Gay rights
-
ఆయుష్మాన్ ఖురానా మూవీపై ట్రంప్ ట్వీట్!
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజా చిత్రం ‘శుభ్‌మంగళ్ జ్యాదా సావధాన్’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. గే హక్కుల కార్యకర్త పీటర్ టాచెల్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ‘గ్రేట్’ అని పేర్కొన్నారు. విక్కీ డోనర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆయుష్మాన్.. అంధాదున్, బదాయి హో వంటి సినిమాలతో హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్న ఈ హీరో.. శుక్రవారం ‘శుభ్‌మంగళ్ జ్యాదా సావధాన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హితేశ్ కేవాల్యా దర్శకత్వంతో తెరకెక్కుతున్న సినిమాలో అతడు ‘గే’గా నటించాడు. ఇద్దరు అబ్బాయిలు కార్తీక్ సింగ్(ఆయుష్మాన్ ఖురానా), అమన్ త్రిపాఠి(జితేంద్ర కుమార్)ల ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో కామెడీతో పాటు సామాజిక సందేశాన్ని కూడా జోడించారు. ఇక ఈ మూవీపై స్పందించిన పీటర్ టాచెల్.. ‘‘ బాలీవుడ్ కొత్త సినిమా. పెద్దల మనసు గెలవడానికి ఓ జంట చేసే ప్రయత్నం. స్వలింగ సంపర్కం అనేది నేరం కాదని నిరూపించేందుకు చేసే ప్రయత్నం. హుర్రే’’ అని ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన ట్రంప్... గ్రేట్ అంటూ కామెంట్ చేశారు. కాగా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ట్రంప్‌తో పాటు ఫస్ట్‌లేడీ మెలానియా ట్రంప్, సలహాదారులు ఇవాంకా ట్రంప్, జారేద్ కుష్నర్ సహా ఇతర అధికారులు భారత పర్యటనకు రానున్నారు. Great! https://t.co/eDf8ltInmH — Donald J. Trump (@realDonaldTrump) February 21, 2020 -
శ్రీదేవి చిత్రం.. అరంగేట్రంలోనే ‘గే’ సబ్జెక్ట్‌తో
సినిమా చూసి, సినీ కలలు కని... అదే శ్వాసగా ధ్యాసగా మారిన, మారుతున్న వారెందరో సిటీ నుంచి సినిమాల్లో రాణిస్తూ ఉండవచ్చు. అయితే సినిమా రంగంతో వ్యక్తిగతంగా ఏ సంబంధం లేకుండా బిజినెస్ ఉమన్‌గా, సిటీ టాప్ సర్కిల్లో సోషలైట్‌గా ఉంటూ అకస్మాత్తుగా సినిమా నటి అయిపోయారు శ్రీదేవి చౌదరి. ఆరంభంలోనే స్వలింగ సంపర్కం అనే సబ్జెక్ట్‌ను ఎంచుకుని టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారారు. ఆమె నటించిన ఫ్రెండ్స్ ఇన్ లా సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రేపు విడుదల కానుంది. సాక్షి, సిటీబ్యూరో: ‘‘బాధ్యతలన్నీ పూర్తయ్యాయి. మహిళలకు తనకంటూ నిజమైన జీవితం ఆశించే ఆస్వాదించే వయసు, ఆసక్తులు అభిరుచులు, ఆలోచనలకు పదును పెట్టుకునే సమయమిదే నని భావించా’’ అంటున్నారు శ్రీదేవి చౌదరి. జూబ్లీహిల్స్‌లో నివసించే శ్రీదేవి సిటీలోని ప్రముఖ సంపన్నకుటుంబ మహిళగా, పేజ్‌త్రీ సోషలైట్‌గా చాలా మందికి సుపరిచితం. అయితే ఇప్పుడామె సినిమా తారగానూ పరిచయమవుతున్నారు. ఈ నేపధ్యంలోసాక్షితో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... ఆఫర్లు వచ్చినాఅందుకోలేదు... నాకు గతంలో కూడా సినిమా ఆఫర్లు వచ్చాయి. అందులో చాలా పెద్ద సంస్థలవి కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడూ చేయాలని అనిపించలేదు. కుటుంబ బాధ్యతల నుంచి రిలాక్స్ అయిన సందర్భంలో మన జీవితంలో సాధించడానికి వీలైనవి సాధించడానికి ఇదే సరైన సమయం అనిపించింది. యుక్తవయసులోనే ప్రముఖ ఫొటో గ్రాఫర్ అమిత్‌ఖన్నా నన్ను సంప్రదించారు. ఆయన చెప్పిన సబ్జెక్ట్ మొదట విని షాక్ తిన్నాను. ఆ తర్వాత ఆలోచించాను. చివరకు ఓకే అన్నాను. బాలీవుడ్ నుంచిపిలుపొచ్చింది... ఈ సినిమా టీజర్ చూసినవాళ్లు అభినందిస్తున్నారు. నటి జీవిత కూడా ఫోన్ చేసి అనుభవం ఉన్న నటిలా చేశానంటూ మెచ్చుకున్నారు. ఈ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లాలనుకుంటున్న సమయంలో కాన్స్ ఫెస్టివల్లో చూసిన అమెజాన్ వాళ్లు సంప్రదించారు. తాము విడుదల చేస్తామన్నారు. ఇప్పుడంతా డిజిటల్ మీడియానే కదా. పైగా అమెజాన్ ద్వారా అయితే ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయవచ్చు. అందుకని అంగీకరించాం. భవిష్యత్తులో కూడా సినిమాల్లో నటిస్తాను. అయితే మంచి ఆఫర్లు వస్తేనే.. క్వీన్ ఆఫ్ ద సౌత్ అని నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్ వస్తోంది. అందులో ఓ నెగిటివ్ కేరెక్టర్ నాకు బాగా నచ్చింది అలాంటివి చేయాలని ఉంది. ప్రస్తుతానికి ఒక బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. నటుడు సంజయ్‌దత్ భార్య కేరెక్టర్. చర్చలు నడుస్తున్నాయి. ‘గే’లిపిద్దాం... ఈ సినిమా గురించి ఇంట్లో చెప్పినప్పుడు... నగరంలోపేరున్న కుటుంబం మాది. ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్‌తో సినిమా చేయడం ఇబ్బంది కదా అని సందేహించారు. ఇందులో వాళ్లని తప్పు పట్టడానికి ఏమీ లేదు. మన చుట్టూ ఎందరో ‘గే’లు ఉన్నారు. నిత్యం చూస్తున్నాం. అయినా స్వలింగ సంపర్కం ఇప్పటికీ ఇండియాలో చాలా పెద్ద ఇష్యూ. ఆ అంశం గురించి చర్చించడానికే ఇష్టపడరు చాలా మంది. నిజమే అయినప్పటికీ తమ బిడ్డలు గే అని బయటకు చెప్పుకోవడానికి ఏ తల్లీ తండ్రీ ఇష్టపడరు. బహుశా ఆ పరిస్థితుల్లో ఉంటే నేనూ చెప్పలేనేమో...కాని ఇలా ఎంతకాలం? గే మనస్తత్వాన్ని మన సమాజం ఎప్పటికైనా అంగీకరించక తప్పదు. అలా గే గా మారిన వారిని తప్పుపట్టడం, గేలి చేయడం ఇంటినుంచే మొదలవుతుంది. అయితే అది సరికాదని ఇంటినుంచే వారిని యధాతధంగా అంగీకరించడం అనేది ప్రారంభం కావాలని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశ్యం. మంచి సోషల్ మెసేజ్ ఉన్న ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ కావడంతో మేం అనుకున్నట్టే ఈ సినిమా అంతర్జాతీయంగా పేరొందిన అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి వెళ్లి మూడు అవార్డులు గెలుచుకుంది. ఫార్టీప్లస్..లేడీస్‌కి ప్లస్... పెళ్లి, పిల్లలు, బాధ్యతలు తీరిపోవడం అయిపోయింది ఇక కృష్ణారామా అనుకోవద్దు నేనూ నా జీవితం అనుకోండి అంటాన్నేను. నలభై ఏళ్లు దాటాక మనం జీవితంలో చేయాలనుకుని బాధ్యతల కారణంగానో మరో కారణంతోనో చేయలేనివి చేసేయాలి. దీనికి డిసిప్లిన్ లైఫ్ కూడా అవసరం. నేను ఇప్పటికీ వారంలో నాలుగు రోజులు తప్పనిసరిగా 2గంటలపైనే జిమ్‌లో వర్కవుట్ చేస్తుంటాను. ఏ పని చేసినా అందులో ఆనందం రావాలి. అది మరో మంచి పనికి మనకి ప్రేరకం అవుతుంది. అదే నేను తోటి మహిళలకి చెప్పే మాట. -
ఓ స్వలింగ సంపర్కుడి ఆత్మనివేదన!
భారతీయ స్వలింగ సంపర్కుడిగా నన్ను నేను తొలుచుకుని ప్రపంచం ముందుకొస్తున్నాను! నా యవ్వనమంతా అనుమానం, అనిశ్చితితో కూడుకున్న సందేహాలతో నిండిఉంది. అందరిలా కాకుండా నేను ‘వేరే’ అని నాకు తెలుసు కానీ తెలియందల్లా ఎందుకిలా? అన్నదే. నా చుట్టూ ఉన్న వాళ్ళు ‘ఒరేయ్ హిజ్రా’ అంటూ గేలిచేసినప్పుడు నా సందేహం బద్దలైంది. నా సహ విద్యార్థుల నుంచి, నా ఆటల నుంచి, పాటల నుంచి మొత్తంగా నన్నది వేరు చేసింది. క్రమంగా నాకిష్టమైన అన్నింటినుంచీ నన్ను దూరం చేసి, నన్నొంటరిని మిగిల్చింది. నేనెందుకిలా ఒంటరినయ్యాను. నేనందరిలా ఎందుకు లేను? నాకెందుకీ శిక్ష? ఆ మానసిక స్థితిలోంచి బయటపడేందుకు కఠోరతపస్సు చేయాలి. నాలాంటి వారే నా చుట్టూ ఉన్నవారు నాలాగే వేరుగా ఉన్నవారు వారెందుకిలా ఉన్నారో అర్థం కాక, చెప్పేవారు లేక కనీస లైంగికపరిజ్ఞానం కరువై తమలో తామే నలిగిపోయి మృత్యువును కోరితెచ్చుకుంటుంటే నిశ్చేష్టుడిలా మిగిలిపోయాను. నా సందేహాలకు ఇంటర్నెట్‌ని శరణుకోరాను. అప్పుడర్థం అయ్యింది వేనవేల గేల బేల చూపులతో ఈ ప్రపంచం నిశ్శబ్దంగా నిండిఉన్నదని. అలాంటి విశాల ప్రపంచంలో మన దేశం ఆచూకీ నాకేదీ దొరకలేదు. బహుశా అది ‘మన’ సంస్కృతి కాదేమోనని నాకు నేను చెప్పుకున్నాను. ఆ రోజు నుంచి నేనుగా ఉండడం మానేసాను. సహజంగా నాకిష్టమైనవన్నీ చేయడం ఆపేసాను. గత చాలా కాలంగా నా పని ఒక్కటే. అదే అవమానాలనుంచి, అసహ్యపు చూపులనుంచి, వెలివేతల నుంచి నన్ను నేను కాపాడుకుంటూ ఉండడం. మేమంతా ఓ ఆత్మన్యూనతా భావంలో, అభద్రతా భావంలో కూరుకుపోయాం. ఆత్మగౌరవం కోసం స్వలింగ సంపర్కుల పోరాటం మాకు కొత్తసవాళ్ళను ఎదుర్కొనే శక్తినిచ్చిందే తప్ప పరిస్థితుల్లో పెద్దగా మార్పుతీసుకురాలేదు. తీర్పులూ మమ్మల్ని సేదతీర్చలేదు. అదే వేధింపులు, అవే భయాలూ మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజు మాకెంతో ప్రత్యేకం. స్వలింగ సంపర్కం నేరంకాదని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టిన రోజు. మా దేహాల గాయాల నుంచి తొలుచుకుని మేం మేముగా నిలిచిన రోజు. సుప్రీంకోర్టు తీర్పుతో గొంగళిపురుగు దశనుంచి రెక్కలువిప్పుకున్న సీతాకోక చిలుకల్లా మేం మా రంగుల ప్రపంచంలోకి సగర్వంగా రెక్కలల్లార్చుకుని ఎగిరిపోయే రోజు. అయినా మాముందు ఇంకా అవమానాల మూకలు నిలిచే ఉన్నాయి. ఎన్నెన్నో సవాళ్ళు మిగిలేవున్నాయి. రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్పినట్టు ‘‘నేను ప్రశాంతంగా నిద్రపోయే ముందు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’’. ‘‘నన్ను నమ్మండి. మీరిక ఒంటరి కాదు’’. దేశంలోని స్వలింగ సంపర్కులందరికీ ఈ సందేశం అందాలి. ఇంకా మమ్మల్ని అంగీకరించలేని వారికి ఓ చిన్న మాట.... ‘‘అవును మేం స్వలింగ సంపర్కులం. మేమిక్కడే ఉన్నాం. మేం అదృశ్యం కాము.’’ ఇట్లు సంజయ్ దేశ్‌పాండే, వయస్సు 26 న్యూఢిల్లీ వాస్తవ్యుడు -
ఆ ఆరుగురు..
పరస్పర అంగీకారంతో వయోజనుల మధ్య స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్మ్రక తీర్పు వెనుక ఆరుగురి కృషి ఉంది. సెక్షన్ 377ని నాజ్ ఫౌండేషన్ ప్రధానంగా సవాల్ చేసినప్పటికీ ఒక డ్యాన్సర్, ఒక జర్నలిస్టు, ఒక చెఫ్, ఒక హోటల్ యజమాని, ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ చేసిన పోరాటంతో దేశంలో గే చట్టాల్లో సమూల మార్పులు వచ్చాయి. గే హక్కుల కోసం పోరాడుతూ ఎల్జీబీటీక్యూఐ కమ్యూనిటీకి చెందిన ఆ ఆరుగురు ఎవరంటే... నవతేజ్ సింగ్ జౌహర్ నవతేజ్ జౌహర్ భరతనాట్యం డ్యాన్సర్. కొరియోగ్రాఫర్ కూడా. ఢిల్లీ, చెన్నైలలో ఆయన నృత్యపాఠశాలల్ని నడుపుతున్నారు. నాటక అకాడమీ అవార్డు కూడా గెలుచుకున్నారు. చాలా ఏళ్లుగా ఆయన స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. తన సహచరుడు, జర్నలిస్టు సునీల్ మెహ్రా ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సునీల్ మెహ్రా ప్రముఖ జర్నలిస్టు, మాగ్జిమ్ మ్యాగజైన్ మాజీ సంపాదకులు. టెలివిజన్ ప్రొడక్షన్స్లలో కూడా పని చేశారు. 20 ఏళ్లకు పైగా నవతేజ్ జౌహర్తో ఆయనకు అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి స్టూడియో అభ్యాస్‌ని నడిపారు. మొదట్లో న్యాయపోరాటం చేయాలని సునీల్ గట్టిగా అనుకోలేదు. కానీ ఆయన స్నేహితురాలు, లాయర్ అయిన మేనక గురుస్వామి గే హక్కుల కోసం న్యాయస్థానంలోనే పోరాటం చేయాలని చెప్పడంతో పిటిషన్ దాఖలు చేయడానికి ముందుకొచ్చారు. రీతూ దాల్మాయి ప్రముఖ చెఫ్. ఢిల్లీలో ఒక ఇటలియన్ రెస్టారెంట్ దివాని ఆమె నడుపుతున్నారు. ఇండియన్ టీవీలో కుకరీ షోని హోస్ట్ చేస్తున్నారు. కోల్‌కతాలో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన రీతూ పదహారేళ్ల వయసులోనే మార్బుల్ బిజినెస్ చేశారు. ఆతర్వాత ఒక చెఫ్‌గా పేరు తెచ్చుకున్నారు. అమన్ నాథ్ 67 ఏళ్ల వయసున్న అమన్ నాథ్ ప్రముఖ రచయిత, ఆర్కిటెక్టర్. హెరిటేజ్ హోటల్స్ నీమ్రానా గ్రూపు వ్యవస్థాపకుడు తన భాగస్వామి ఫ్రాన్సిస్‌తో కలిసి అత్యంత పురాతనమైన భవనాలను హోటల్స్‌గా మార్చారు. వారసత్వ కట్టడాలను పరిరక్షించడమే ఆయన ఆశయంగా ఉండేది. ఆ తర్వాత గే హక్కుల కోసం పోరాటం చేశారు. కేశవ్ సూరి 33 ఏళ్ల వయసున్న కేశవ్సూరి లలిత్ సూరి హాస్పటాలిటీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ . భరత్ హోటల్స్ వ్యవస్థాపకుడు లలిత్ సూరి కుమారుడు. కేశవ్సూరి బహిరంగంగానే తాను గే అని చెప్పుకున్నారు. ఇటీవల తన జీవిత భాగస్వామి అయిన మరో పురుషుడిని పెళ్లి కూడా చేసుకున్నారు. అయేషా కపూర్ అయేషా ఇప్పడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న వ్యాపారవేత్త. ఇకామర్స్ మార్కెట్లో తన సత్తా చాటుతున్నారు. -
అప్పుడు తప్పన్న సుప్రీం కోర్టే..
పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 2013లో స్వలింగ సంపర్కం నేరమని ఉద్ఘాటించిన సుప్రీం కోర్టు ఇప్పుడది నేరం కాదని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో సుదీర్ఘ కాలం పాటు ప్రపంచ దేశాల్లో ఉద్యమాలు, చర్చోపచర్చలు సాగడం, అంతర్జాతీయ సమాజం సానుకూలత వ్యక్తం చేస్తుండటం, మన ప్రభుత్వాల వైఖరిలో కూడా మార్పు రావడం వంటివి సుప్రీంపై ప్రభావం చూపి ఉండవచ్చని భావిస్తున్నారు. చట్టంలో ఏముంది? భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని 377వ సెక్షన్ అసహజ నేరాలను నిర్వచించింది.1862 నుంచి అమల్లో ఉన్న ఈ సెక్షన్ ప్రకారం ప్రకృతికి విరుద్ధంగా స్త్రీ, పురుషులు లేదా జంతువులతో లైంగిక చర్య జరపడం శిక్షార్హమైన నేరం. అలాంటి వారికి జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష తో పాటు జరిమానా కూడా విధింవచ్చని సెక్షన్ 377 స్పష్టం చేస్తోంది. చట్టబద్ధం చేసిన ఢిల్లీ హైకోర్టు పరస్పర సమ్మతితో కూడిన స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు 2009 జులైలో తీర్పు ఇచ్చింది. సెక్షన్ 377 స్వలింగ సంపర్కుల ‘పరిపూర్ణ వ్యక్తిత్వ హక్కు’ను నిరారిస్తోందని,అందువల్ల ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని ఆ సందర్భంగా హైకోర్టు వెల్లడించింది. హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును 2013, డిసెంబర్లో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.సెక్షన్ 377 రాజ్యాంగబద్ధమేనని జస్టిస్ జీఎస్ సంఘ్వి నాయకత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.వివాదాస్పదమైన ఈ అంశంపై చర్చించాల్సింది పార్లమెంటేనని పేర్కొంది. భారతీయ సమాజంలో స్వలింగ సంపర్కం నిషేధమన్న భావన చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని ఎల్జీబీటీ లే కాకుండా పలువురు స్వేచ్ఛాకాముకులు కూడా వాదిస్తున్నారు.అయితే, దీనిని ‘విపరీత ప్రవర్తన’గా చాలా మంది ఇప్పటికీ భావిస్తున్నారు. రాజకీయ ఏకాభిప్రాయం మొదట్లో ప్రభుత్వాలు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ, 377 వ సెక్షన్‌ను సమర్థిస్తూ వచ్చాయి.అయితే ఈ అంశంపై సీరియస్‌గా జరిగిన చర్చలు, మీడియా కథనాల ఫలితంగా రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవలసి వచ్చింది.గతంలో సెక్షన్ 377ను సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతునిచ్చిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్టు కనిపిస్తోంది.గత నవంబర్‌లో బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈ అంశంపై మాట్లాడుతూ‘ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది స్వలింగ సంపర్కాన్ని ప్రత్యామ్నాయ లైంగిక ప్రాధాన్యంగా పరిగణిస్తోంటే మనం ఇప్పటికీ వారిని జైల్లో పెట్టాలన్న అభిప్రాయంతో ఉండటం సరికాదు.ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఆమోదయోగ్యమనిపిస్తోంది’అన్నారు.కాంగ్రెస్,ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎంలు కూడా సెక్షన్ 377 రాజ్యాంగవిరుద్ధమన్న భావననే వ్యక్తం చేశాయి. ట్రాన్స్‌జండర్లపై తీర్పు ట్రాన్స్ జండర్లను(లింగ మార్పిడి చేసుకున్న వారు) థర్డ్ జండర్‌గా ప్రకటించాలని, ఓబీసీ కోటాలో వారిని కూడా చేర్చాలని సుప్రీం కోర్టు 2014 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.వారికి కూడా ఇతరులలాగే వివాహం, దత్తత, విడాకులు, వారసత్వం తదితర హక్కుల్ని కల్పించాల్సి ఉందని స్పష్టం చేసింది. భారతీయ సమాజంలో ట్రాన్స్జండర్ల పరిస్థితి దయనీయంగా ఉందంటూ ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. వారి విషయంలో ప్రభుత్వాల ధృక్కోణం మారాల్సి ఉందని 2015, నవంబర్‌లో జాతీయ న్యాయ సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవ సభలో ఆయన ఉద్ఘాటించారు.ట్రాన్స్ జండర్ల కోసం చట్టాలను సవరించాలని, కొత్త చట్టాలు తేవాలని ఆయన అన్నారు.ట్రాన్స్ జండర్ల హక్కులను గుర్తిస్తూ ఎన్డీఏ సర్కారు ముసాయిదా చట్టాన్ని కూడా తయారు చేసింది. ఈ పరిణామాలన్నీ సెక్షన్377 విషయంలో సుప్రీం కోర్టు అభిప్రాయం మారడానికి దారి తీశాయి. నైతికత సమస్య స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును బాలల హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు తప్పుపట్టాయి. బాలలపై అకృత్యాల నివారణకు ఈ సెక్షను అవసరం ఎంతైనా ఉందని వాదిస్తున్నాయి. అంతే కాకుండా స్వలింగ సంపర్కమన్నది సమాజపు నైతిక విలువలకు విరుద్ధమని పలువురు వాదిస్తున్నారు.అయితే,2012లో తెచ్చిన ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్(పోస్కో) చట్టం సెక్షన్ 377 కంటే సమర్థంగా, పటిష్టంగా ఉందని ఈ చట్టంతో బాలల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని మరో వర్గం వాదిస్తోంది. నైతికత పేరుతో ప్రాథమిక హక్కుల్ని హరించడం సరికాదని అంటోంది. చట్టపరంగా తప్పయినది నైతికంగానూ తప్పే అవుతుందని,అయితే నైతికంగా తప్పయినదంతా చట్టపరంగానూ తప్పేననడం సరికాదని వారంటున్నారు. ఏ నైతిక నేరమైనా సమాజంపై దుష్ప్రభావం చూపినప్పుడే అది చట్టపరంగా నేరమవుతుందేకాని వ్యక్తిగతంగా నష్టం జరిగితే చట్టపరంగా తప్పు కాదని తాజా తీర్పును సమర్థించేవారు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయంగా సానుకూలత స్వలింగ సంపర్కం నేరం కాదన్న అభిప్రాయం అంతర్జాతీయంగా బలపడుతోంది. వివిధ దేశాలు స్వలింగసంపర్కాన్ని ఆమోదిస్తూ చట్టాలు కూడా చేశాయి.ప్రస్తుతం 120 దేశాలు హోమోసెక్సువాలిటీని చట్టబద్ధంగా పరిగణిస్తున్నాయి. 2000లో నెదర్లాండ్స్ హోమో సెక్సువాలిటీని చట్టబద్ధం చేసింది. ఈ పరంపరను బెల్జియం, కెనడా,స్పెయిన్, దక్షిణాఫ్రికా, నార్వే, స్వీడెన్, ఐస్లాండ్, పోర్చుగల్, అర్జెంటీనా, డెన్మార్క్, ఉరుగ్వే. న్యూజిలాండ్, ఫ్రాన్స్, బ్రెజిల్,ఇంగ్లండ్ అండ్ వేల్స్, ఫిన్లాండ్, మాల్టా కొనసాగించాయి. అమెరికా వ్యాప్తంగా గే వివాహాలు చట్టబద్ధమంటూ 2015 జూన్ 27న యూఎస్ సుప్రీంకోర్టు ప్రకటించింది. 25 దేశాల్లో వీరి మధ్య పెళ్లిళ్లకు కూడా అనుమతి ఉంది. 2003లో తొలిసారిగా నెథర్లాండ్స్ ఈ వివాహాలకు ఆమోదం తెలపగా, జర్మనీ, తాజాగా ఆస్ట్రేలియా ఆ జాబితాలో చేరాయి. ఈ దంపతులు పిల్లలను దత్తత తీసుకునే అవకాశాన్ని 26 దేశాలు కల్పించాయి. 72 దేశాల్లో నేరమే..! భారత్ సహా 72 దేశాలు ఇప్పటికీ స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. షరియా చట్టంలో భాగంగా ఇరాన్, సుడాన్, సౌదీ అరేబియా, యెమన్, సోమాలియా, ఉత్తర నైజీరియా స్వలింగ సంబంధాలను తీవ్రమైన నేరాలుగా శిక్షిస్తున్నాయి. ఖతర్‌లో ముస్లింలను మాత్రమే శిక్షిస్తుండగా, సౌదీ అరేబియాలో ముస్లింతో ఇలాంటి సంబంధం కలిగిన ముస్లిమేతరుడికి కూడా మరణశిక్ష విధించవచ్చు. ఇస్లామిక్‌స్టేట్ (ఐఎస్) అయితే ఏకంగా బహిరంగ హత్యలకు పాల్పడుతోంది.పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యూఏఈ. ఖతర్, మౌరిటానియా చట్టాల ప్రకారం మరణశిక్షను విధించవచ్చు. -
377 సెక్షన్ ఉంటుందా, ఊడుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కులతోపాటు, స్త్రీ, పురుషుల మధ్య అసహజ సెక్స్‌ను నిషేధిస్తున్న భారతీయ శిక్షా స్మతిలోని 377వ సెక్షన్‌ను పునర్ పరిశీలించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించడం, దాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించడం తమ హక్కుల కోసం పోరాడుతున్న ఎల్జీబీటీ కమ్యూనిటీ ప్రాథమిక విజయం. భారతీయ రాజ్యాంగంలోని పౌరుల ప్రాథమిక హక్కులను సుప్రీం కోర్టు ఎలాంటి భాష్యం చెబుతుందో చూడాలనే ఆతతతో ప్రజలు ఉన్నారు. (సాక్షి ప్రత్యేకం) దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు అమలుచేసే చట్టాలకు భారతీయ శిక్షా స్మతి అని పేరు పెట్టుకున్నప్పటికీ భారత్ ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి చట్టాలను ఉపయోగిస్తోంది. కాకపోతే అప్పుడప్పుడు అవసరానికి తగ్గట్లు చట్టాల్లో సవరణలు చేస్తూ వస్తోంది. 1950 నుంచి ఇప్పటి వరకు ఇండియన్ పీనల్ కోడ్‌లో 30 సార్లు సవరణలు తీసుచ్చొనప్పటికీ ఇందులోని 377 జోలికి పోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేయకపోయినప్పటికీ అది మాత్రం అలా ఉంటూ వచ్చింది. ఈ చట్టాన్ని ఎవరు పట్టించుకోకపోవడం అందుకు కారణం కాదు.(సాక్షి ప్రత్యేకం) ఈ సెక్షన్ ఎత్తివేయాల్సిందిగా 2000 సంవత్సరంలోనే లా కమిషన్ సిఫార్సు చేసింది. అయినా వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు. ఎక్కడ సనాతన ధర్మాలు కలిగిన ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోందన్న భయం. ఎల్జీబీటీ హక్కుల కార్యకర్తలు ఈ అంశంపై కోర్టుకు వెళ్లగా సెక్షన్‌లోని కొన్ని అంశాలను రాజ్యాంగ విరుద్ధమని 2009లో ఢిల్లీ హైకోర్టు తేల్చింది. ఈ తీర్పును 2013లో సుప్రీం కోర్టు కొట్టి వేసింది.(సాక్షి ప్రత్యేకం) ఈ సెక్షన్ కింద శిక్ష పడేది అతి కొద్ది మందికే కనుక పౌరల ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలిగినట్లు కాదంటూ సుప్రీం కోర్టు భాష్యం చెప్పింది. ప్రైవసీ కలిగి ఉండే హక్కు గురించి చర్చ వచ్చినప్పుడు గతేడాది వివాదాస్పదమైన ఈ అంశాన్ని పునర్ పరిశీలించేందుకు అంగీకరించింది. ఇప్పుడు ఈ అంశం రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనలో ఉంది.(సాక్షి ప్రత్యేకం) ప్రాథమిక, ప్రైవసి హక్కుల ప్రకారం అసహజ సెక్స్‌కు శిక్షించే అధికారం చట్టానికి ఉండకూడదు. చట్టాన్ని ఎత్తివేస్తే అసహజ శృంగారాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందేమోనని ఇటు సుప్రీం కోర్టు, అటు కేంద్రం భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీబీటీ హక్కులను అనేక దేశాలు గుర్తిస్తూ వస్తున్నప్పుడు పౌరుల హక్కులను దెబ్బతీసే ఇలాంటి చట్టాలను ఎత్తివేయడమే మంచిది. అసహజ సెక్స్‌ను సమాజం అంగీకరించలేకపోతే సాంఘిక ఉద్యమాల ద్వారానే ప్రజల్లో మార్పు తీసుకరావాలీగానీ, చట్టాల ద్వారా ఆపాలనుకోవడం అర్థరహితమే అవుతుంది.(సాక్షి ప్రత్యేకం) -
మరోసారి తెరపైకి ఎల్జీబీటీ
న్యూఢిల్లీ: మరోసారి ఎల్జీబీటీ (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్స్) వివాదం తెరపైకి వచ్చింది. భారత పీనల్ కోడ్ చట్టం 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరంకిందికి వస్తుందని పేర్కొంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ ఓ ఎన్జీవో వేసిన పిటిషన్‌ను మంగళవారం అత్యున్నత న్యాయస్థానం పరిశీలించింది. స్వలింగ సంపర్కం అంశంపై నిషేధం విధించాలా లేక కొనసాగించాలా అనే విషయాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పరిశీలిస్తుందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ పిటిషన్ దారుకు తెలియజేశారు. దీంతో అసలు విచారణకే రాదనకున్న తమ పిటిషన్‌పై చాలాకాలం తర్వాత కదలిక రావడంతో స్వలింగ సంపర్కుల్లో ఆనందం వెల్లివిరిసి సంబరాలకు సిద్ధమయ్యారు. -
గేల విషయంలో హైకోర్టు తీర్పునే సమర్థిస్తా: రాహుల్
స్వలింగ సంపర్కుల హక్కుల పరిరక్షణ విషయంలో సోనియా గాంధీ, కపిల్ సిబల్ తర్వాత ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత కూడా ముందుకొచ్చాడు. ఇలాంటి విషయాలను వ్యక్తుల ఇష్టాయిష్టాలకే వదిలేయాలని కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ చెప్పాడు. 2009 నాటి హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేయడంపై విలేకరులు ఆయన అభిప్రాయం కోరినప్పుడు ఇలా స్పందించారు. తాను హైకోర్టు ఉత్తర్వులనే సమర్థిస్తానని, మన దేశంలో అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛ కావల్సినంత ఉందని రాహుల్ అన్నారు. అందువల్ల ఇలాంటి విషయాలను వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినవిగా భావించి వారికే వదిలేయాలన్నారు. ఎప్పుడో బ్రిటిష్ కాలంనాటి సెక్షన్ 377ను రద్దు చేయాలని గే హక్కుల కార్యకర్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
మేమూ మనుషులమే.. తేడాగా చూడకండి
-
మేమూ మనుషులమే.. తేడాగా చూడకండి: స్వలింగ సంపర్కులు
'మేమూ మనుషులమే. మాకూ మనోభావాలుంటాయి. మమ్మల్ని తేడాగా ఎందుకు చూస్తారు' అంటూ స్వలింగ సంపర్కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. 2009 జూలై నెలలో ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ అప్పటి వరకు ఉన్న ఐపీసీ సెక్షన్ 377 చెల్లుబాటు కాదని తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) కమ్యూనిటీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అశోక్ రావు కవి, విక్రమ్ సేఠ్ లాంటి వాళ్లు తాము 'గే' అనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకున్నారు. 2006లో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కూడా ఈ విషయాన్ని బయటకు ప్రకటించారు. ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్లు ఇష్టపూర్వకంగా శృంగార సంబంధంలో ఉంటే దాన్ని నేరం అనకూడదని 2008లో నాటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ వాదించారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద ప్రభుత్వ వర్గాలతో పాటు అనేక వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర మంత్రి కపిల్ సిబల్ సహా అనేక మంది సుప్రీం తీర్పు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంలో శాసన వ్యవస్థ, అందునా పార్లమెంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి, పరస్పర అంగీకారంతో సాగే స్వలింగ సంపర్కం సహా అన్ని రకాల సంబంధాలను చట్టబద్ధం చేయాలని, వాటికి రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. చట్టంలో ఎప్పుడూ మార్పులు ఉండాలని, తొలిసారి చట్టం చేసినప్పుడు అప్పటి ఆలోచనా విధానంతో చేస్తారని, ఇప్పుడు దాని ప్రభావం చాలామంది మీద పడుతుందని సిబల్ అన్నారు. సెక్షన్ 377 అనేది 21వ శతాబ్దానికి సరిపోయేది కాదన్నారు. సుప్రీంతీర్పు విషయంలో వెంటనే సరిగా స్పందించాలన్నారు. అటార్నీ జనరల్ కూడా హైకోర్టు తీర్పునే సమర్థించారని తెలిపారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఎల్జీబీటీ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు, నిరాశా నిస్పృహలు వెల్లడయ్యాయి. అనేక మంది కోర్టు వద్దే నిరసన వ్యక్తం చేయగా, మరి కొంతమంది దీన్ని మరోసారి కోర్టులో సవాలు చేస్తామన్నారు. ఇంకొందరు ఆ సమాచారాన్ని మిత్రులకు చేరవేసేటప్పుడు కళ్లనీళ్లు కక్కుకున్నారు. వాస్తవానికి స్వలింగ సంపర్కం అనేది మానసిక పరమైన వైరుధ్యమే తప్ప అదో వ్యాధి గానీ, నేరం గానీ కాదని మానసిక వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినా పలు ప్రాంతాల్లో వీరికి పోలీసుల నుంచి వేధింపులు తప్పడం లేదు. తెలుగు సినిమాల్లో కూడా స్వలింగ సంపర్కాన్ని ఎప్పుడూ తేడాగా చూపించారే గానీ దాన్ని సహజ లక్షణంగా చెప్పలేదు. బాలీవుడ్లో మాత్రం దీన్ని కాస్త విభిన్నంగానే ట్రీట్ చేశారు. ఇప్పుడు సుప్రీం తీర్పు విషయంలో ఎటూ ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ అధినేత్రి కూడా స్పందించారు కాబట్టి మళ్లీ సెక్షన్ 377ను రద్దు చేయడమో, స్వలింగ సంపర్కులకు హక్కులు కల్పించడమో చేస్తుందని ఆ వర్గం ఆశిస్తోంది!! -
స్వలింగ సంపర్కులకూ హక్కులుంటాయి.. వాటిని కాపాడాలి: సోనియా
స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. వారి హక్కులపై ఇచ్చిన తీర్పు బాధ కలిగించిందని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో ఎల్జీబీటీల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేయడం బాధాకరమని, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛకు, పౌరుల హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉందని సోనియా అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద పార్లమెంటు ఇప్పటికైనా స్పందించి, పౌరుల హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. అదే సమయంలో, గే హక్కుల మీద కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కూడా స్పందించారు. ఆయన కూడా దాదాపు సోనియాగాంధీ వెల్లడించిన అభిప్రాయాలనే తెలిపారు. స్వలింగ సంపర్కాన్ని నేరం కాదని నిర్ణయించేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ ప్రభుత్వం పరిశీలిస్తోందని సిబల్ అన్నారు. పరస్పర అంగీకారం ఉన్న అన్ని రకాల సంబంధాలనూ నేర రహితం చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.