కరెక్షన్ బాటలో మార్కెట్..!
మార్చి డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ప్రభావం
ఆర్థిక సంవత్సరాంతపు
లాభాల స్వీకరణకు అవకాశం
న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరాంతపు లాభాల స్వీకరణ, మార్చి డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కారణంగా ఈ వారం కూడా స్టాక్ మార్కెట్లో కరెక్షన్ కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనావేశారు. గత శుక్రవారం ఒకటిన్నర నెలల కనిష్టస్థాయిలో ముగిసిన స్టాక్ సూచీలు రానున్న ట్రేడింగ్ సెషన్లలో సైతం అమ్మకాల ఒత్తిడికి లోనుకావొచ్చని వారన్నారు. ఈ వారం దేశీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గణాంకాలేవీ వెలువడ నందున, షేర్ల ధరలపై ఒత్తిడి ఏర్పడవచ్చని వారు అభిప్రాయపడ్డారు. డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ట్రెండ్, క్రూడ్ ధరల హెచ్చుతగ్గులు తదితర అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చని వారన్నారు. మార్చి త్రైమాసికానికి కార్పొరేట్ల లాభాలు చెప్పుకోదగ్గ రీతిలో పెరగకపోవొచ్చన్న అంచనాలతో గత రెండు ట్రేడింగ్ సెషన్ల నుంచి ఇన్వెస్టర్లను బలహీన సెంటిమెంట్ ఆవరించింది.
దాంతో బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు క్షీణించి, ఒకటిన్నర నెలల కనిష్టస్థాయిలో ముగిసాయి. వచ్చే గురువారం మార్చి నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు ముగియనున్నందున, ట్రేడర్లు వారి పొజిషన్లను ఆఫ్‌లోడ్ చేస్తారని, దాంతో మార్కెట్ బలహీనపడుతుందని నిపుణులు హెచ్చరించారు. మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున లాభాల స్వీకరణ కొనసాగుతుందని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ఇక మార్కెట్లకు క్యూ4 ఆర్థిక ఫలితాలే ఉత్సాహాన్నివ్వాల్సివుంది. ఏప్రిల్ రెండోవారం నుంచి క్యూ4 ఫలితాల సీజన్ మొదలవుతుంది.
అయితే ఆ ఫలితాలు మందకొడిగా వుంటాయన్న అంచనాలు కొనసాగుతున్నాయని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా అన్నారు. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు తక్షణమే వుండకపోవొచ్చన్న సంకేతాలు గతవారపు ఫెడ్ కమిటీ సమావేశంలో వెల్లడికావడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. అందువల్ల ఇకనుంచి ఇన్వెస్టర్ల దృష్టి రూపాయి- డాలరు మారకం, ముడిచమురు ధరల వంటి అంశాలపైకి మళ్లుతుందని బొనంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ వారం మార్కెట్ స్వల్పహెచ్చుతగ్గులతో బుల్లిష్‌గానే ఉంటుందని అంచనావేశారు.