సాక్షి, అబిడ్స్/బహదూర్‌పురా: శ్రీరామ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. సీతారామ్‌బాగ్ ద్రౌపది గార్డెన్ నుంచి వేలాది మందితో శోభాయాత్ర ప్రారంభం కానుంది. అధికారుల సంయుక్తాధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ చేసినట్లు భాగ్యనగర్ శ్రీరామ నవమి శోభాయాత్ర సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంతరావు తెలిపారు.
శ్రీరామ నవమి శోభాయాత్రను పురస్కరించుకొని నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ శాంతి భద్రతలపై పోలీసు అధికారులు, సిబ్బందితో శనివారం సాలార్‌జంగ్ మ్యూజియంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీసీ టీవీలు, డ్రోన్‌లు, సమస్యాత్మక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు, అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తున్నామన్నారు. శోభాయాత్ర కొనసాగే దారి పొడవునా సీసీ కెమెరాలతో నిఘా ముమ్మరం చేస్తామని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ ‘100’ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్ సూచించారు.
రూట్‌మ్యాప్ ఇలా..
సీతారామ్‌బాగ్ ద్రౌపది గార్డెన్ నుంచి సీతారామ్‌పేట్ మీదుగా బోయిగూడ కమాన్, ప్రకాష్ టాకీస్, మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ మీదుగా ధూల్‌పేట్ ప్రధాన రోడ్డు వెంబడి శోభాయాత్ర కొనసాగుతుంది. పురానాపూల్ చౌరస్తా, జుమ్మెరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్ ఛత్రి, సిద్ధి అంబర్ బజార్, గౌడలిగూడ, కోఠి మీదుగా హనుమాన్ టేక్డీకి చేరుకుంటుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్‌పేట్ గంగాబౌలి నుంచి శోభాయాత్ర నిర్వహిస్తారు. ధూల్‌పేట్ మాగ్రా నుంచి ఆనంద్‌సింగ్ ఆధ్వర్యంలో పాల్కి యాత్ర నిర్వహిస్తారు.
(చదవండి: శ్రీరాముడు భారతీయుల ఇష్ట దైవం: సీఎం)
Comments
Please login to add a commentAdd a comment