
వలసదారులకు ట్రంప్ షాక్!
ఐదేళ్ల వరకు సంక్షేమ పథకాలు ఆశించొద్దంటూ మెలిక
వాషింగ్టన్: ప్రతిభ ఆధారిత వలస (ఇమ్మిగ్రేషన్) విధానానికి మద్దతు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా విదేశీ వలసదారులకు షాక్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి వచ్చే వలసదారులు ఐదేళ్ల వరకు ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందబోరని ఆయన చెప్పారు. 'మా దేశానికి వచ్చినప్పుడు ఐదేళ్లపాటు మీరు సంక్షేమ పథకాలను పొందలేరు. గతంలోగా ఇప్పుడు అమెరికాలోకి రాగానే సంక్షేమ పథకాలను పొందలేరు' అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రతివారం నిర్వహించే వెబ్, రేడియో కార్యక్రమంలో భాగంగా ఆయన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
'ఐదేళ్లపాటు మా సంక్షేమ పథకాలను అడగటం కానీ, వినియోగించుకోవడం కానీ చేయబోనని మీరు చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌లో చేసిన నా ప్రసంగంలో చెప్పినట్టు.. అమెరికా ఉన్నతంగా కలలు కంటోంది. సాహసోపేతంగా ముందుకు వెళుతోంది' అని ట్రంప్ అన్నారు. ప్రతిభ ప్రాతిపదికన గ్రీన్‌కార్డులు జారీ చేయాలంటూ రూపొందించిన ‘రైజ్’(రిఫార్మింగ్ అమెరికన్ ఇమిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయ్‌మెంట్) బిల్లుకు ట్రంప్ ఇటీవల మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ గ్రీన్‌కార్డుల జారీకి అనుసరించిన లాటరీ విధానానికి స్వస్తి పలికి.. ఇక నుంచి ఆంగ్ల భాషా నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతనం, వయసు ప్రాతిపదికగా కార్డులు జారీ చేయనుంది. ఇందుకోసం ఉద్దేశించిన 'రైజ్' బిల్లు ఆమోదాన్ని ప్రస్తావిస్తూ అమెరికా సరైన దిశలో సాగుతున్నదని ట్రంప్ అన్నారు. ఈ నూతన విధానం భారతీయులకు వరమేనని భావిస్తున్నా.. ట్రంప్ మాత్రం వలసదారులపై మరిన్ని ఆంక్షలు తప్పవంటూ సంకేతాలు ఇస్తున్నారు.