అక్కడ అప్రమత్తంగా ఉండండి: భారత్
దుబాయ్: ఖతర్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని దోహాలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో సూచించింది. టెర్రరిజానికి ఖతర్ మద్దతు పలుకుతోందని ఆరోపిస్తూ పలు గల్ఫ్ దేశాలు ఆ దేశంతో తమ సంబంధాలను తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఖతర్‌తో రవాణా సంబంధాలను కూడా తాము తెగదెంపులు చేసుకుంటున్నట్లు సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రేయిన్, ఈజిప్టు దేశాలు ప్రకటించాయి. దీంతో ఆయా దేశాల్లో పర్యటించాలనుకునే ఖతర్‌లోని భారతీయులు తమ ప్రయాణప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలని పేర్కొంది. ఖతర్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, భారతీయుల రక్షణ, భద్రత వంటి అంశాలపై ఆ దేశ అధికారిక వర్గాలతో సంప్రదింపులు చేస్తున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.