేసులో కూడా ఈ ప్రక్రియనే అనుసరించామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సైకలాజికల్ అటాప్సీలో భాగంగా భాటియా కుటుంబ యజమాని నారాయణ దేవి పెద్ద కుమారుడు దినేశ్ సింగ్ చందావత్, అతడి సోదరి సుజాతా నాగ్‌పాల్‌ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, లలిత్ భాటియా డైరీలు, రిజిస్టర్లు, ఇరుగుపొరుగు వారు చెప్పిన విషయాల ఆధారంగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
11 మంది మరణం: అతడే సూత్రధారి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని బురారీ ప్రాంతంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని చేధించారు ఢిల్లీ పోలీసులు. మొదటి నుంచి కేసులో కీలకంగా మారిన రిజిష్టర్‌లోని ప్రతుల్లోని చేతి రాతలు, మృతుల్లో ఒకడైన లలిత్ భాటియా చేతి రాతతో సరిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. లలిత్ భాటియాకు ఉన్న భ్రమలు, ఆత్మల పట్ల నమ్మకాలే అతనితో పాటు మిగతా కుటుంబ సభ్యులను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని పోలీసులు తెలిపారు. ఎవరీ లలితభాటియా... నారాయణ దేవి(77) చిన్న కుమారుడు లలిత్ భాటియా(45). తనతో పాటు తన కుటుంబానికే చెందిన మరో 10 మంది సామూహిక ఆత్మహత్యలకు ప్రణాళిక రూపొందించిన వ్యక్తి కూడా ఇతనే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిరాణా దుకాణం నడుపుతున్న లలిత్ భాటియా ఐదేళ్ల నుంచి మౌనవ్రతాన్ని పాటిస్తున్నాడు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చివరకు దుకాణానికి వచ్చిన వారితో కూడా మూగ సైగలు, చేతి రాతల ద్వారానే సంభాషించేవాడు. ఇలాంటిది ఉన్నట్టుండి గత కొంతకాలం నుంచి భాటియా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. అది కూడా తన తండ్రి తనకు ‘కనిపించినప్పటి నుంచి’. కనిపించడం ఏంటంటే లలిత్ భాటియా తండ్రి పదేళ్ల క్రితమే మరణించాడు. మరణించిన తండ్రి తనకు కనిపిస్తున్నాడని, తనతో మాట్లాడుతున్నాడని.. తనకు సందేశాలు ఇస్తున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పేవాడు భాటియా. ఈ క్రమంలోనే తండ్రి సందేశాలను రిజిస్టర్లో రాసి మిగతా కుటుంబ సభ్యులకు తెలిపేవాడు. అందులో భాగంగానే రిజిస్టర్లో ఒక చోట ‘త్వరలోనే మీ ఆఖరి కోరికలు నెరవేరతాయి. అప్పుడు ఆకాశం తెరుచుకుంటుంది. భూమి కంపిస్తుంది. కానీ ఎవరూ భయపడకండి. గట్టిగా మంత్రాన్ని జపించండి నేను మిమ్మల్ని కాపాడతాను’ అని తండ్రి తనతో చెప్పినట్లు కాగితంలో రాసి కుటుంబ సభ్యులకు తెలిపాడు. లలిత్ భాటియా చెప్పిన విషయాలను మిగతా కుటుంబ సభ్యులు కూడా నమ్మి అతడు చెప్పినట్లే ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు పోలీసులు. మోక్షం పొందాలనే కోరికతో... మంత్ర, తంత్రాలపై ఉన్న మూఢనమ్మకంతోనే ఇలా సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. మొదటి నుంచి అందరిలోనూ రేకెత్తిన అనుమానాలకు పేపర్లలో ఉన్నచేతి రాతలను గుర్తించడం ద్వారా సమాధానం దొరికిందని పోలీసులు చెప్పారు. లలిత్ భాటియాకు ఉన్న భ్రమలే కుటుంబ సభ్యులందరిని మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదికలు... 11 మందిలో ఇప్పటి వరకు ఆరుగురి పోస్ట్‌మార్టం నివేదికలు వచ్చాయి. ఉరితీత వల్ల వారి మరణాలు సంభవించినట్లు డాక్టర్లు తేల్చారు. వారి శరీరాలపై ఎటువంటి గాయాల గుర్తులు లేవని నివేదికలు పేర్కొన్నాయి. మృతుల నేత్రాలను దానం చేయాలని వారి కుటుంబసభ్యులు కోరారు. ఇంతమంది మృతదేహాలను రాజస్థాన్‌లోని స్వగ్రామానికి తీసుకుని వెళ్లి అంత్యక్రియలు నిర్వహించడం కష్టం కనుక ఢిల్లీలోనే అంత్యక్రియలు జరపాలని వారు నిర్ణయించారు. -
సన్నీకి యువసేన భారీ షాక్..!
సాక్షి, బెంగళూరు: బాలీవుడ్ నటి సన్నిలియోన్‌కు కర్ణాటక రక్షణ వేదిక యువసేన భారీ షాకిచ్చింది. బెంగళూరులో జరగనున్న నూతన సంవత్సర వేడుకల్లో సన్నీ పాల్గొనేందుకు వీళ్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ న్యూ ఇయర్ వేడుకల్లో సన్నీ పాల్గొంటే.. సామూహిక ఆత్మహత్యకు వెనుకాడే ప్రసక్తే లేదంటూ యువసేన హెచ్చరించింది. న్యూ ఇయర్ లాంటి భారీ ఈవెంట్లు వచ్చాయంటే సన్నీ లియోన్ లాంటి హాట్ భామలకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తుంటాయి. ఈ క్రమంలో బెంగళూరు న్యూ ఇయర్ ఈవెంట్లో పాల్గొనే ఆఫర్ రావడంతో సన్నీ ఒకే చెప్పింది. కాగా, సన్నీ గతం మంచిదికాదని, ఆమెలాంటి వాళ్లను ప్రోత్సహించడం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదని, కర్ణాటక సంస్కృతిని రక్షించుకోవాలంటే ఆ నటిని ఇక్కడికి రాకుండా చేయాలంటూ కర్ణటక రక్షణ వేదిక యువసేన పిలుపునిచ్చింది. ఈ మేరకు కర్ణాటకలో పలు జిల్లా కేంద్రాల్లో సన్నీ లియోన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి, ఆమె పోస్టర్లు, ఫొటోలు కాల్చేశారు. ఇక్కడికి రాకపోతే సన్నీకే మంచిదని, అలా కానిపక్షంలో 20 జిల్లాల్లో ఆమెకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈవెంట్ నిర్వాహకుడు హరీశ్ మాట్లాడుతూ.. గతంలో కర్ణాటకలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో సన్నీ పాల్గొన్నారు. కన్నట పాటకు సంప్రదాయ దుస్తులు ధరించి సన్నీ షోలో పాల్గొంటుంటే, అడ్డుకోవాలనుకోవడం మంచిది కాదన్నారు. ఎన్నో మంచి ఆఫర్లను తిరస్కరించి సన్నీ ఈ షోకు ఒకే చెప్పారని, ఎందుకంటే ఆ నటికి హైదరాబాద్ అన్నా, బెంగళూరన్నా చాలా ఇష్టమని తెలిపారు. -
కాటేసిన ‘కంతు’
మానవత్వం మరిచిపోయి డబ్బే ప్రధానంగా చేసిన వడ్డీ వ్యాపారం ఒక కుటుంబాన్ని బలితీసుకుంది. అప్పుల్లో నిలువునా కూరుకుపోయి కంతువడ్డీ చెల్లించలేక తగులబడిపోయింది. ఈ ఆత్మాహుతి యత్నంలో భార్య, ఇద్దరు పిల్లలు మంటలకు దహించుకుపోగా, తీవ్రమైన కాలిన గాయాలతో భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాక్షి ప్రతినిధి, చెన్నై: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఇద్దరు చిన్నారులతో కలసి భార్య భర్త కలెక్టరేట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటలకు తాళలేక పసిబిడ్డలు ఆర్తనాదాలు కలచివేశాయి. తిరునెల్వేలి జిల్లా కడయనల్లూరు కాశీదర్మంకు చెందిన కూలీ కార్మికుడు ఇసక్కిముత్తు (27), భార్య సుబ్బులక్ష్మి (25) దంపతులు. వీరికి మదిచారుణ్య (4), అక్షయశరణ్య (2) అనే ఇద్దరు పిల్లలున్నారు. అదే ప్రాంతానికి చెందిన ముత్తులక్ష్మి అనే మహిళ వద్ద ఇసక్కిముత్తు అప్పు తీసుకున్నాడు. అప్పులకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లించినా ఇంకా వడ్డీ ఇవ్వాలని ముత్తులక్ష్మి బెదిరించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇసక్కిముత్తు సోమవారం ఉదయం తన భార్య, పిల్లలు, సోదరుడు గోపి, తల్లి పేచ్చియమ్మాళ్, బంధువు ఇసక్కిదురై తదితరులతో తన ఊరి నుంచి బయలుదేరి తిరునెల్వేలికి చేరుకున్నాడు. తనతో వచ్చిన బంధువులు, తల్లిని పంపివేసి ఇసక్కిముత్తు తన భార్య పిల్లలతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కంతు వడ్డీ బాధల గురించి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఏమైందో ఏమో తనపై కిరోసిన్ పోసుకుని భార్య, పిల్లలపై కూడా పోసి నిప్పంటించాడు. ఒంటిపై మంటలను తట్టుకోలేక కుటుంబమంతా హాహాకారాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయ పరిసరాల్లో పరుగులు పెట్టింది. ఒంటిపై వస్త్రాల వల్ల ఎక్కువసేపు మంటలు రేగడంతో అందరూ తల్లడిల్లిపోయారు. ముఖ్యంగా మంటల ధాటికి చిన్నారులు దయనీయంగా కేకలు పెట్టడం అందరినీ కలిచివేసింది. వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు సైతం పరుగులు తీశారు. సమీపంలోని కొందరు వారిపై నీళ్లుపోసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కళ్లముందు ఒక కుటుంబం మంటలకు ఆహుతి కావడాన్ని చూసి తట్టుకోలేని స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు, 108 అంబులెన్స్ అక్కడికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ పెద్ద ఇసక్కిముత్తు విషమ పరిస్థితిని ఎదుర్కొంటుండగా మిగిలిన ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. సంఘటన స్థలానికి వచ్చిన జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి, ఆత్మాహుతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదుకునేవారు లేకనే ఆత్మాహుతి : సోదరుడు గోపీ ఇసక్కిముత్తు సోదరుడు గోపీ మీడియాతో మాట్లాడుతూ, కంతు వడ్డీ వేధింపులపై జిల్లా కలెక్టర్‌కు ఆరుసార్లు వినతిపత్రం సమర్పించినా అప్పు ఇచ్చిన వారి ఆగడాలు ఆగలేదని తెలిపాడు. అచ్చన్న పుత్తూరు ఇన్స్పెక్టర్ ప్రయివేటు పంచాయతీపెట్టి బెదిరించడాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నాడు. ఆ వినతి ఎస్పీని, తరువాత డీఎస్పీని దాటుకుని అదే ఇన్స్పెక్టర్ చేతికి వచ్చిందని వాపోయాడు. నాపైనే ఫిర్యాదు చేస్తారా అని ఇన్స్పెక్టర్ బెదిరింపులకు పా ల్పడ్డాడని చెప్పాడు. నలువైపుల నుంచి బెదిరింపులు పెరగడంతో గత్యంతరం లేక ఇసక్కిముత్తు కుటుంబం ప్రాణాలు తీసుకునేందుకు నిర్ణయించుకుందని ఆవేదన చెందాడు. -
అంతటా ఇదే చర్చ..
♦ కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు ♦ సురేష్ ఆచూకీపై వీడని ఉత్కంఠ సూర్యాపేట క్రైం : సురేష్ ఉన్నాడా.. లేడా..? ఉంటే ఎక్కడున్నాడు..? అప్పుల బాధ తాళలేక అతనే ఎక్కడికైనా పరారయ్యాడా..? కుటుంబసభ్యుల సామూహిక ఆత్మహత్య విషయం అతనికి తెలిసిందా..? ఇంతకీ వ్యాపారం చేశాడా..? చేస్తేనిజంగానే నష్టం వచ్చిందా..? లేక జల్సాలకు అలవాటుపడి డబ్బులు ఖర్చు చేశాడా..? ఇప్పుడు సూర్యాపేట పట్టణంలో ఎక్కడా చూసినా ఇదే చర్చ జరుగుతోంది. సురేష్ ఆచూకీపై ఎన్నో ప్రశ్నలు వేధిస్తున్నాయి. దీంతో జిల్లా పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఆరు నెలలుగా ఫోన్ కాల్ కూడా లేదు.. ఫారెక్స్ అమెరికన్ బేస్డ్ మల్టీనేషన్ కంపెనీగా తెలుస్తోంది. దీని ద్వారా సురేష్ షేర్ మార్కెట్ వ్యాపారం చేస్తాడని సమాచారం. అయితే కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లుగా ప్రచారం జరుగుతుండడం.. తరచూ సురేష్ çపుణె వెళ్తున్నట్లుగా తెలుస్తుండగా గత ఆరు నెలలుగా ççపుణె నుంచి, మహారాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల నుంచి కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా ఆయనకు వచ్చినట్లుగా ఆధారాలు లేవని విశ్వసనీయంగా తెలుస్తోంది. రూ.కోట్ల పెట్టుబడులు ఎక్కడ పెట్టారు.. సురేష్ వ్యాపారం పేరుతో సేకరించిన రూ.కోట్ల పెట్టుబడులు ఎక్కడ పెట్టారనే కోణంలో విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు బ్యాంకు ఖాతాను పరిశీలించేందుకు నిమగ్నమయ్యారు. సురేష్ ఫోన్ ఆధారంగా విచారణ ముందుకు సాగకపోవడంతో పోలీసులు షేర్‌మార్కెట్ బ్యాంకు ఖాతాను పరిశీలించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే సురేష్ ఫోన్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లగానే స్విచ్ఆఫ్ అయినట్లు సమాచారం. కానీ ఇంట్లో మాత్రం పూణెకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లడం జరిగింది.అసలు సురేష్ ççపుణెకు వెళ్లాడా.. లేక మధ్యలోనే ఆగిపోయాడ అన్న కోణాలపై పోలీసులు దృష్టిపెట్టినట్లు సమాచారం. ఇండిగో విమానం ఎక్కేందుకు ప్రయత్నం సురేష్ ఇండిగో విమానం ఎక్కేందుకు ప్రయత్నించగా దొరకలేదని తెలిసింది. హైదరాబాద్‌లోని స్వప్నం ట్రావెల్స్ నుంచి çపుణెకుటిక్కెట్ బుకింగ్ చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 11వ తేదీన అర్ధరాత్రి 10:44 నిమిషాలకు భార్య ప్రభాతతో చివరి సారిగా ఫోన్ మాట్లాడి హైదరాబాద్‌లో ఉన్నానని.. ఇక్కడి నుంచి ççపుణెకు వెళ్తున్నట్లుగా చెప్పినట్లు భార్య సూసైడ్‌నోట్‌లో పేర్కొంది. పుణే లేదా ముంబయిలోనా.. సురేష్ మాత్రం ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు భార్య ప్రభాతతో పూణేకువెళ్తున్నానని చెప్పాడు. అయితే సురేష్ çపుణేలోనే ఉన్నాడా.. లేక ముంబయిలో ఉన్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి అందరికీ దూరంగా ఉన్నాడా..? సజీవంగా ఉన్నాడా లేక జరగరాని ఘోరమేమైనా జరిగిందా..? అనేది మిస్టరీగా మారింది. ఒకవేళ బతికే ఉంటే ఆయన కుటుంబ సభ్యులు ఆరుగురు ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన జాతీయ మీడియాలో కూడా ప్రసారమైంది. తెలిసి ఉండికూడా రావడం లేదా..? లేక ఏమైనా జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య
* భార్యాపిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న బాలరాజ్ * హైదరాబాద్ సీతారాంబాగ్‌లో విషాదం హైదరాబాద్: అప్పుల బాధకు ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు కవల పిల్లలు మృతిచెందారు. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి... సీతారాంబాగ్ అఫ్జల్‌సాగర్ పాలమూరు బస్తీ వాసి, పాత సామాన్ల వ్యాపారస్తుడైన బాలరాజ్(30), సురేఖ(24) భార్యాభర్తలు. వీరికి 13 నెలల కవలలు మేథ, మేఘన. బాలరాజ్ తల్లి మణెమ్మ, సోదరుడు ప్రేమ్‌తో కలసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. బాలరాజ్ వ్యాపారం దివాలా తీయడంతో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకొస్తున్నాడు. రెండు నెలలుగా ఖాళీగా ఉండటంతో అప్పులు అధికమై, వడ్డీలు పేరుకుపోయాయి. బాకీల కోసం అప్పులవాళ్ల ఒత్తిడి పెరిగింది. వాటిని తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురైన బాలరాజ్ ఆదివారం రాత్రి భోజనం చేసిన తరువాత తన కుటుంబంతో ఓ గదిలోకి వెళ్లారు. తొలుత భార్యకు కూల్‌డ్రింక్‌లో, పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి... అనంతరం అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం 9 గంటలైనా గదిలో నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో అనుమానం వచ్చిన సోదరుడు.. తలుపులు పగులగొట్టాడు. పరుపు మీద సురేఖ, పిల్లలు.. ఫ్యాన్‌కు వేలాడుతూ బాలరాజ్ కనిపించారు. వారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఆర్థిక కారణాలే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గోషామహాల్ ఏసీపీ రాంభూపాల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హృదయ విదారక దృశ్యం చూసి బస్తీవాసులు కన్నీటి పర్యంతమయ్యారు.