వర్సిటీ, యూజీసీ మధ్య వివాదం ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ల మధ్య చినికి చినికి గాలివానగా మారిన నాలుగేళ్ల అండర్‌గ్రాడ్యుయేషన్ కోర్సు(ఎఫ్‌వైయూపీ) వివాదం కొత్త మలుపు తిరిగింది. ఢిల్లీ వర్సిటీ అనుబంధ కాలేజీలు 2014-15 విద్యాసంవత్సం అడ్మిషన్లను సోమవారం వాయిదా వేశాయి. అర్హత గల సంస్థ ఈ వ్యవహారంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చేంతవరకు అడ్మిషన్లను వాయిదా వేస్తున్నట్లు తెలిపాయి. అడ్మిషన్లు మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. వీటి వాయిదా కారణంగా 60 వేల మంది విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారు. గత ఏడాది ప్రవేశపెట్టిన ఎఫ్‌ఐయూపీ కింద కాకుండా మూడేళ్ల డిగ్రీ కోర్సు కిందే అడ్మిషన్లు నిర్వహించాలని, దీన్ని అమలు చేస్తున్నట్లు నివేదిక పంపాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని వర్సిటీకి యూజీసీ ఆదివారం విధించిన గడువు సోమవారంతో ముగిసింది.
అయితే ఎఫ్‌ఐయూపీపై పట్టుదలతో ఉన్న వర్సిటీ యూజీసీ ఆదేశాలను ధిక్కరించింది. కోర్సుపై అస్పష్టతతోపాటు యూజీసీ గడువు ముగియడంతో అడ్మిషన్లు వాయిదా వేయాలని కాలేజీల ప్రిన్సిపాళ్లు అత్యవసరంగా సమావేశమై నిర్ణయం తీసుకున్నారు.