ఇదిలావుంటే.. తెలంగాణపై 2009 డిసెంబర్ 9వ తేదీ ప్రకటన తర్వాత లభించిన విరామాన్ని సీమాంధ్ర నేతలు సద్వినియోగం చేసుకోలే కపోయారని ఆంటోనీ కమిటీ సభ్యుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఆ ప్రాంత కేంద్రమంత్రులు, పార్టీ ఎంపీలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గురువారం సీమాంధ్ర నేతలతో భేటీ సందర్భంగా దిగ్విజయ్ మాట్లాడుతూ.. ప్రతి సందర్భంలోనూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అంగీకరించిన ‘మీ వల్లనే ఈ నిర్ణయం వెలువడిందనటంలో వాస్తవం లేకపోలేద’ని కూడా వ్యాఖ్యానించినట్లు చెప్తున్నారు.
ఎవరెన్ని చెప్పినా, ఏం చేసినా రాష్ట్ర విభజన అనివార్యమని దిగ్విజయ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని.. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకించే వాదనతో ముందుకొస్తే ఇకపై తనను కలవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారని.. ఈ విషయంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా కలిసే అవకాశం లేదని స్పష్టంచేశారని సమాచారం. కేంద్ర మంత్రి పదవులకు, పార్లమంటు సభ్యత్వాలకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసినా అధినేత్రి మనసు మారే అవకాశం లేద ని దిగ్విజయ్ పేర్కొన్నట్లు చెప్తున్నారు.
తెలంగాణ అంశంపై రాష్ట్ర శాసనసభ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామనే ప్రకటన అయినా చేయాలని సీమాంధ్ర నేతలు కోరారని, ఆ అవకాశం లేదని దిగ్విజయ్ నిరాకరించారని సమాచారం. శాసనసభలో తెలంగాణ తీర్మానం నెగ్గదని తమకు తెలుసు కాబట్టే దానితో నిమిత్తం లేకుండా విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయం జరిగిపోయిందని ఆయన స్పష్టంచేసినట్లు తెలిసింది. హైదరాబాద్ విషయంలో ప్రత్యామ్నాయ పరిష్కారాలను ప్రతిపాదించకపోతే కేంద్రం తాను మంచిదనుకొన్న నిర్ణయం తీసుకుని అమలు చేస్తుందని కూడా దిగ్విజయ్ చెప్పినట్లు సమావేశంలో పాల్గొన్న పలువురు నేతలు ఇష్టాగోష్టి సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.