ఇంటి పక్కనే ఆఫీసు! | Developers cashing-in on 'Walk to Work' trend in Hyderabad | Sakshi
Sakshi News home page

ఇంటి పక్కనే ఆఫీసు!

Published Sat, Jan 18 2014 2:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఇంటి పక్కనే ఆఫీసు! - Sakshi

ఇంటి పక్కనే ఆఫీసు!

  • ట్రాఫిక్ చిక్కులు, పెట్రోల్ చార్జీలుండవ్..
  •  నడిచి వెళ్లేలా ఉండాలనుకుంటున్న కొనుగోలుదారులు
  •  నగరంలో ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌లపై రియల్టర్ల దృష్టి
  •  
    ‘‘ఆఫీసుకు దగ్గరగా ఇల్లుండాలి. ప్రతి రోజూ ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్లాలి. ట్రాఫిక్ ఉండకూడదు. కాలుష్యం అసలే వద్దు. వీకెండ్స్‌లో కుటుంబంతో సహా ఆనందంగా గడిపేందుకు వాణిజ్యం, వినోదం అందుబాటులో ఉండాలి’’ ఇవన్నీ కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్‌లో సాధ్యమయ్యేవేనా? నగరంలోని రియల్టర్లు, బిల్డర్లు ఇది సాధ్యమేనంటున్నారు. ఇక్కడ ఉద్యోగి ఆఫీసుకు వెళ్లాలంటే గంటల తరబడి ప్రయాణం చేయాల్సివస్తోంది. కిక్కిరిసిన బస్సులు, కదలని ట్రాఫిక్ నగరవాసి సహనాన్ని పరీక్షిస్తున్నాయి. వీటన్నింటికి పరిష్కారం చూపిస్తున్నాయి ఈ ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌లు. గతంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితమైన ఈ తరహా నిర్మాణాలు ఇప్పుడు హైదరాబాద్‌లోనూ ఊపందుకుంటున్నాయి. ఈ ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌ల తీరుతెన్నులపై ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది..
     
    సాక్షి, హైదరాబాద్: పనిచేసే కార్యాలయానికి చేరుకోవడానికి అత్యధిక శాతం మంది తక్కువలో తక్కువ గంటసేపు బస్సుల్లోనో, లేదా ఇతరత్రా వ్యక్తిగత వాహనాల్లోనో వెళ్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రోజులో చాలా గంటలు ప్రయాణాలకే గడిచిపోతుంది. దీంతో విలువైన సమయం వృథా అవుతోంది. ఫలితం... కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అంతేకాకుండా ఏటేటా పెరుగుతున్న వాహనాల సంఖ్యతో నగరంలో కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరుల ధరలూ భారంగా మారుతున్నాయి. ఇక యాక్సిడెంట్ల ప్రమాదం ఉండనే ఉన్నాయి.
     
     ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తున్నాయి ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌లు. ‘‘నడిచి వెళ్లేందుకు అనువైన దూరంలో కార్యాలయం, షాపింగ్ మాళ్లు ఉండాలని కోరుకునే వారి సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో మా వద్దకు వచ్చే ఐటీ నిపుణులు చాలా వరకు ఇలాంటి ఫ్లాట్లు కావాలని అడుగుతున్నారు. అందుకే త్వరలోనే ఉప్పల్ ప్రాంతంలో ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్. రాంరెడ్డి చెప్పారు. అయితే ఇలాంటి ఇళ్లను కేవలం ఐటీ నిపుణులే ఎక్కువగా కోరుకుంటారని శాంతాశ్రీరామ్ కన్స్‌స్ట్రక్షన్స్ చైర్మన్ నర్సయ్య చెప్పారు. మిగతా వాటితో పోల్చుకుంటే వీటి గిరాకీ కాస్త తక్కువే అని అభిప్రాయపడ్డారు.
     
    దూరం తగ్గుతోంది..
    నగరంలోని మొత్తం రెండు లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగుల్లో అత్యధికులు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తుంటారు. ఇక్కడికి సిటీ నలువైపుల నుంచి వచ్చే వారు కొందరైతే, ఐదారు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిపోయేవారు మరికొందరు. వాక్ టు వర్క్ ప్రాజెక్ట్‌లతో ఇప్పుడు ఈ దూరం కూడా తగ్గిపోతుంది. ఇన్నాళ్లూ ఐటీ కార్యాలయాలకే పరిమితమైన సైబర్‌టవర్స్ వెనుక ప్రాంతంలో ఇప్పుడు కొత్త రెసిడెన్షియల్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఒకవైపు కార్యాలయాలు, మరోవైపు గృహ నిర్మాణాలు.. ఇంకేం ఎంచక్కా నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్లిపోవచ్చు. ఉదయం నడకకు బద్ధకించేవారికి ఇదొక వాకింగ్ గానూ ఉపయోగపడుతోంది. ఆరోగ్యం దృష్ట్యా సైకిల్‌పై కూడా ఆఫీసులకు వెళ్లొచ్చు.
     
    నగరం చుట్టూ..
    ఇదంతా బాగానే ఉంది కానీ కాంక్రీట్ జంగిల్‌గా మారిన ప్రధాన నగరంలో ఈ పోకడకు అవకాశాలు తక్కువే. అందుకే ఇప్పటివరకు గచ్చిబౌలి, మాదాపూర్ వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్టులు ఇప్పుడు నగరం నలుమూలలకూ విస్తరిస్తున్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌లకూ ఊపొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఐటీఐఆర్‌తో ఆదిభట్ల, ఉప్పల్, పోచారం, మహేశ్వరం వంటి శివారు ప్రాంతాల్లోనూ ఐటీ సంస్థలు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్టులు నిర్మించేందుకు బిల్డర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఘట్‌కేసర్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సింగపూర్ టౌన్‌షిప్ ఈ కాన్సెప్టుతో నిర్మించిందే. వీటికి ఆనుకొనే ఎన్నో వినోద కేంద్రాలు కూడా వెలిశాయి.
     
    నగరంలో ఉన్న వాక్ టు వర్క్ ప్రాజెక్టుల్లో కొన్ని..

    •  నార్సింగిలో ఎన్‌సీసీ అర్బన్  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ‘ఎన్‌సీసీ అర్బన్ వన్’ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్. 32 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 22 ఎకరాలు నివాస సముదాయానికి, 10 ఎకరాలు వాణిజ్య సముదాయాలకు కేటాయించారు. మొత్తం 1,400 ఫ్లాట్లుంటాయి. ప్రారంభ ధర: రూ. 65 లక్షలు.
    •  హైటెక్‌సిటీ వద్ద ఎన్‌సీసీ అర్బన్  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ‘నాగార్జున రెసిడెన్సీ’ ప్రాజెక్ట్. తొమ్మిదిన్నర ఎకరాల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో 460 ఫ్లాట్లు నిర్మించారు. ఇప్పటికే 270 కుటుంబాలు నివాసమంటున్నాయి కూడా. ధర రూ. 1.3 కోట్లు.  
    • ఎన్‌సీసీ అర్బన్ సంస్థ హైటెక్‌సిటీ దగ్గరే ‘ఎన్‌సీసీ అర్బన్ గార్డెనియా’ ప్రాజెక్ట్ కూడా చేపట్టింది. 4 ఎకరాల్లో 180 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ధర రూ. 2.3 కోట్లు.
    •  మూసాపేటలో సైబర్‌సిటీ డెవలపర్స్ ‘రెయిన్‌బో విస్టాస్-రాక్ గార్డెన్: ఫేజ్-3’ ప్రాజెక్ట్. మొత్తం 30 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో 5 ఎకరాలు కమర్షియల్, రిటైల్‌కు, 25 ఎకరాలు రెసిడెన్షియల్‌కు కేటాయించారు. ఇందులో మొత్తం 2 వేల ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. చ.అ. ధర రూ. 4,200.
    • తార్నాకలో శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ ‘అమిటివిల్లే’ ప్రాజెక్ట్. మొత్తం 3,500 గజాల్లో ఉన్న ప్రాజెక్టులో 40 లక్షల చ.అ. కమర్షియల్‌కు, మరో 40 లక్షల చ.అ. రెసిడెన్షియల్‌కు కేటాయించారు. కమర్షియల్ చ.అ. ధర రూ. 5,500, రెసిడెన్షియల్ అయితే చ.అ. ధర 4,500లుగా చెబుతున్నారు.

     
     ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్‌లకు మంచి గిరాకీ..
     ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ ప్రాజెక్టులు త్వరలోనే నగరం చుట్టూ విస్తరిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌లకు భవిష్యత్తులో మంచి గిరాకీ ఉంటుంది. ఎందుకంటే ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో నగరానికి బడా బడా ఐటీ కంపెనీలు రానున్నాయి. ఈ ఉద్యోగులకు ఆఫీసు దగ్గర్లోనే ఫ్లాట్లుంటే కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. అంతేకాకుండా ‘వాక్ టు వర్క్’ ప్రాజెక్ట్ లతో ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి
     చెందుతుంది.    - ఎన్.రవికుమార్, డీజీఎం- ఎన్‌సీసీ అర్బన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement