మంటలను మట్టితో ఆర్పుతున్న దృశ్యం, మంటలకు ఆహుతవుతున్న తల్లి, పిల్లలు
మానవత్వం మరిచిపోయి డబ్బే ప్రధానంగా చేసిన వడ్డీ వ్యాపారం ఒక కుటుంబాన్ని బలితీసుకుంది. అప్పుల్లో నిలువునా కూరుకుపోయి కంతువడ్డీ చెల్లించలేక తగులబడిపోయింది. ఈ ఆత్మాహుతి యత్నంలో భార్య, ఇద్దరు పిల్లలు మంటలకు దహించుకుపోగా, తీవ్రమైన కాలిన గాయాలతో భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఇద్దరు చిన్నారులతో కలసి భార్య భర్త కలెక్టరేట్‌లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటలకు తాళలేక పసిబిడ్డలు ఆర్తనాదాలు కలచివేశాయి. తిరునెల్వేలి జిల్లా కడయనల్లూరు కాశీదర్మంకు చెందిన కూలీ కార్మికుడు ఇసక్కిముత్తు (27), భార్య సుబ్బులక్ష్మి (25) దంపతులు. వీరికి మదిచారుణ్య (4), అక్షయశరణ్య (2) అనే ఇద్దరు పిల్లలున్నారు. అదే ప్రాంతానికి చెందిన ముత్తులక్ష్మి అనే మహిళ వద్ద ఇసక్కిముత్తు అప్పు తీసుకున్నాడు. అప్పులకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లించినా ఇంకా వడ్డీ ఇవ్వాలని ముత్తులక్ష్మి బెదిరించినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇసక్కిముత్తు సోమవారం ఉదయం తన భార్య, పిల్లలు, సోదరుడు గోపి, తల్లి పేచ్చియమ్మాళ్, బంధువు ఇసక్కిదురై తదితరులతో తన ఊరి నుంచి బయలుదేరి తిరునెల్వేలికి చేరుకున్నాడు.
తనతో వచ్చిన బంధువులు, తల్లిని పంపివేసి ఇసక్కిముత్తు తన భార్య పిల్లలతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కంతు వడ్డీ బాధల గురించి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఇంతలో ఏమైందో ఏమో తనపై కిరోసిన్ పోసుకుని భార్య, పిల్లలపై కూడా పోసి నిప్పంటించాడు. ఒంటిపై మంటలను తట్టుకోలేక కుటుంబమంతా హాహాకారాలు చేస్తూ కలెక్టర్ కార్యాలయ పరిసరాల్లో పరుగులు పెట్టింది. ఒంటిపై వస్త్రాల వల్ల ఎక్కువసేపు మంటలు రేగడంతో అందరూ తల్లడిల్లిపోయారు. ముఖ్యంగా మంటల ధాటికి చిన్నారులు దయనీయంగా కేకలు పెట్టడం అందరినీ కలిచివేసింది. వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు సైతం పరుగులు తీశారు. సమీపంలోని కొందరు వారిపై నీళ్లుపోసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
కళ్లముందు ఒక కుటుంబం మంటలకు ఆహుతి కావడాన్ని చూసి తట్టుకోలేని స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు, 108 అంబులెన్స్ అక్కడికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ పెద్ద ఇసక్కిముత్తు విషమ పరిస్థితిని ఎదుర్కొంటుండగా మిగిలిన ముగ్గురు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. సంఘటన స్థలానికి వచ్చిన జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి, ఆత్మాహుతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆదుకునేవారు లేకనే ఆత్మాహుతి : సోదరుడు గోపీ
ఇసక్కిముత్తు సోదరుడు గోపీ మీడియాతో మాట్లాడుతూ, కంతు వడ్డీ వేధింపులపై జిల్లా కలెక్టర్‌కు ఆరుసార్లు వినతిపత్రం సమర్పించినా అప్పు ఇచ్చిన వారి ఆగడాలు ఆగలేదని తెలిపాడు. అచ్చన్న పుత్తూరు ఇన్‌స్పెక్టర్ ప్రయివేటు పంచాయతీపెట్టి బెదిరించడాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నాడు. ఆ వినతి ఎస్పీని, తరువాత డీఎస్పీని దాటుకుని అదే ఇన్‌స్పెక్టర్ చేతికి వచ్చిందని వాపోయాడు. నాపైనే ఫిర్యాదు చేస్తారా అని ఇన్‌స్పెక్టర్ బెదిరింపులకు పా ల్పడ్డాడని చెప్పాడు. నలువైపుల నుంచి బెదిరింపులు పెరగడంతో గత్యంతరం లేక ఇసక్కిముత్తు కుటుంబం ప్రాణాలు తీసుకునేందుకు నిర్ణయించుకుందని ఆవేదన చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment