ఈ 'స్మార్ట్' ఫీచర్లు తెలుసా..?
నేటి తరంలో స్మార్ట్‌ఫోన్ వాడని వారు చాలా తక్కువ. స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువ మంది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఫోన్లనే వాడుతున్నారు. వీటిలో చాలా ఫోన్లు చవకగా లభిస్తుండడమే ఇందుకు కారణం. అందుబాటు ధరల్లోనే ఫోన్లు దొరుకుతుండడంతో ఫీచర్ ఫోన్లకు బదులుగా స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలా ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. కానీ వాటిలో కొన్ని ఫీచర్లను మాత్రమే ఎక్కువగా వాడతారు. మిగతా ఫీచర్లపై అవగాహన లేకపోవడం వల్ల వాటి గురించి ఆలోచించరు. వాటి గురించి కూడా తెలుసుకుంటే వినియోగదారులు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఎంతగానో ఉపయోగపడే కొన్ని ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
టెక్ట్స్ టు స్పీచ్..
మొబైల్‌కు మెసేజ్ రాగానే ఓపెన్ చేసి చదివేస్తాం. ఏ పనిలో ఉన్నా, మెసేజ్ ఏంటో పూర్తిగా తెలుసుకోవాలంటే దాన్ని చదవాల్సిందే. అయితే ఈ అవసరం లేకుండానే, మీ మెసేజ్‌లు, నోటిఫికేషన్లు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకోవాల్సిందే. మీ మొబైల్‌లోని టెక్ట్స్ ఏదైనా, చదివి వినిపించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీన్ని యాక్టివేట్ చేసుకునేందుకు సెట్టింగ్‌లోకి వెళ్లి, ఆక్సెసెబిలిటీని క్లిక్ చేయాలి. దీని లోపల ఉన్న టెక్ట్స్ టు స్పీచ్ ఔట్‌పుట్ ఆప్షన్‌ను టర్న్ ఆన్ చేసుకోవాలి. అంతే టెక్ట్స్ రూపంలో ఉన్న వాటిని వాయిస్ రూపంలో వినిపిస్తుంది. దీని వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. ఏదైనా పని చేసుకుంటూనే వినొచ్చు.
బ్యాటరీ సేవ్..
ఎంత ఖరీదైన ఫోన్ కొన్నా ఎక్కువ మందిని వేధించే సమస్య లో బ్యాటరీ. డిస్ప్లే బ్రైట్‌నెస్ ఎక్కువ ఉంచుకోవడం, ఆటో మోడ్‌లో ఉంచడం, నెట్ వాడకం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు చాలా విధానాలున్నాయి. బ్రైట్‌నెస్‌ను తక్కువగా ఉంచుకోవాలి. అలాగే ఆటో మోడ్ తీసేయాలి. వాల్‌పేపర్, స్క్రీన్‌సేవర్లు బ్రైట్ కలర్లో ఉండేవి ఎంచుకోకూడదు. వీటి కోసం ఎక్కువ బ్యాటరీ చార్జింగ్ అవసరం. దీనికి బదులుగా డార్క్ కలర్ స్క్రీన్ సేవర్, వాల్ పేపర్లని ఎంచుకోవాలి. ఫలితంగా పిక్సెల్ హైలైట్ అవ్వడం తగ్గుతుంది. దీంతో బ్యాటరీ ఎక్కువ సేపు వస్తుంది. యానిమేటెడ్ వాల్ పేపర్లని కూడా వాడకపోవడం ఉత్తమం. స్క్రీన్‌కి సింపుల్‌గా ఉండే డార్క్ బ్యాక్‌గ్రౌండ్‌ను ఎంచుకుంటే మంచిది. అయితే ఇది ఇంకా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులోకి రాలేదు. కొన్ని ఫోన్లలోనే ఈ సదుపాయం ఉంది.
స్మార్ట్‌ఫోన్ రిమోట్ కంట్రోల్..
ఇంట్లోని టీవీ, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని మీ మొబైల్ ఫోన్‌తోనే ఆపరేట్ చేయవచ్చు. మీ ఫోన్‌నే రిమోట్‌గా మార్చుకుంటే ప్రత్యేకంగా రిమోట్ అవసరం లేదు. ఆపిల్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త వెర్షన్లలోనే ఈ ఫీచర్ ఉంది. హై ఎండ్ ఫోన్లలోనే ప్రస్తుతం ఈ సదుపాయాన్ని పొందుపరిచారు. ఈ ఫీచర్‌ను పొందేందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ఈ ఫీచర్‌ని యాక్టివేట్ చేసుకోవాలి.
గెస్ట్‌మోడ్..
స్మార్ట్‌ఫోన్లలో సైలెంట్ మోడ్, ఏరోప్లేన్ మోడ్, బైక్ మోడ్‌ల గురించి తెలిసిందే. వీటినే ఎక్కువ మంది వినియోగిస్తారు. అయితే వీటితో పాటు మరో ముఖ్యమైన ఫీచర్ గెస్ట్‌మోడ్. ఇది ఫోన్‌లోని సమాచార భద్రతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఎవరికైనా ఫోన్ ఇచ్చారే అనుకోండి.. వారు మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోకుండా ఉండాలంటే గెస్ట్‌మోడ్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. ఇందుకోసం స్క్రీన్ పై భాగంలో కనిపించే బార్‌ను కిందికి స్వైప్ డౌన్ చేయాలి. యూజర్ ఐకాన్ పై భాగంలో కింది వైపు టచ్ చేయాలి. అప్పుడు గెస్ట్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని మీకు కావాల్సినట్లుగా ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల మీరు కోరుకున్న సమాచారాన్ని ఇతరులు చూసే అవకాశం లేదు.
స్క్రీన్ మ్యాగ్నిఫయర్..
కంటి చూపులో లోపాలు ఉన్న వారికి ఉపయోగపడే ఫీచర్ ఇది. కొంత మంది స్క్రీన్‌పైన ఉన్న దాన్ని సరిగ్గా చూడలేరు. అది మరింత జూమ్ అయితే వారికి ఉపయోగం. ఇలాంటి వారు సెట్టింగ్స్‌లోకి వెళ్లి, యాక్సెస్సిబిలిటిని ఓకే చేయాలి. అనంతరం మాగ్నిఫికేషన్ గెస్చర్స్ అని కనిపిస్తుంది. దీన్ని యాక్టివేట్ చేసుకుంటే సరి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్క్రీన్‌పై కనిపించే ప్రతి దాన్ని జూమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం డిస్ప్లేను టాప్ చేస్తే చాలు.
సీక్రెట్ గేమ్..
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అనేక గేమ్‌లు ఆడుకునేందుకు వీలుంది. ఫోన్లలో కొన్ని గేమ్స్ ఇన్‌బిల్ట్‌గా వస్తే, మరి కొన్నింటిని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అయితే ఈ అవసరం లేకుండానే మీరు గేమ్ ఆడుకోవచ్చు. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్లన్నింటిలో ఓ సీక్రెట్ గేమ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బర్డ్ వెర్షన్ నుంచి ఈ గేమ్ అందుబాటులో ఉంది. అయితే దీని గురించి తెలిసింది చాలా తక్కువ మందికి. మరి ఈ గేమ్ ఆడుకోవాలంటే ఏం చేయాలనుకుంటున్నారా? సెట్టింగ్స్‌లోకి వెళ్లి, కింది భాగంలో కనిపనించే అబౌట్ ఫోన్ లేదా అబౌట్ టాబ్లెట్‌ను క్లిక్ చేయాలి. అందులో కనిపించే ఆండ్రాయిడ్ వెర్షన్‌ని అనేక సార్లు వెంటవెంటనే క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే లెటర్‌ని కూడా వెంటవెంటనే క్లిక్ చేస్తూ ఉండాలి. అంతే.. మీ స్క్రీన్‌పై ఒక గేమ్ ప్రత్యక్షం. ఎక్కువ మందికి తెలియని ఈ సీక్రెట్ గేమ్‌ని కూడా ఓ సారి ఆడి చూడండి.
– సాక్షి, స్కూల్ ఎడిషన్