ట్రంప్: ఇండియన్ టెకీలకు స్వీట్ న్యూస్!
- కొత్త వలసవిధానం ద్వారా భారతీయులకు లబ్ధి చేకూరే అవకాశం
వాషింగ్టన్: అమెరికాకు వలసవచ్చే విదేశీయులను గణనీయంగా తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు పలికారు. ఇంగ్లిష్ మాట్లాడే నైపుణ్యం గల వర్కర్స్‌కు 'మెరిట్ ఆధారిత' పద్ధతి ద్వారా గ్రీన్‌కార్డులు (అమెరికాలో నివాస అనుమతి) ఇవ్వాలన్న ఈ కొత్త బిల్లు.. కాంగ్రెస్ ఆమోదించి చట్టరూపం దాల్చితే.. బాగా చదువుకున్న, టెక్నాలజీ నిపుణులకు లబ్ధి చేకూర్చే అవకాశముంది. భారత్ వంటి దేశాల యువతకు ఇది సానుకూల పరిణామం అని చెప్పవచ్చు.
బలమైన ఉపాధి కోసం అమెరికా వలస విధానంలో సంస్కరణలు (రైస్) పేరిట రూపొందిన ఈ బిల్లు అమల్లోకి వస్తే అమెరికాకు వలసవచ్చేవారి సంఖ్య సగానికి తగ్గనుంది. అమెరికాలో నివాసానికి ఉద్దేశించిన గ్రీన్‌కార్డుల కోసం ప్రస్తుతం లాటరీ వ్యవస్థను అమలుచేస్తుండగా దానిని రద్దు చేసి.. పాయింట్ల ఆధారిత పద్ధతిని రైస్ బిల్లు ప్రవేశపెట్టబోతుంది. ఇంగ్లిష్ భాష నైపుణ్యం, విద్య, అధిక వేతనం గల జాబ్ ఆఫర్, వయస్సు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అమెరికాలోకి ప్రవేశం కల్పిస్తారు.
'రైస్ చట్టం పేదరికాన్ని తగ్గించి.. వేతనాలను పెంచుతుంది. అలాగే పన్నుచెల్లింపుదారుల కోట్లాది డాలర్లను కాపాడుతుంది. విదేశీయులు అమెరికా జారీచేస్తున్న గ్రీన్‌కార్డుల విధానాన్ని మార్చడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. గ్రీన్‌కార్డులు శాశ్వత నివాసాన్ని, ఉపాధి అధికారాన్ని కల్పించి.. త్వరగా పౌరసత్వం పొందేలా చేస్తాయి' అని ట్రంప్ పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ రైస్ చట్టానికి తన మద్దతు తెలిపారు.