రీకౌంటింగ్‌పై ట్రంప్ సీరియస్..!
- మళ్లీ లెక్కింపునకు సై అంటున్న హిల్లరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రీకౌంటింగ్ దుమారం కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్వల్ప తేడాతో గట్టెక్కిన విస్కాన్సిన్ రాష్ట్రంలో రీకౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అంగీకరించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు రీకౌంటింగ్‌కు అంగీకరించడాన్ని ట్రంప్ తీవ్రస్థాయిలో తప్పుబడుతుండగా.. మరోవైపు ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ వర్గం దీనిపై ఆశల్లో తేలియాడుతోంది. విస్కాన్సిన్ రాష్ట్రంలో చేపట్టే రీకౌంటింగ్ ప్రక్రియలో తాము కూడా పాల్గొంటామని హిల్లరీ ప్రచార అధికారి ఒకరు శనివారం స్పష్టం చేశారు.
రీకౌంటింగ్ ఒక స్కాం అని, గ్రీన్ పార్టీ తమ ఖజానాను నింపుకోవడానికే రీకౌంటింగ్‌ను తెరపైకి తెచ్చిందని డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌లో మండిపడ్డారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి.. నైతికంగా దివాళా తీసిన డెమొక్రాట్లు దీనికి మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. రీకౌంటింగ్ వల్ల గెలుపు వరిస్తుందేమోనన్న తప్పుడు ఆలోచనతో డెమొక్రాట్లు ఉన్నారని సీరియస్ అయ్యారు. అమెరికాలో ఇలా ఎప్పుడు జరగలేదని పేర్కొన్నారు.
డొనాల్డ్ ట్రంప్ స్వల్పతేడాతో గట్టెక్కిన మూడు రాష్ట్రాలైన విస్కాన్సిన్, మిచిగన్, పెన్సిల్వేనియాలలో రీకౌంటింగ్ జరుపాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్ చేసిన ఈ డిమాండ్ మేరకు విస్కాన్సిన్‌లో నమోదైన ఓట్లను మళ్లీ లెక్కించడానికి ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. దీనిని హిల్లరీ వర్గం పరోక్షంగా స్వాగతిస్తుండగా.. రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఓటింగ్‌లో పెద్ద ఎత్తున హ్యాకింగ్ జరిగిందని ఆరోపిస్తూ గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్ రీకౌంటింగ్ ప్రక్రియను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆమె రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసిన పెన్సిల్వేనియాలో 70,010 ఓట్ల తేడాతో, మిచిగన్‌లో 10,704 ఓట్లతో, విస్కాన్సిన్‌లో 27,257 ఓట్లతో ట్రంప్ హిల్లరీపై విజయం సాధించారు. అయితే, ఈ మూడు రాష్ట్రాల రీకౌంటింగ్‌లో ట్రంప్ కన్నా హిల్లరీ ఆధిక్యం సాధించే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ మూడు రాష్ట్రాల్లో హిల్లరీ ట్రంప్‌పై విజయం సాధిస్తే.. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశముంది.