Sitarambagh
-
శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ధూల్‌పేట్ సీతారాంబాగ్‌లో శ్రీరాముని కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాంబాగ్ నుంచి శ్రీసీతారామ స్వామి శోభాయాత్ర ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా యోగి స్వామి హాజరయ్యారు. కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎక్కువ వాహనాలకు అనుమతిని పోలీసులు నిరాకరించారు. కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతించారు. శోభాయాత్ర జరిగే పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. పోలీసులకు సహకరించి భక్తులు ప్రశాంతంగా శోభాయాత్ర నిర్వహించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గోషామహల్, సుల్తాన్‌బజార్ ఠాణాల పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి 11.30 గంటలకు వరకు అవసరం మేరకు ట్రాఫిక్ మళ్లిస్తామని పోలీసులు వెల్లడించారు. 21 ప్రాంతాల్లో శోభా యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 11 గంటలకు హనుమాన్ వ్యాయామశాలకు శోభా యాత్ర చేరుకోనుంది. -
HYD: వేలాది భక్తుల నడుమ సాగుతున్న శ్రీరాముడి శోభాయాత్ర
సాక్షి, హైదరాబాద్: ఆకాష్‌పురి మందిరం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది భక్తుల నడుమ శ్రీరాముడి శోభాయాత్ర సాగుతుంది. 1500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీతారామ్‌బాగ్ నుంచి సుల్తాన్‌బజార్ వరకు 6.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో సాగునున్న శోభాయాత్రను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. శోభాయాత్ర ప్రాంతాల్లో ఆక్టోపస్, రిజర్వ్ పోలీస్ మోహరించారు. సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశామని సౌత్ వెస్ట్ డీసీపీ కిరణ్ ఖారే తెలిపారు. చదవండి: శ్రీరాముడి శోభాయాత్ర.. ట్రాఫిక్ డైవర్షన్ వివరాలు ఇవే.. -
రారండోయ్ రాములోరి వేడుక చూద్దాం!
సాక్షి, అబిడ్స్/బహదూర్‌పురా: శ్రీరామ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. సీతారామ్‌బాగ్ ద్రౌపది గార్డెన్ నుంచి వేలాది మందితో శోభాయాత్ర ప్రారంభం కానుంది. అధికారుల సంయుక్తాధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ చేసినట్లు భాగ్యనగర్ శ్రీరామ నవమి శోభాయాత్ర సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంతరావు తెలిపారు. శ్రీరామ నవమి శోభాయాత్రను పురస్కరించుకొని నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ శాంతి భద్రతలపై పోలీసు అధికారులు, సిబ్బందితో శనివారం సాలార్జంగ్ మ్యూజియంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీసీ టీవీలు, డ్రోన్లు, సమస్యాత్మక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు, అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తున్నామన్నారు. శోభాయాత్ర కొనసాగే దారి పొడవునా సీసీ కెమెరాలతో నిఘా ముమ్మరం చేస్తామని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ ‘100’ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్ సూచించారు. రూట్‌మ్యాప్ ఇలా.. సీతారామ్‌బాగ్ ద్రౌపది గార్డెన్ నుంచి సీతారామ్‌పేట్ మీదుగా బోయిగూడ కమాన్, ప్రకాష్ టాకీస్, మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ మీదుగా ధూల్‌పేట్ ప్రధాన రోడ్డు వెంబడి శోభాయాత్ర కొనసాగుతుంది. పురానాపూల్ చౌరస్తా, జుమ్మెరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్ ఛత్రి, సిద్ధి అంబర్ బజార్, గౌడలిగూడ, కోఠి మీదుగా హనుమాన్ టేక్డీకి చేరుకుంటుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్‌పేట్ గంగాబౌలి నుంచి శోభాయాత్ర నిర్వహిస్తారు. ధూల్‌పేట్ మాగ్రా నుంచి ఆనంద్‌సింగ్ ఆధ్వర్యంలో పాల్కి యాత్ర నిర్వహిస్తారు. (చదవండి: శ్రీరాముడు భారతీయుల ఇష్ట దైవం: సీఎం) -
కారుపై కూలిన గోడ : డ్రైవర్‌కు గాయాలు
హైదరాబాద్: పాఠశాల గోడ కూలి కారుపై పడింది. దీంతో కారు డ్రైవర్‌కు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన నగరంలోని సీతాబాగ్ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక బాలాజీ పాఠశాల గోడ కూలి... ఓలా క్యాబ్‌పై పడటంతో.. క్యాబ్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో కారు స్వల్పంగా ధ్వంసమైంది. నగరంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గోడ నానడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య
* భార్యాపిల్లలకు విషమిచ్చి ఉరేసుకున్న బాలరాజ్ * హైదరాబాద్ సీతారాంబాగ్‌లో విషాదం హైదరాబాద్: అప్పుల బాధకు ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో భార్యాభర్తలతో పాటు కవల పిల్లలు మృతిచెందారు. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి... సీతారాంబాగ్ అఫ్జల్‌సాగర్ పాలమూరు బస్తీ వాసి, పాత సామాన్ల వ్యాపారస్తుడైన బాలరాజ్(30), సురేఖ(24) భార్యాభర్తలు. వీరికి 13 నెలల కవలలు మేథ, మేఘన. బాలరాజ్ తల్లి మణెమ్మ, సోదరుడు ప్రేమ్‌తో కలసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. బాలరాజ్ వ్యాపారం దివాలా తీయడంతో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకొస్తున్నాడు. రెండు నెలలుగా ఖాళీగా ఉండటంతో అప్పులు అధికమై, వడ్డీలు పేరుకుపోయాయి. బాకీల కోసం అప్పులవాళ్ల ఒత్తిడి పెరిగింది. వాటిని తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురైన బాలరాజ్ ఆదివారం రాత్రి భోజనం చేసిన తరువాత తన కుటుంబంతో ఓ గదిలోకి వెళ్లారు. తొలుత భార్యకు కూల్‌డ్రింక్‌లో, పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి... అనంతరం అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం 9 గంటలైనా గదిలో నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో అనుమానం వచ్చిన సోదరుడు.. తలుపులు పగులగొట్టాడు. పరుపు మీద సురేఖ, పిల్లలు.. ఫ్యాన్‌కు వేలాడుతూ బాలరాజ్ కనిపించారు. వారిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఆర్థిక కారణాలే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గోషామహాల్ ఏసీపీ రాంభూపాల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హృదయ విదారక దృశ్యం చూసి బస్తీవాసులు కన్నీటి పర్యంతమయ్యారు.