
రేప్ బాధితురాలిపై నోరు పారేసుకున్న మంత్రి
వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ మరోసారి నోటికి పనిచెప్పారు.
కాన్పూర్: వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే ఉత్తరప్రదేశ్ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ మరోసారి నోటికి పనిచెప్పారు. అత్యాచార బాధితురాలిపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం ఆయన 'గంగా కి పుకార్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన లాయర్ తో పాటు మంత్రిని కలిసేందుకు అత్యాచార బాధితురాలు ప్రయత్నించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ విజ్ఞాపన పత్రం సమర్పించేందుకు బాధితురాలు ప్రయత్నించగా ఆమెపై ఆజంఖాన్ ఒంటికాలిపై లేచారు.
పబ్లిసిటీ కోసం పాకులాడొద్దంటూ మండిపడ్డారు. 'నీకు జరిగిన అవమానంతో అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తావా లేదా గౌరవంగా పోరాడతావా' అంటూ ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలతో బాధితురాలు అవాక్కయింది. తనకు న్యాయం చేస్తారని వస్తే నోటికి వచ్చినట్టు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది.
జూలై 27న పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్య తీసుకోలేదని బాధితురాలి తరపు న్యాయవాది తెలిపారు. అప్పటి నుంచి న్యాయం కోసం ఆమె పోరాడుతోందన్నారు. కాగా, ఆజంఖాన్ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని బీజేపీ సీనియర్ నాయకుడు లక్ష్మీకాంత్ బాజపాయ్ విమర్శించారు. అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వానికి మహిళలపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఆజంఖాన్ పై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.