ఒడిదుడుకుల వారం..
జీఎస్‌టీ బిల్లు ఆమోదంపై అంచనాలు
♦ డెరివేటివ్‌ల ముగింపు కారణంగా హెచ్చుతగ్గులు
♦ కీలక కంపెనీల క్యూ1 ఫలితాల ప్రభావం
♦ ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అభిప్రాయం
న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్‌టెల్ , హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు, జీఎస్‌టీ బిల్లుకు సంబంధించి పార్లమెంట్‌లో జరిగే పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నాయని నిపుణులంటున్నారు. జూలై నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ఈ వారమే(ఈ నెల 28న) ముగియనున్నందున ఒడిదుడుకులు తప్పవని వారంటున్నారు.
వీటితో పాటు వర్షపాతం, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ల పోకడ, రూపాయి మారకం గమనం, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి.. తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు.
పై స్థాయిల్లో లాభాల స్వీకరణ...
పార్లమెంట్‌లో ఆమోదం పొందాల్సిన బిల్లులు క్యూలో ఉన్నాయని, ఇవి ఆమోదం పొందితే మార్కెట్ మరింతగా పెరుగుతుందని సామ్‌కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. అలా కాని పక్షంలో స్వల్పకాలానికి మార్కెట్ పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుందని వివరించారు. జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందితే సెంటిమెంట్‌కు మరింత జోష్ వస్తుందని ఈక్విరస్ సెక్యూరిటీస్ హెడ్ పంకజ్ శర్మ పేర్కొన్నారు.
పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగే అవకాశముందని, ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ట్రేడ్‌బుల్స్ సీఓఓ ధ్రువ్ దేశాయ్ చెప్పారు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే, అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఈ నెల 26-27), బ్యాంక్ ఆఫ్ జపాన్‌ల(ఈ నెల 28-29) సమావేశాలు ఈ వారంలోనే జరగనున్నాయి. రేట్ల విషయమై ఈబ్యాంక్‌లు యథాతథ స్థితిని కొనసాగించవచ్చని అంచనాలున్నాయి.