మేమూ మనుషులమే.. తేడాగా చూడకండి: స్వలింగ సంపర్కులు
'మేమూ మనుషులమే. మాకూ మనోభావాలుంటాయి. మమ్మల్ని తేడాగా ఎందుకు చూస్తారు' అంటూ స్వలింగ సంపర్కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. 2009 జూలై నెలలో ఢిల్లీ హైకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదంటూ అప్పటి వరకు ఉన్న ఐపీసీ సెక్షన్ 377 చెల్లుబాటు కాదని తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా ఎల్జీబీటీ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్) కమ్యూనిటీలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
అశోక్ రావు కవి, విక్రమ్ సేఠ్ లాంటి వాళ్లు తాము 'గే' అనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకున్నారు. 2006లో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కూడా ఈ విషయాన్ని బయటకు ప్రకటించారు. ఇద్దరు మగవాళ్లు లేదా ఇద్దరు ఆడవాళ్లు ఇష్టపూర్వకంగా శృంగార సంబంధంలో ఉంటే దాన్ని నేరం అనకూడదని 2008లో నాటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ వాదించారు.
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద ప్రభుత్వ వర్గాలతో పాటు అనేక వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, కేంద్ర మంత్రి కపిల్ సిబల్ సహా అనేక మంది సుప్రీం తీర్పు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంలో శాసన వ్యవస్థ, అందునా పార్లమెంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి, పరస్పర అంగీకారంతో సాగే స్వలింగ సంపర్కం సహా అన్ని రకాల సంబంధాలను చట్టబద్ధం చేయాలని, వాటికి రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. చట్టంలో ఎప్పుడూ మార్పులు ఉండాలని, తొలిసారి చట్టం చేసినప్పుడు అప్పటి ఆలోచనా విధానంతో చేస్తారని, ఇప్పుడు దాని ప్రభావం చాలామంది మీద పడుతుందని సిబల్ అన్నారు. సెక్షన్ 377 అనేది 21వ శతాబ్దానికి సరిపోయేది కాదన్నారు. సుప్రీంతీర్పు విషయంలో వెంటనే సరిగా స్పందించాలన్నారు. అటార్నీ జనరల్ కూడా హైకోర్టు తీర్పునే సమర్థించారని తెలిపారు.
కాగా, సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఎల్జీబీటీ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు, నిరాశా నిస్పృహలు వెల్లడయ్యాయి. అనేక మంది కోర్టు వద్దే నిరసన వ్యక్తం చేయగా, మరి కొంతమంది దీన్ని మరోసారి కోర్టులో సవాలు చేస్తామన్నారు. ఇంకొందరు ఆ సమాచారాన్ని మిత్రులకు చేరవేసేటప్పుడు కళ్లనీళ్లు కక్కుకున్నారు. వాస్తవానికి స్వలింగ సంపర్కం అనేది మానసిక పరమైన వైరుధ్యమే తప్ప అదో వ్యాధి గానీ, నేరం గానీ కాదని మానసిక వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయినా పలు ప్రాంతాల్లో వీరికి పోలీసుల నుంచి వేధింపులు తప్పడం లేదు. తెలుగు సినిమాల్లో కూడా స్వలింగ సంపర్కాన్ని ఎప్పుడూ తేడాగా చూపించారే గానీ దాన్ని సహజ లక్షణంగా చెప్పలేదు. బాలీవుడ్లో మాత్రం దీన్ని కాస్త విభిన్నంగానే ట్రీట్ చేశారు. ఇప్పుడు సుప్రీం తీర్పు విషయంలో ఎటూ ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ అధినేత్రి కూడా స్పందించారు కాబట్టి మళ్లీ సెక్షన్ 377ను రద్దు చేయడమో, స్వలింగ సంపర్కులకు హక్కులు కల్పించడమో చేస్తుందని ఆ వర్గం ఆశిస్తోంది!!