జీఎస్టీ బిల్లుపై ఇన్వెస్టర్ల దృష్టి... | Macro-data, Q1 results to steer equity markets (Market Outlook) | Sakshi
Sakshi News home page

జీఎస్టీ బిల్లుపై ఇన్వెస్టర్ల దృష్టి...

Published Mon, Aug 1 2016 1:11 AM | Last Updated on Tue, Oct 2 2018 5:42 PM

జీఎస్టీ బిల్లుపై ఇన్వెస్టర్ల దృష్టి... - Sakshi

జీఎస్టీ బిల్లుపై ఇన్వెస్టర్ల దృష్టి...

కంపెనీల ఆర్థిక ఫలితాలు కీలకమే
ఈ వారం మార్కెట్‌పై విశ్లేషకుల ఉవాచ

 న్యూఢిల్లీ: జీఎస్‌టీ బిల్లుపై పురోగతి, ఈ వారం కంపెనీలు వెల్లడించే ఆర్థిక ఫలితాలపై ఈ వారం స్టాక్ మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని నిపుణులంటున్నారు. వీటితో పాటు నైరుతి రుతుపవనాల విస్తరణ, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం.. తదితర అంశాలు తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. స్వాతంత్య్రానంతరం అతి పెద్ద పరోక్ష పన్నుల సంస్కరణగా భావించే జీఎస్‌టీ బిల్లుపై చర్చకోసం ఈ వారం రాజ్యసభ ఎజెండాలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. ఇన్వెస్టర్ల కళ్లన్నీ జీఎస్‌టీ బిల్లుకు సంబంధించిన పార్లమెంట్ పరిణామాలపైనే ఉన్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు.

ప్రతిపాదిత బిల్లులో ప్రభుత్వ కొన్ని మార్పులు, చేర్పులు చేయడంతో ఈ బిల్లు ఆమోదం పొందగలదన్న అంచనాలు పెరిగాయి. జూలై నెల అమ్మకాల గణాంకాలను వాహన కంపెనీలు వెల్లడిస్తాయని, ఈ కారణంగా వాహన షేర్లు వెలుగులోకి రావచ్చని సింఘానియా పేర్కొన్నారు. ఈ వారంలో వెలువడే తయారీ, సేవల రంగానికి చెందిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందని వివరించారు.

సోమవారం మార్కెట్ ఎకనామిక్స్ సంస్థ తయారీ రంగానికి సంబంధించి పీఎంఐ గణాంకాలను, బుధవారం(3వ తేదీన) నికాయ్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ గణాంకాలను వెల్లడిస్తాయి.  ఈ నెల 9న ఆర్‌బీఐ పాలసీని ప్రకటించనున్న నేపథ్యంలో ఈ గణాంకాలు కీలకమని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన ఆనంద్ జేమ్స్ వివరించారు.

 లాభాల స్వీకరణ అవకాశాలు..
రానున్న సెషన్లలో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగే అవకాశమున్నందున స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని ట్రేడ్‌బుల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ధ్రువ్  దేశాయ్ పేర్కొన్నారు. ముడి చమురు ధరలు తగ్గడంతో విమానయాన కంపెనీలు లాభపడవచ్చని పేర్కొన్నారు.  పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినందున ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి.

4 నెలల గరిష్టానికి విదేశీ పెట్టుబడులు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) ఈక్విటీ నికర పెట్టుబడులు జూలై నెలలో రూ.12,600 కోట్లను దాటాయి. ఇది 4 నెలల గరిష్ట స్థాయి. జీఎస్‌టీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందగలదన్న అంచనాలు, కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉండటం, వర్షాలు కూడా సంతృప్తికరంగా కురియడం వంటి సానుకూలతల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల జోరును కొనసాగిస్తున్నారని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు గత నెలలో స్టాక్ మార్కెట్లో రూ.12,612 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.6,845 కోట్లు చొప్పున నికర పెట్టుబడులు పెట్టారు. దీంతో వీరి మొత్తం పెట్టుబడులు రూ.19,457 కోట్లకు పెరిగాయి. మార్చి తర్వాత అధికంగా పెట్టుబడులు వచ్చింది గత నెలలోనే. మార్చిలో విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు రూ.21,143 కోట్లుగా ఉన్నాయి. 

 ఒక శాతం అదనపు పన్ను తొలగింపుతో సానుకూలం: నిపుణులు
రాష్ట్రాల మధ్య సరుకుల రవాణాపై అదనంగా ఒక శాతం పన్ను విధించాలన్న నిబంధన నుంచి కేంద్రం వెనక్కి తగ్గడంతో వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లుపై నెలకొన్న కారు మబ్బులు తొలగిపోయినట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నిర్ణయాన్ని పలు వర్గాలు స్వాగతించాయి. బిల్లు ఆమోదంతో జీడీపీ 2 పాయింట్ల మేర వృద్ధి చెందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వారం రాజ్యసభ ముందుకు జీఎస్‌టీ బిల్లును తీసుకొచ్చి ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న కేంద్ర సర్కారు.... ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్లలో ఒకటైన అంతర్రాష్ట్ర సరుకుల రవాణాపై ఒక శాతం అదనపు పన్నును తొలగించేందుకు నిర్ణయించింది. అలాగే, జీఎస్‌టీ కారణంగా రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని ఐదేళ్ల పాటు సర్దుబాటు చేసేందుకు కూడా అంగీకరించింది.

పన్ను రేటు రాష్ట్రం పరిధిలో ఉండరాదు..
అంతర్రాష్ట్ర సరుకుల సరఫరాపై ప్రభావం చూపే ఒక శాతం అదనపు పన్ను తొలగింపుతో జీఎస్‌టీ బిల్లులో పన్ను విధానం సర ళంగా మారింది. అయితే, పన్ను శ్రేణిని నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకు ఇస్తే.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పన్ను రేటు ఉంటుంది. ఒకే పన్ను రేటుతో దేశం మొత్తం ఏకీకృత మార్కెట్‌గా ఉండాలన్న ఉద్దేశాన్ని ఇది దెబ్బతీస్తుంది. 2017 ఏప్రిల్ నుంచే బిల్లును అమలు చేయాలన్నది దూకుడుగా ఉంది. సేవా రంగం ఇంకా ఈ బిల్లును పూర్తిగా అర్థం చేసుకోలేదు. అర్థవంతమైన అమలుకు తదుపరి చర్యలు అవసరం.
- మహేశ్ జైసింగ్, బీఎమ్‌ఆర్ అండ్ అసోసియేట్స్ పార్ట్‌నర్ 

ఎంపీలు బాధ్యతగా వ్యవహరిస్తారని...
జీఎస్‌టీ బిల్లులో మార్పులు ప్రభుత్వ అంకితభావాన్ని తెలియజేస్తోంది. ప్రజాప్రతినిధులు దేశ ప్రయోజనాల దృష్ట్యా బిల్లుకు ఆమోదం తెలిపే విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. - సచిన్‌మీనన్,  కేపీఎంజీ పార్ట్‌నర్ 

 జీఎస్‌టీలోకి లిక్కర్, పెట్రోల్..
అదనంగా1% పన్ను విధింపుతో మొత్తం సరఫరా వ్యవస్థ వ్యయం పెరిగి పోతుంది. దీన్ని తొలగించడం మంచి నిర్ణయం. లిక్కర్, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాకపోవడం రాష్ట్రాల ప్రయోజనాల కోణంలో తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. సమీప భవిష్యత్తులో ఇవీ జీఎస్‌టీలోకి వచ్చి చేరతాయి. - అనితా రస్తోగి, పీడబ్ల్యూసీ పార్ట్‌నర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement