రేట్ల కోత అంచనాలతో సెన్సెక్స్ రయ్..
518 పాయింట్లు అప్;28,067వద్దముగింపు
163 పాయింట్ల లాభంతో 8,519కు నిఫ్టీ
బ్యాంక్ షేర్ల ర్యాలీ...
స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు స్టాక్ మార్కెట్లో ఒక రోజు ముందుగానే వచ్చాయి. జూలై నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం మైనస్ 4.05 శాతానికి పడిపోవడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 28 వేల పాయింట్లను, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,500 పాయింట్లను దాటేశాయి. టోకు ధరల ద్రవ్యోల్బణం వరుసగా తొమ్మిదో నెలలో కూడా క్షీణించించడంతో వడ్డీరేట్లు దిగొస్తాయనే అంచనాలతో సెన్సెక్స్ 518 పాయింట్లు (1.88 శాతం)లాభపడి 28,067 పాయింట్ల వద్ద, నిఫ్టీ 163 పాయింట్లు(1.95 శాతం) లాభపడి 8,519 పాయింట్ల వద్ద ముగిశాయి.
ఒక్క రోజులో ఈ స్థాయిలో సెన్సెక్స్ లాభపడడం ఏడు నెలల(ఈ ఏడాది జనవరి 20) తర్వాత ఇదే మొదటిసారి. నిఫ్టీ జనవరి 15 తర్వాత ఈ స్థాయిలో లాభపడడం(శాతంలో) కూడా ఇదే మొదటిసారి. రియల్టీ షేర్లు బాగా పెరిగాయి. రేట్ల కోత ఆశలతో బ్యాంక్, వాహన, ఐటీ, ఫార్మా, ఇన్‌ఫ్రా షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్ దూసుకుపోయింది. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేవరకూ కొనుగోళ్ల జాతర కొనసాగింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 562 పాయింట్లు లాభపడింది. రియల్టీ రంగ సూచీ ఎనిమిది నెలల గరిష్టానికి చేరింది. డీఎల్‌ఎఫ్ 18 శాతం దూసుకెళ్లింది. 30 సెన్సెక్స్ షేర్లలో రెండు(డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్) మాత్రమే నష్టపోయాయి.
ఇవీ పెరుగుదలకు కారణాలు...
► గత నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం, తాజాగా టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా మరింత పడిపోవడంతో సెప్టెంబర్ ద్రవ్య సమీక్షకు ముందే ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందని అంచనాలు పెరిగిపోయాయి. దీంతో వడ్డీరేట్ల ప్రభావిత రియల్టీ, బ్యాంక్, వాహన షేర్లు బాగా లాభపడ్డాయి.
► బ్యాంక్ మూలధన నిధులు, మొండి బకాయిల కట్టడి, కొత్త నియామకాలు.. తదితర అంశాలపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కీలకమైన ప్రకటన చేయనున్నారన్న వార్తలతో ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు ఎగబాకాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 9 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 8 శాతం, కెనరా బ్యాంక్ 6 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 4.5 శాతం చొప్పున పెరిగాయి. మార్కెట్ ముగిసిన తర్వాత దీనికి సంబంధించిన కీలకమైన అంశాలను ఆర్థిక మంత్రి వెల్లడించారు.
► గత 3 ట్రేడింగ్ సెషన్లలో క్షీణిస్తూ వచ్చిన రూపాయి శుక్రవారం బలపడింది.
► గత మూడు రోజులుగా జోరుగా విక్రయాలు(నికరంగా రూ.3,000 కోట్లు) జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు రూ.404 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
► {పతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చినా జీఎస్‌టీని వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచే అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం పట్టుదలగా ఉందని, జీఎస్‌టీ బిల్లు ఆమోదం కోసం రెండు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోందని వార్తలు వచ్చాయి.
► ముడి చమురు ధరలు 3 శాతం వరకూ తగ్గి... ఆరేళ్ల కనిష్టానికి దిగజారాయి.
► ఇటీవల స్టాక్ మార్కెట్ పతనం కారణంగా పలు బ్లూ చిప్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండడం కూడా కొనుగోళ్ల జోరుకు ఒక కారణమైంది.