ఈ వారం నుంచి ప్రారంభమయ్యే ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు స్టాక్‌మార్కెట్‌కు కీలకమని నిపుణులంటున్నారు. వీటితో పాటు పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు, ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం, తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని వారంటున్నారు.
ఈ వారంలో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు తమ క్యూ1 ఫలితాలను వెల్లడిస్తాయి. రేపు (ఈ నెల 10–మంగళవారం) టీసీఎస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌ల క్యూ1 ఫలితాలు వస్తాయి. ఈ నెల 13న(శుక్రవారం) ఇన్ఫోసిస్ తన జూన్ క్వార్టర్ ఫలితాలను వెల్లడిస్తుంది. సైయంట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లు కూడా ఈ వారంలోనే తమ ఫలితాలను వెల్లడిస్తాయి. ఇక ఆర్థిక గణాంకాల విషయానికొస్తే, ఈ నెల 12న(గురువారం)మే నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడవుతాయి.
ఈ ఏడాది మార్చిలో 4.6 శాతంగా ఉన్న ఐఐపీ ఈ ఏడాది ఏప్రిల్‌లో 4.9 శాతానికి పెరిగింది. మేలో 5.9 శాతానికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. అదే రోజు జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా వస్తాయి. ఈ ఏడాది మేలో 4.87 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఈ జూన్‌లో 5.2 శాతానికి పెరుగుతుందన్న అంచనాలున్నాయి.
రుతు పవనాలపై ఇన్వెస్టర్ల దృష్టి...
ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై, రుతు పవనాల విస్తరణపై ఇన్వెస్టర్ల దృష్టి ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే చెప్పారు. ప్రస్తుతం వాణిజ్య యుద్ధాల కథ నడుస్తోందని, ఈ విషయమై తుది అంచనాలకు రావడానికి కొంత సమయం పడుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ వ్యూహకర్త వి.కె. శర్మ వివరించారు.
తీరు మారిన విదేశీ పెట్టుబడులు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో మన క్యాపిటల్ మార్కెట్లో రూ.3,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)లు మన ఈక్విటీ మార్కెట్లో రూ.2,235 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.892 కోట్లు చొప్పున నికరంగా పెట్టుబడులు పెట్టారు.
గత మూడు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిల్ మార్కెట్‌నుంచి రూ.61,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇటీవల పతనం కారణంగా పలు షేర్లు క్షీణించి ఆకర్షణీయంగా ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు జోరుగా సాగాయని రిలయన్స్ సెక్యూరిటీస్ రిటైల్ బ్రోకింగ్ హెడ్ రాజీవ్ శ్రీవాత్సవ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment