టాటా, బిర్లాల నష్టం ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బడా పారిశ్రామికవేత్తలకు భారీగానే తాకింది. గత 15 రోజులుగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరెన్సీ నోట్ల రద్దు టాటా, బిర్లాకు భారీ షాకిచ్చింది. టాటా, బిర్లా, మహేంద్ర గ్రూపులకు చెందిన మార్కెట్ వాల్యూ కుప్పకూలింది. దాదాపు రూ. 61,664 కోట్ల (9 బిలియన్ డాలర్ల) సంపద తుడుచు పెట్టుకుపోయింది.
ఒకవైపు స్టాక్ మార్కెట్ భారీ ఒడిదుడులకు మధ్య కొనసాగుతుండగా.. టాటా,బిర్లా గ్రూపు కంపెనీల లాభాలు కేవలం8 సెషన్లలో భారీగా నష్టపోయాయి. భారీ అమ్మకాల నేపథ్యంలో దాదాపు అన్ని మేజర్ కంపెనీలు భారీగా పతనమవుతుండగా ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ మాత్రం స్వల్ప నష్టాలను పరిమితం కావడం విశేషం. నవంబరు 8-21 మధ్య కాలంలో టాటా గ్రూపులోని 27మంది వాటాదారులకు చెందిన 39,636 కోట్లు,టీసీఎస్ రూ.21,839 కోట్లు , టాటా మెటార్స్ రూ.8,954 కోట్లు, టైటాన్ రూ. 3,131 కోట్లు, టాటా స్టీల్ రూ.1,128 కోట్లు ఆవిరై పోయాయి. అలాగే బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్ కూడా భారీగానే నష్టపోయింది. ఈ కంపెనీలో 62.26 వాటా కలిగివున్న ప్రమోటర్లు రూ.10,678 కోట్లు నష్టపోయారు. అలాగే గ్రాసిం ఇండస్ట్రీస్ వెయ్యికోట్లు, హిందాల్కో సుమారు 800 కోట్లను కోల్పోయాయి. మహేంద్ర గ్రూపు 6 వేలకోట్లు నష్టపోయింది. ఎంఅండ్ఎం, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సంస్థ వాటాదారులరూ. 5278 కోట్ల పెట్టుబడులు గల్లంతయ్యాయి. కాగా రిలయన్స్ గ్రూపు 1.78 శాతం మాత్రమే నష్టపోయింది. మిగతా మార్కెట్ దిగ్గజ కంపెనీలతో పోలిస్తే ముఖ్యంగా ఆర్ఐఎల్ 1748కోట్లను, టీవీ18 రూ.704కోట్ల నష్టాలతో సరిపెట్టుకుంది.
కాగా ఆపరేషన్ బ్లాక్ మనీ, అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బెంచ్ మార్క్ సెన్సెక్స్ కూడా 7శాతం పతనాన్ని నమోదుచేసింది. దీంతోపాటుగా నోట్ల రద్దు ప్రభావం, ఫెడ్ వడ్డీరేట్లు పెంచనుందనే అంచనాలతో దేశీయ కరెన్సీ విలవిల్లాడుతోంది. డాలర్ మారకపు రేటుతో రూపాయి రూ.68.50 వద్ద తొమ్మిది నెలల కనిష్టాన్ని నమోదుచేసిన సంగతి తెలిసిందే.