ప్రతీకాత్మక చిత్రం
నాన్న మంచివాడు కాదు! మనసు ఎన్ని నరాలను తెంపుకుంటే అనుకోగలిగిన మాట. కొడుకు వేరు. కూతుళ్లు నాన్న గురించి ఒక్క చెడ్డమాటైనా వినేందుకు పుట్టనట్లుగా పెరుగుతారు. నాన్న తప్పా అది, మనుషుల్లోంచి దూరంగా లాగి, నాన్నను ఊహల్లో పెంచుకున్న కూతుళ్ల తప్పా? నాన్న మంచివాడు కాకపోతే కలిగే బాధ కన్నా, నాన్న మంచివాడు కాదు అనుకోవలసి వచ్చిన బాధ ఇంకా ఎక్కువ.
అమ్మెప్పుడూ నాన్న మీద పిల్లలకు కంప్లయింట్ చెయ్యదు. ‘పిల్లలు చూస్తున్నారు’ అని జాగ్రత్త పడుతుంది. అమ్మపై చెయ్యేత్తేటప్పుడు పిల్లలున్నారేమోనని నాన్నెప్పుడూ చూసుకోడు. అప్పుడూ అమ్మే జాగ్రత్త పడుతుంది. అప్పుడైనా తప్పించుకుని పిల్లల్లోకి వచ్చేయడం కాదు అమ్మపడే జాగ్రత్త. పిల్లలకు నాన్న కనిపించకుండా తలుపులు దగ్గరగా వేస్తుంది. పిల్లల ముందు నాన్న పలుచన కాకూడదని ఆత్మాభిమానాన్ని గొంతులోనే దిగమింగేస్తుంది. అమ్మ జాగ్రత్తలు తీసుకున్నంత వరకే నాన్న మంచితనం. జీవితాంతం అమ్మ జాగ్రత్తలూ తీసుకుంటూ ఉంటే జీవితాంతం నాన్న మంచివాడే.
ఎంత జాగ్రత్తగా ఉండే అమ్మయినా, అమ్మ జాగ్రత్తగా లేకపోయిన రోజొకటొస్తే పిల్లల మనసుల్లోని మంచినాన్న తప్పించుకోలేడు. ‘నాన్నా.. నువ్విలానా..’ అనే నమ్మలేనితనం నుంచి పిల్లలూ తప్పించుకోలేరు. మానసకు పదిహేడేళ్లు. పీయూసీ చదువుతోంది. భూమిక పదిహేనేళ్లమ్మాయి. టెన్త్ స్టూడెంట్. అమ్మ రాజేశ్వరి (43). నాన్న సిద్దయ్య. వీళ్ల కుటుంబం ఉండడం బెంగళూరు దగ్గరి శ్రీనగరలో. పందొమ్మిదేళ్ల క్రితం సిద్ధయ్యను పెళ్లి చేసుకున్నాక చామరాజనగర్ నుంచి భర్తతో పాటు శ్రీనగర వచ్చేసింది రాజేశ్వరి. సిద్ధయ్య ప్రభుత్వోద్యోగి. లైన్‌మ్యాన్. రెండు రోజుల క్యాంప్‌కని చెప్పి శుక్రవారం తమిళనాడు వెళ్లాడు. వెళ్లే ముందు రాజేశ్వరికి, సిద్ధయ్యకు గొడవైంది. నాన్న ఎంత ఆలస్యంగా ఇంటికొచ్చినా గొడవ పడని అమ్మ, నాన్న తాగొచ్చినా గొడవపడని అమ్మ, నాన్న చేయి చేసుకున్నా గొడవపడని అమ్మ.. ఎందుకోసం నాన్నతో గొడవపడుతోందో కొంతకాలంగా మానస, భూమికల గ్రహింపుకు వస్తూనే ఉంది. అమ్మ అడుగుతున్న ప్రశ్నలో తప్పులేదు. అమ్మ అడుగుతున్న ప్రశ్నకు నాన్న దగ్గర సమాధానం లేదు. అమ్మ కన్నీళ్లనైతే వాళ్లు చూడగలుగుతున్నారు గానీ అమ్మ కన్నీళ్లు కడిగేస్తున్న నాన్ననే చూడలేకపోతున్నారు! చివరిసారిగా శుక్రవారం నాడు అమ్మానాన్న మధ్య పెద్ద గొడవ జరిగింది. నిజంగా చివరిసారి.
రాజేశ్వరి తమ్ముడు పుట్టస్వామి అక్కడికి దగ్గర్లోనే గాంధీ బజార్ ప్రాంతంలో ఉంటాడు. అక్కంటే అతడికి ప్రాణం. అక్కపిల్లలంటే ముద్దు. బావంటే గౌరవం. అక్కాబావ గొడవపడినప్పుడు అక్కనే సర్దుకుపొమ్మని చెప్పేంత గౌరవం అతడికి బావగారి మీద! బావ క్యాంప్‌కి వెళ్లినట్లు అతడికి తెలీదు. సోమవారం వాట్సాప్‌లో మానస స్టాటస్ చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఒక్క ఉదుటున లేచి అక్క ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులకు లోపల్నుంచి తాళం వేసి ఉంది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. ముగ్గురూ గదిలోని ఫ్యాన్‌కు వేలాడుతున్నారు! కుప్పకూలిపోయాడు పుట్టస్వామి. అక్కడేం సూయిసైడ్ నోట్ కనిపించలేదు. కానీ మానస స్టాటస్‌లో రాసుకున్న రెండే రెండు మాటల్లో అంతకంటే పెద్ద మరణ వాజ్ఞ్మూలమే ఉంది. వాజ్ఞ్మూలం కాదు. మరణధ్వని. అది గుర్తుకొస్తోంది పుట్టస్వామికి. ‘‘ప్రతి ఒక్కరికీ మంచి నాన్న ఉండాలి. ఆ వరాన్ని దేవుడు మాకు ఇవ్వలేదు’’.. మానస స్టేటస్‌లోని మాటలివి. స్టేటస్‌లో ఏదైనా ఇరవై నాలుగు గంటలే ఉంటుంది. మానస రాసుకున్న ఆ మాటలు ఏ తరానికీ చెరిగిపోనివి.
సిద్ధయ్య క్యాంప్ నుంచి మధ్యలోనే వచ్చి ఉంటాడు. తను కోల్పోయింది ఏమిటో తెలుసుకుని విలపించే ఉంటాడు. భార్య ఏళ్లుగా ప్రాధేయపడుతూ వచ్చింది. ఏళ్లుగా గొడవపడుతూ వచ్చింది. అయినా అతడు మారలేదు. ఆమె, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్లింది అతడి పరస్త్రీ వ్యామోహం.
Comments
Please login to add a commentAdd a comment