
పొత్తు కోసం పుత్రుడిపై వేటు
డీఎంకే నుంచి అళగిరిని సస్పెండ్ చేసిన కరుణానిధి
ప్రాథమిక సభ్యత్వం నుంచీ ఉద్వాసన
డీఎండీకేతో పొత్తును వ్యతిరేకించినందుకే
సాక్షి, చెన్నై: సినీ నటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో పొత్తు ప్రతిపాదనకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలకు దిగిన అళగిరిపై ఆయన తండ్రి, డీఎంకే అధినేత కరుణానిధి సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుంచి ఆయనను తప్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అయితే, సస్పెన్షన్ తాత్కాలికమేనని డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ చెప్పారు. అళగిరి హద్దులు మీరారని, అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని ఆయన అన్నారు.
కరుణానిధి నిర్ణయాన్ని డీఎంకేలోని మెజారిటీ నాయకులు స్వాగతించారు. ఆయన రెండో కుమారుడు స్టాలిన్ మద్దతుదారులు ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. తన సస్పెన్షన్‌పై అళగిరి మాట్లాడుతూ, మద్దతుదారుల ప్రయోజనాల కోసం పాటుపడినందుకు తనకు దక్కిన బహుమతి అని వ్యాఖ్యానించారు. అళగిరి సస్పెన్షన్‌కు దారితీసిన పరిణామాలు...
* తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను వ్యతిరేకించే విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలని ఒకవైపు డీఎంకే, మరోవైపు బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి.
* డీఎండీకేతో పొత్తు తమకు కలిసొస్తుందని భావించిన డీఎంకే అధినేత కరుణానిధి, ఇప్పటికే ఆ పార్టీతో మంతనాలు పూర్తి చేశారు.
* కరుణ వ్యూహం అమలు కానున్న తరుణంలో ఆయన పెద్ద కుమారుడు, మదురై ఎంపీ అళగిరి ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌కాంత్‌పై విమర్శలకు దిగారు. విజయకాంత్‌ను రాజకీయ నేతగా పరిగణించబోనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
* విజయ్‌కాంత్‌పై ఈ వ్యాఖ్యలు చేసినందుకు అళగిరిని కరుణ ఈనెల 7న తీవ్రంగా మందలించారు. పొత్తులపై పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
* తన నివాసంలో కలుసుకున్న అళగిరితో కరుణానిధి ఇదే అంశంపై చర్చించారు. చర్చలు ముగిసిన కొద్ది గంటలకే ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు కరుణానిధి ఒక ప్రకటన విడుదల చేశారు.
* ఒకవైపు, స్టాలిన్ మద్దతుదారులు, కె.వీరమణి వంటి డీఎంకే నేతలు కరుణానిధి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేయగా, ఈ నిర్ణయం పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని అళగిరి మద్దతుదారులన్నారు.
* కరుణానిధి మాత్రం అళగిరి మద్దతుదారుల వ్యాఖ్యలను తోసిపుచ్చారు. అళగిరి సస్పెన్షన్ నిర్ణయం పార్టీపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆయన అన్నారు.
* డీఎంకేతో పొత్తుపై డీఎండీకే చీఫ్ విజయకాంత్ ఫిబ్రవరి 2న ప్రకటన చేసే అవకాశం ఉంది.