
సొమ్మసిల్లి పడిపోయిన కడియం
- వరంగల్‌లో అవతరణ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం
- వడదెబ్బకు గురై.. ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి ప్రసంగం
వరంగల్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఒక్కసారిగా సృహతప్పి పడిపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. వరంగల్ నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఉదయం అవతరణ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన కడియం.. ప్రగతి నివేదిక చదువుతుండగా ఎండదెబ్బకు గురై కిందపడిపోయారు.
దీంతో అక్కడున్న అధికారులు, సిబ్బంది, ప్రజలు ఏం జరిగిందోనని కలవరపాటుకు గురయ్యారు. గార్డులు తక్షణమే స్పందించి డిప్యూటీ సీఎంను ఆయన వాహనంలోకి ఎక్కించారు. నిమిషాల వ్యవధిలోనే కడియం కుదుట పడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కోలుకున్న వెంటనే తిరిగి కాసేపు ప్రసంగించారాయన. ఇవాళ ఉదయం వరంగల్‌లో ఎండ అధికంగా ఉండటంతో వేడుకలకు హాజరైనవారు ఇబ్బందులు పడ్డారు.
వెనక్కుతగ్గని వైనం
అస్వస్థతకుగురైనప్పటికీ కార్యక్రమం నుంచి వెళ్లిపోయేందుకు నిరాకరించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఆస్పత్రిలో చేరాల్సిందిగా వేడుకున్నప్పటికీ ఆయన వినిపించుకోలేదు. కార్యక్రమం పూర్తయ్యేంతవరకూ తాను ఇక్కడే ఉంటానని అధికారులకు స్పష్టం చేశారు. చాలా సేపటివరకు కడియం కారులోనే కూర్చుని వేడుకలను వీక్షించారు.