స్వలింగ సంపర్కులకూ హక్కులుంటాయి.. వాటిని కాపాడాలి: సోనియా
స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. వారి హక్కులపై ఇచ్చిన తీర్పు బాధ కలిగించిందని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో ఎల్జీబీటీల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేయడం బాధాకరమని, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛకు, పౌరుల హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉందని సోనియా అన్నారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద పార్లమెంటు ఇప్పటికైనా స్పందించి, పౌరుల హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. అదే సమయంలో, గే హక్కుల మీద కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కూడా స్పందించారు. ఆయన కూడా దాదాపు సోనియాగాంధీ వెల్లడించిన అభిప్రాయాలనే తెలిపారు. స్వలింగ సంపర్కాన్ని నేరం కాదని నిర్ణయించేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ ప్రభుత్వం పరిశీలిస్తోందని సిబల్ అన్నారు. పరస్పర అంగీకారం ఉన్న అన్ని రకాల సంబంధాలనూ నేర రహితం చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.