పరస్పర అంగీకారంతో వయోజనుల మధ్య స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్మ్రక తీర్పు వెనుక ఆరుగురి కృషి ఉంది. సెక్షన్ 377ని నాజ్ ఫౌండేషన్ ప్రధానంగా సవాల్ చేసినప్పటికీ ఒక డ్యాన్సర్, ఒక జర్నలిస్టు, ఒక చెఫ్, ఒక హోటల్ యజమాని, ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ చేసిన పోరాటంతో దేశంలో గే చట్టాల్లో సమూల మార్పులు వచ్చాయి. గే హక్కుల కోసం పోరాడుతూ ఎల్‌జీబీటీక్యూఐ కమ్యూనిటీకి చెందిన ఆ ఆరుగురు ఎవరంటే...
నవతేజ్ సింగ్ జౌహర్
నవతేజ్ జౌహర్ భరతనాట్యం డ్యాన్సర్. కొరియోగ్రాఫర్ కూడా. ఢిల్లీ, చెన్నైలలో ఆయన నృత్యపాఠశాలల్ని నడుపుతున్నారు. నాటక అకాడమీ అవార్డు కూడా గెలుచుకున్నారు. చాలా ఏళ్లుగా ఆయన స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. తన సహచరుడు, జర్నలిస్టు సునీల్ మెహ్రా ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
సునీల్ మెహ్రా
ప్రముఖ జర్నలిస్టు, మాగ్జిమ్ మ్యాగజైన్ మాజీ సంపాదకులు. టెలివిజన్ ప్రొడక్షన్స్‌లలో కూడా పని చేశారు. 20 ఏళ్లకు పైగా నవతేజ్ జౌహర్‌తో ఆయనకు అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి స్టూడియో అభ్యాస్‌ని నడిపారు. మొదట్లో న్యాయపోరాటం చేయాలని సునీల్ గట్టిగా అనుకోలేదు. కానీ ఆయన స్నేహితురాలు, లాయర్ అయిన మేనక గురుస్వామి గే హక్కుల కోసం న్యాయస్థానంలోనే పోరాటం చేయాలని చెప్పడంతో పిటిషన్ దాఖలు చేయడానికి ముందుకొచ్చారు.
రీతూ దాల్మాయి
ప్రముఖ చెఫ్. ఢిల్లీలో ఒక ఇటలియన్ రెస్టారెంట్ దివాని ఆమె నడుపుతున్నారు. ఇండియన్ టీవీలో కుకరీ షోని హోస్ట్ చేస్తున్నారు. కోల్‌కతాలో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన రీతూ పదహారేళ్ల వయసులోనే మార్బుల్ బిజినెస్ చేశారు. ఆతర్వాత ఒక చెఫ్‌గా పేరు తెచ్చుకున్నారు.
అమన్ నాథ్
67 ఏళ్ల వయసున్న అమన్ నాథ్ ప్రముఖ రచయిత, ఆర్కిటెక్టర్. హెరిటేజ్ హోటల్స్ నీమ్రానా గ్రూపు వ్యవస్థాపకుడు తన భాగస్వామి ఫ్రాన్సిస్‌తో కలిసి అత్యంత పురాతనమైన భవనాలను హోటల్స్‌గా మార్చారు. వారసత్వ కట్టడాలను పరిరక్షించడమే ఆయన ఆశయంగా ఉండేది. ఆ తర్వాత గే హక్కుల కోసం పోరాటం చేశారు.
కేశవ్ సూరి
33 ఏళ్ల వయసున్న కేశవ్‌సూరి లలిత్ సూరి హాస్పటాలిటీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ . భరత్ హోటల్స్ వ్యవస్థాపకుడు లలిత్ సూరి కుమారుడు. కేశవ్‌సూరి బహిరంగంగానే తాను గే అని చెప్పుకున్నారు. ఇటీవల తన జీవిత భాగస్వామి అయిన మరో పురుషుడిని పెళ్లి కూడా చేసుకున్నారు.
అయేషా కపూర్
అయేషా ఇప్పడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న వ్యాపారవేత్త. ఇకామర్స్ మార్కెట్‌లో తన సత్తా చాటుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment