మనోజ్ తివారీ స్పెషల్ సాంగ్.. ఇది వారికోసమే!
మనోజ్ తివారీ స్పెషల్ సాంగ్.. ఇది వారికోసమే!
Published Tue, Dec 20 2016 1:28 PM | Last Updated on Fri, Mar 29 2019 9:14 PM
న్యూఢిల్లీ : ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఓ స్పెషల్ సాంగ్ పాడారు. అయితే ఈ పాట ఓ మూవీ కోసమో, ప్రైవేట్ ఆల్బమ్ కోసమో కాదు. పాత నోట్లు రద్దయిన దగ్గర్నుంచి నగదు కోసం బ్యాంకుల వద్ద నిరీక్షిస్తున్న వారికోసం ఈ ప్రత్యేక పాటను ఆలపించారు. క్యూలో నిల్చున్న వారందరూ దేశభక్తులుగా నిలిచిపోతారంటూ అభివర్ణిస్తూ మనోజ్ తివారీ ఈ పాటను పాడారు. పాత నోట్లు రద్దయిన దగ్గర్నుంచి బ్యాంకులు, ఏటీఎంల వద్ద నుంచి నగదు తీసుకోవడం కష్టతరంగా మారిన సంగతి తెలిసిందే. రోజుల తరబడి ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల వద్దనే నిరీక్షిస్తున్నారు.
వారందరి కోసం మనోజ్ తివారీ ఆ పాటను దేశరాజధానిలోని మోతీ బాగ్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఓ ప్రొగ్రామ్లో ఆలపించారు. బ్లాక్మనీపై పోరాటానికి ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించే వారు దేశభక్తులుగా పరిగణించబడతారని పలువురు అభివర్ణించారు కూడా. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు వహిస్తున్న మనోజ్ తివారీ, రాజకీయాలోకి రాకముందు గాయకుడు, నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, సంగీత దర్శకుడు. అనంతరం ఆయన బిహార్ నుంచి రాజకీయాలోకి ప్రవేశించి, ఢిల్లీకి పార్టీ అధ్యక్షుడయ్యారు.
Advertisement