అఖిలేశ్ తురుపుముక్క ఎవరో తెలుసా?
లక్నో: తండ్రి ములాయం సింగ్ యాదవ్‌తో విబేధించి సమాజ్ వాదీ పార్టీని హస్తగతం చేసుకున్న అఖిలేశ్ యాదవ్ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు. అయితే అంతర్గత పోరు ముగిసినట్లుగానీ, సైకిల్ గుర్తు ఎవరోఒకరికి సొంతమైనట్లుగానీ స్పష్టంగా తేలకపోవడంతో ఆయన పొత్తు ప్రయత్నాలు ముందుకు సాగటంలేదు.
‘సమాజ్‌వాదీ పార్టీ తండ్రిదా? కొడుకుదా?’ అనేదానిపై ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతే పొత్తు విషయాలు చర్చిద్దామని కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిర్ణయించుకుంది. మరోవైపు జనవరి17 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో పొత్తుపై పాజిటివ్ సంకేతాలు పంపాల్సిన బాధ్యత అఖిలేశ్‌పై ఒత్తిడిలా మారింది. సరిగ్గా ఇదే సమయంలో ఆయన తన తురుపుముక్కను బరిలోకి దించుతున్నారు.
అఖిలేశ్ సంధిస్తోన్న ఆ బాణం మరెవరోకాదు.. ఆయన భార్య డింపుల్ యాదవ్. కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తు, సీట్ల పంపకం, ఉమ్మడి ప్రచారం తదితర నిర్ణయాలన్ని ఇకపై డింపుల్ యాదవే తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. యూపీలో కాంగ్రెస్ కు సంబంధించిన అన్ని నిర్ణయాలను ప్రభావితం చేస్తోన్న ప్రియాంకా గాంధీతో ఎస్పీ తరఫున డింపుల్ యాదవే చర్చలు జరుపుతారని అఖిలేశ్ వర్గీయులు తెలిపారు. అంతేకాదు, డింపుల్, ప్రియాంకతో కలిసి ప్రచారంలోనూ పాల్గొంటారని సమాచారం.
వాస్తవానికి జనవరి 9 లేదా 10నే రాహుల్‌గాంధీ- అఖిలేశ్ యాదవ్‌ల ‘పొత్తు’భేటీ జరగాల్సిఉంది. ఎస్పీ అంతర్గత పోరు చల్లారకపోవడం, ఎన్నికల గుర్తుపై క్లారిటీ రాకపోవడం వల్ల రాహుల్- అఖిలేశ్ చర్చలు చేసినా ఫలితం ఉడదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ అభిప్రాయపడ్డారని, దీంతో ఇరువురి భేటీ వాయిదాపడినట్లు తెలిసింది. (ప్రియాంకా, డింపుల్ ఫొటో పక్కపక్కనే..)
అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు కోరుకుంటోన్న అఖిలేశ్.. ఆ జాతీయ పార్టీ ముఖ్య మహిళానేత అయిన ప్రియాంకతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ, వ్యవహారాలు ముందుకు నడిపించేలా డింపుల్‌ను రంగంలోకిదించారు. అఖిలేశ్ యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఖాళీ చేసిన కనౌజ్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన డింపుల్ యాదవ్.. ఇప్పటివరకు పార్లమెంట్‌లో అంతగా మాట్లాడిందికూడాలేదు. ‘నేను మీ కోడలిని, చెల్లిని, కూతుర్ని’ అంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే మాటలు తప్ప, నేటిదాకా గట్టివాయిస్ వినిపించని డింపుల్ ప్రియాంకతో పొత్తు చర్చల్లో సఫలమై, పార్టీతో తన స్థానాన్ని మరింత పదిలపర్చుకోవాలని భావిస్తున్నారు. ఆమె ఏ మేరకు సఫలమవుతారో వేచిచూడాలి..
(సింపుల్ యాదవ్)