పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 2013లో స్వలింగ సంపర్కం నేరమని ఉద్ఘాటించిన సుప్రీం కోర్టు ఇప్పుడది నేరం కాదని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో సుదీర్ఘ కాలం పాటు ప్రపంచ దేశాల్లో ఉద్యమాలు, చర్చోపచర్చలు సాగడం, అంతర్జాతీయ సమాజం సానుకూలత వ్యక్తం చేస్తుండటం, మన ప్రభుత్వాల వైఖరిలో కూడా మార్పు రావడం వంటివి సుప్రీంపై ప్రభావం చూపి ఉండవచ్చని భావిస్తున్నారు.
చట్టంలో ఏముంది?
భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని 377వ సెక్షన్ అసహజ నేరాలను నిర్వచించింది.1862 నుంచి అమల్లో ఉన్న ఈ సెక్షన్ ప్రకారం ప్రకృతికి విరుద్ధంగా స్త్రీ, పురుషులు లేదా జంతువులతో లైంగిక చర్య జరపడం శిక్షార్హమైన నేరం. అలాంటి వారికి జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష తో పాటు జరిమానా కూడా విధింవచ్చని సెక్షన్ 377 స్పష్టం చేస్తోంది.
చట్టబద్ధం చేసిన ఢిల్లీ హైకోర్టు
పరస్పర సమ్మతితో కూడిన స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు 2009 జులైలో తీర్పు ఇచ్చింది. సెక్షన్ 377 స్వలింగ సంపర్కుల ‘పరిపూర్ణ వ్యక్తిత్వ హక్కు’ను నిరారిస్తోందని,అందువల్ల ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని ఆ సందర్భంగా హైకోర్టు వెల్లడించింది.
హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును 2013, డిసెంబర్‌లో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.సెక్షన్ 377 రాజ్యాంగబద్ధమేనని జస్టిస్ జీఎస్ సంఘ్వి నాయకత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.వివాదాస్పదమైన ఈ అంశంపై చర్చించాల్సింది పార్లమెంటేనని పేర్కొంది.
భారతీయ సమాజంలో స్వలింగ సంపర్కం నిషేధమన్న భావన చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని ఎల్‌జీబీటీ లే కాకుండా పలువురు స్వేచ్ఛాకాముకులు కూడా వాదిస్తున్నారు.అయితే, దీనిని ‘విపరీత ప్రవర్తన’గా చాలా మంది ఇప్పటికీ భావిస్తున్నారు.
రాజకీయ ఏకాభిప్రాయం
మొదట్లో ప్రభుత్వాలు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ, 377 వ సెక్షన్‌ను సమర్థిస్తూ వచ్చాయి.అయితే ఈ అంశంపై సీరియస్‌గా జరిగిన చర్చలు, మీడియా కథనాల ఫలితంగా రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవలసి వచ్చింది.గతంలో సెక్షన్ 377ను సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతునిచ్చిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్టు కనిపిస్తోంది.గత నవంబర్‌లో బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఈ అంశంపై మాట్లాడుతూ‘ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది స్వలింగ సంపర్కాన్ని ప్రత్యామ్నాయ లైంగిక ప్రాధాన్యంగా పరిగణిస్తోంటే మనం ఇప్పటికీ వారిని జైల్లో పెట్టాలన్న అభిప్రాయంతో ఉండటం సరికాదు.ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఆమోదయోగ్యమనిపిస్తోంది’అన్నారు.కాంగ్రెస్,ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎంలు కూడా సెక్షన్ 377 రాజ్యాంగవిరుద్ధమన్న భావననే వ్యక్తం చేశాయి.
ట్రాన్స్‌జండర్లపై తీర్పు
ట్రాన్స్ జండర్లను(లింగ మార్పిడి చేసుకున్న వారు) థర్డ్ జండర్‌గా ప్రకటించాలని, ఓబీసీ కోటాలో వారిని కూడా చేర్చాలని సుప్రీం కోర్టు 2014 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.వారికి కూడా ఇతరులలాగే వివాహం, దత్తత, విడాకులు, వారసత్వం తదితర హక్కుల్ని కల్పించాల్సి ఉందని స్పష్టం చేసింది.
భారతీయ సమాజంలో ట్రాన్స్‌జండర్ల పరిస్థితి దయనీయంగా ఉందంటూ ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. వారి విషయంలో ప్రభుత్వాల ధృక్కోణం మారాల్సి ఉందని 2015, నవంబర్‌లో జాతీయ న్యాయ సేవా సంస్థ వ్యవస్థాపక దినోత్సవ సభలో ఆయన ఉద్ఘాటించారు.ట్రాన్స్ జండర్ల కోసం చట్టాలను సవరించాలని, కొత్త చట్టాలు తేవాలని ఆయన అన్నారు.ట్రాన్స్ జండర్ల హక్కులను గుర్తిస్తూ ఎన్‌డీఏ సర్కారు ముసాయిదా చట్టాన్ని కూడా తయారు చేసింది. ఈ పరిణామాలన్నీ సెక్షన్377 విషయంలో సుప్రీం కోర్టు అభిప్రాయం మారడానికి దారి తీశాయి.
నైతికత సమస్య
స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును బాలల హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు తప్పుపట్టాయి. బాలలపై అకృత్యాల నివారణకు ఈ సెక్షను అవసరం ఎంతైనా ఉందని వాదిస్తున్నాయి. అంతే కాకుండా స్వలింగ సంపర్కమన్నది సమాజపు నైతిక విలువలకు విరుద్ధమని పలువురు వాదిస్తున్నారు.అయితే,2012లో తెచ్చిన ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్(పోస్కో) చట్టం సెక్షన్ 377 కంటే సమర్థంగా, పటిష్టంగా ఉందని ఈ చట్టంతో బాలల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని మరో వర్గం వాదిస్తోంది. నైతికత పేరుతో ప్రాథమిక హక్కుల్ని హరించడం సరికాదని అంటోంది. చట్టపరంగా తప్పయినది నైతికంగానూ తప్పే అవుతుందని,అయితే నైతికంగా తప్పయినదంతా చట్టపరంగానూ తప్పేననడం సరికాదని వారంటున్నారు. ఏ నైతిక నేరమైనా సమాజంపై దుష్ప్రభావం చూపినప్పుడే అది చట్టపరంగా నేరమవుతుందేకాని వ్యక్తిగతంగా నష్టం జరిగితే చట్టపరంగా తప్పు కాదని తాజా తీర్పును సమర్థించేవారు స్పష్టం చేస్తున్నారు.
అంతర్జాతీయంగా సానుకూలత
స్వలింగ సంపర్కం నేరం కాదన్న అభిప్రాయం అంతర్జాతీయంగా బలపడుతోంది. వివిధ దేశాలు స్వలింగసంపర్కాన్ని ఆమోదిస్తూ చట్టాలు కూడా చేశాయి.ప్రస్తుతం 120 దేశాలు హోమోసెక్సువాలిటీని చట్టబద్ధంగా పరిగణిస్తున్నాయి. 2000లో నెదర్‌లాండ్స్ హోమో సెక్సువాలిటీని చట్టబద్ధం చేసింది. ఈ పరంపరను బెల్జియం, కెనడా,స్పెయిన్, దక్షిణాఫ్రికా, నార్వే, స్వీడెన్, ఐస్‌లాండ్, పోర్చుగల్, అర్జెంటీనా, డెన్మార్క్, ఉరుగ్వే. న్యూజిలాండ్, ఫ్రాన్స్, బ్రెజిల్,ఇంగ్లండ్ అండ్ వేల్స్, ఫిన్‌లాండ్, మాల్టా కొనసాగించాయి. అమెరికా వ్యాప్తంగా గే వివాహాలు చట్టబద్ధమంటూ 2015 జూన్ 27న యూఎస్ సుప్రీంకోర్టు ప్రకటించింది. 25 దేశాల్లో వీరి మధ్య పెళ్లిళ్లకు కూడా అనుమతి ఉంది. 2003లో తొలిసారిగా నెథర్‌లాండ్స్ ఈ వివాహాలకు ఆమోదం తెలపగా, జర్మనీ, తాజాగా ఆస్ట్రేలియా ఆ జాబితాలో చేరాయి. ఈ దంపతులు పిల్లలను దత్తత తీసుకునే అవకాశాన్ని 26 దేశాలు కల్పించాయి.
72 దేశాల్లో నేరమే..!
భారత్ సహా 72 దేశాలు ఇప్పటికీ స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. షరియా చట్టంలో భాగంగా ఇరాన్, సుడాన్, సౌదీ అరేబియా, యెమన్, సోమాలియా, ఉత్తర నైజీరియా స్వలింగ సంబంధాలను తీవ్రమైన నేరాలుగా శిక్షిస్తున్నాయి. ఖతర్‌లో ముస్లింలను మాత్రమే శిక్షిస్తుండగా, సౌదీ అరేబియాలో ముస్లింతో ఇలాంటి సంబంధం కలిగిన ముస్లిమేతరుడికి కూడా మరణశిక్ష విధించవచ్చు. ఇస్లామిక్‌స్టేట్ (ఐఎస్) అయితే ఏకంగా బహిరంగ హత్యలకు పాల్పడుతోంది.పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, యూఏఈ. ఖతర్, మౌరిటానియా చట్టాల ప్రకారం మరణశిక్షను విధించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment