జయలలిత పేరుతో కొత్త పార్టీ
- దీప భర్త మాధవన్ వేరుకుంపటి
- పార్టీ పేరు ‘ఎంజీఆర్ జయలలిత ద్రవిడ మున్నేట్ర కళగం’
- దీపపై రూ.20 కోట్ల మోసం కేసు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో అమ్మ పేరిట మరో కొత్తపార్టీ జీవంపోసుకుంది. దివంగ సీఎం జయలలిత మేనకోడలు దీప భర్త మాధవన్ ‘ఎంజీఆర్ జయలలిత ద్రవిడ మున్నేట్ర కళగం’ (ఎంజేడీఎంకే) అనే కొత్త పార్టీని స్థాపించారు.
శుక్రవారం ఉదయం జయలలిత సమాధి వద్దకు వెళ్లి అంజలి ఘటించిన మాధవన్.. ఆ తరువాత పార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించారు. దీప పేరవైకి తన పార్టీకి సంబంధం లేదని, దీపకు ఇష్టమైతే తన పార్టీలో చేరవచ్చని తెలిపారు. అన్నాడీఎంకేలో వర్గపోరు కారణంగా ఎవరికీ దక్కకుండాపోయిన రెండాకుల చిహ్నాన్ని తాము సాధిస్తానని మాధవన్ మీడియాకు చెప్పారు.
ఇటీవలి ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగిన దీప.. తన నామినేషన్ పత్రాల్లో భర్త పేరును రాయనికారణంగా దంపతుల మధ్య విబేధాలు చెలరేగాయి. నాటి నుంచి ఇరువురి మధ్య మనస్పర్థలు అంతకంతకూ పెద్దవవుతూ వచ్చాయి. అంబేడ్కర్ జయంతి రోజున దీప, మాధవన్‌ల అనుచరులు తీవ్రంగా ఘర్షణపడ్డారు. కొన్నిరోజులుగా దీపను వదిలివేరుగా ఉంటున్న మాధవన్ రాజకీయ పార్టీని పెట్టడం చర్చనీయాంశమైంది.
దీపపై రూ.20 కోట్ల మోసం కేసు
ఎంజీఆర్ అమ్మ దీప పేరవై కింద సభ్యత్వ దరఖాసుల రుసుం కింద రూ.20 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ చెన్నై నగరం నెశపాక్కంకు చెందిన జానకిరామన్ అనే వ్యక్తి చెన్నై మాంబళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రద్దు చేసిన దీప పేరవై పేరుతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులను అమ్మి, సభ్యత్వ రుసుమును స్వీకరించిన దీపపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.